Begin typing your search above and press return to search.

కరీంనగర్ ను బండి సంజయ్ ఏం డెవలప్ చేశాడు?

By:  Tupaki Desk   |   23 Sep 2022 6:17 AM GMT
కరీంనగర్ ను బండి సంజయ్ ఏం డెవలప్ చేశాడు?
X
'ఎంత సేపు విద్వేషపు మాటలు.. రెచ్చగొట్టే ప్రసంగాలు.. యువతను ఉద్రేకపరిచే చేష్టలు.. ఇవేనా అభివృద్ధి.. జనాలకు మౌలిక సదుపాయాలు కల్పిద్దాం.. కొన్ని రోడ్లు వేద్దాం.. వారికి సంక్షేమ పంచుదాం' అన్నట్టు ఏ కోశాన కూడా ఉండదు మన కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కు అని ప్రజలే ఈసడించుకుంటున్న పరిస్థితి నెలకొంది. కరీంనగర్ ఎంపీగా ఏం చేశావో చూపించయ్యా? అంటే మచ్చుకు ఒక్క అభివృద్ధి పని కూడా బండి సంజయ్ చేపట్టిన దాఖలాలు లేవు. ఎంత సేపు మోడీ భజన..

కేంద్రం నిధులు అంటాడే కానీ ఏం పనిచేశావో చూపించు అంటే మాత్రం పలాయనం చిత్తగించడం ఖాయమంటున్నారు. ఇప్పుడు కరీంనగర్ మంత్రి గంగుల కమలాకర్ సైతం తాను చేసిన అభివృద్ధి.. నువ్వు చేసిన అభివృద్ధి ఏంటో చూపించుకుందాం అని సవాల్ విసిరితే బండి తోకముడిచి డైవర్ట్ చేసిన పరిస్థితి నెలకొంది.

కరీంనగర్ ఎంపీగా సానుభూతితో లాటరీలో గెలిచనట్టు గెలిచాడు బండి సంజయ్. ఆతర్వాత జాక్ పాట్ తో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అయ్యాడు. ఒక మామూలు కార్పొరేట్ రాష్ట్ర స్థాయి నేతగా ఎదగడం వెనుక ఆయన 'నోరు' తప్పితే.. చేసిన అభివృద్ధి ఏం లేదు అన్నది ప్రజలు అంటున్న మాట.. లక్ లో భాగంగా బండి సంజయ్ గెలిచాడు కానీ.. లేదంటే అస్సలు ఆయనకు అంత సీన్ లేదంటున్నారు. ఇక మిగతా వారి కష్టాన్ని తాను హైజాక్ చేస్తున్నట్టు ఆరోపణలు న్నాయి. ఇటీవల ఉప ఎన్నికల్లో రఘునందన్ రావు, ఈటల రాజేందర్ ఇద్దరూ సొంత బలంతో గెలిచిన తర్వాత 'క్రెడిట్' అంతా బండి సంజయ్ తన ఖాతాలో వేసుకోవడమే ఇక్కడ బీజేపీ నేతలకు కూడా మింగుడు పడని వ్యవహారం.

బండి సంజయ్ ను కేవలం పార్టీలో ఉన్న బీసీ నేత అని మాత్రమే కేంద్రంలోని బీజేపీ అధిష్టానం గుర్తించింది.. రాష్ట్ర అధ్యక్ష పదవి ఇచ్చింది. ఎందుకంటే అక్కడ ప్రధాని మోడీ కూడా ఒక బీసీనే కావడం విశేషం. బీసీ అనే హైకమాండ్ బాగా ప్రాధాన్యత ఇచ్చింది. అయితే కింద స్థాయి నాయకులను బండి కలుపుకొని పోవడం లేదంట.. కరీంనగర్ గురించి ఇంత వరకూ అభివృద్ధిపై పార్లమెంట్ లో ఒక్క సారి కూడా మాట్లాడలేదు అని అక్కడి ప్రజలు ప్రశ్నిస్తున్నారు. స్మార్ట్ సిటీ అన్న పేరు చేర్చారే కానీ నగరమంతా గుంతలు, తవ్వకాలు.. అధ్వాన రోడ్లు, ప్రజలు నరకం అనుభవిస్తున్నా కనీసం బండి సంజయ్ వీటి గురించి ఇంటా బయటా.. పార్లమెంట్ లోనూ లేవనెత్తిన పాపాన పోలేదు.

అందుకే ఇప్పుడు 'కరీంనగర్ పార్లమెంటరీకి ఏం తెచ్చాడో చెప్పగలవా?' అంటూ బండి సంజయ్ ను అక్కడి ప్రజలు నిలదీస్తున్న పరిస్థితి నెలకొంది. తెలంగాణ అంతటా పాదయాత్ర చేసి ఏం లాభం అని.. సొంత నియోజకవర్గానికి ఏం చేయలేని మనిషి రాష్ట్రాన్ని ఏం ఉద్దరిస్తాడని ప్రశ్నిస్తున్నారు. కరీంనగర్ పార్లమెంట్ లో పాదయాత్ర చేసి డెవలప్ మెంట్ చూపించివచ్చు కదా? అని అంటున్నారు. కానీ ఇక్కడ పర్యటిస్తే ప్రజలు సమస్యలపై అడుగడుగునా నిలదీసే ప్రమాదం ఉంది. అందుకే సొంత నియోజకవర్గాన్ని వదిలి రాష్ట్రమంతా టూర్లు వేస్తున్నాడు బండి సంజయ్ అని విమర్శలు గుప్పిస్తున్నారు.

సొంత తల్లికే పెట్టలేని వాడు.. పినతల్లికి బంగారు గాజులు చేయిస్తాడన్న చందంగా మారింది బండి సంజయ్ పరిస్థితి అని కరీంనగర్ ప్రజలు ఎద్దేవా చేస్తున్నారు. ముందు నీ నియోజకవర్గంలో అభివృద్ధి చేసి తర్వాత రాష్ట్రమంతా తిరగాలని.. చేయాలని హితవు పలుకుతున్నారు. ఊకదంపుడు ఉపన్యాసాలు.. రెచ్చగొట్టే చర్యలతో అభివృద్ధి చేయకుండా ప్రజల కళ్లకు గంతలు కట్టలేవని ప్రజలు అభిప్రాయపడుతున్నారు.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.