Begin typing your search above and press return to search.

సజ్జల ఫోన్ క్లిప్ వైరల్ అయ్యాక బండి.. బొప్పరాజు ఏం చెప్పారంటే?

By:  Tupaki Desk   |   10 Oct 2021 3:39 AM GMT
సజ్జల ఫోన్ క్లిప్ వైరల్ అయ్యాక బండి.. బొప్పరాజు ఏం చెప్పారంటే?
X
ఏపీ ప్రభుత్వం మీద ఘాటు విమర్శలు చేయాలంటే అంత ఈజీ కాదు. దాని వెనుక లెక్కలెన్నో ఉంటాయి. ఒకవేళ.. వాటిని పట్టించుకోకుండా లైట్ తీసుకొని ప్రెస్ మీట్ లాంటిది పెట్టేస్తే.. సరిగ్గా ప్రెస్ మీట్ షురూ అవుతున్న వేళ.. ప్రభుత్వ పెద్దల నుంచి 'ఫోన్' రావొచ్చు. ఆ సందర్భంగా అవతలవారు చెప్పే మాటలు తెలీకున్నా.. ఇవతల వారు మాత్రం వంగిపోయి.. అలాలేదు సార్.. 'కంట్రోల్ లోనే పని చేస్తున్నాం' అని చెప్పక తప్పని పరిస్థితి. సరిగ్గా ఇలాంటి సీనే.. ఈ మధ్యన చోటు చేసుకోవటం.. దానికి సంబంధించిన వీడియో ఒకటి వైరల్ గా మారటం తెలిసిందే.

ఏపీలోని రెండు అతి పెద్ద ఉద్యోగ సంఘాలు (ఏపీ ఎన్జీవో జేఏసీ.. ఏపీ జేఏసీ అమరావతి నాయకులు) కలిసి పెట్టిన ఉమ్మడి ప్రెస్ మీట్ వేళ.. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తమకు ఫోన్ చేసిన మాట వాస్తవమేనంటూ ఈ రెండు సంఘాల నేతలు బండి శ్రీనివాసరావు.. బొప్పరాజు వెంకటేశ్వర్లు వెల్లడించారు. రెండు జేఏసీలు కంట్రోల్ లోనే ఉన్నాయని ఆయనకు తాము చెప్పినట్లు తెలిపారు.

ఇదంతా అర్థం కాకుంటే.. రెండు.. మూడు రోజుల వెనక్కి వెళ్లాలి. ఆ రోజున రెండు ఉద్యోగ సంఘాల ప్రతినిధులుగా ఇదే బండి.. బొప్పరాజులు ఇద్దరు ప్రెస్ మీట్ పెట్టిన వేళ.. ప్రెస్ మీట్ మొదలు కావటానికి ముందు అనూహ్యంగా బొప్పరాజు ఫోన్ మోగటం.. ఆవెంటనే అలెర్టు అయిన ఆయన సార్.. సార్.. అంటూ వినయాన్ని ప్రదర్శించటమేకాదు.. కంట్రోల్ గానే పోతాం సార్ అని చెప్పటం.. బండి తన పక్కనే ఉన్నారంటూ ఫోన్ ఇవ్వటం.. ఆ సమయంలో బండి ఎవరని అడగ్గా.. 'సజ్జల' అంటూ బొప్పరాజు సమాధానం ఇచ్చిన వైనానికి సంబంధించిన వీడియో క్లిప్ వైరల్ గా మారటం తెలిసిందే.

ఈ ఉదంతంపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. వైరల్ వీడియోతో ఆత్మరక్షణలో పడిన రెండు ఉద్యోగ సంఘాల అగ్రనేతలు తాజాగా మరో ప్రెస్ మీట్ పెట్టి.. తమకు ఫోన్ చేసింది సజ్జలేనని.. కాకుంటే ఆయన తమను బెదిరించలేదన్నారు. రెండు జేఏసీలు ఒక్కటిగా కలిసినందుకు ఫోన్లో తమకు సజ్జల శుభాకాంక్షలు చెప్పారన్నారు. తమది స్నేహపూర్వక సర్కారని.. ఉద్యోగుల సమస్యలన్నింటిని పరిష్కరించటానికి సర్కారు సిద్ధంగా ఉందని చెప్పారన్నారు. రెండు జేఏసీలు కంట్రోల్ లోనే ఉన్నాయని తెలిపామన్నారు.

ఉద్యోగ సంఘాల్ని ఆయన బెదిరించారని.. కంట్రోల్ లో ఉండమని ఫోన్లో హెచ్చరించారన్న వార్తల్లో నిజం లేదన్న ఆయన.. తాము భయపడ్డామని.. చెమటలు పట్టాయనటం సరికాదన్నారు. 'ఫ్యాన్లు ఆపివేసినందున మాకు చెమటలు పట్టాయి. అంతే తప్పించి ఎవరో బెదిరిస్తే చెమటలు పట్టలేదు. 40ఏళ్లుగా ఉద్యోగ సంఘాల్లో కీలక పదవుల్లో ఉన్నాను. అనేక మంది సీఎంలను చూశాను. భయపడటానికి మేమేమీ కొత్తగా రాలేదు. ఉద్యమాలు చేయటమూ కొత్త కాదు. మాకు ఏ రాజకీయ పార్టీతోనూ పొత్తు లేదు'' అని బండి శ్రీనివాసరావు క్లారిటీ ఇచ్చారు.

ఇక.. బొప్పరాజు మాట్లాడుతూ.. ''ప్రెస్‌మీట్‌కు ముందు సజ్జల ఫోన్‌ చేశారు. సంయమనం పాటించాలని కోరారు. అయితే, మాపై ఉద్యోగుల నుంచి తీవ్రమైన ఒత్తిడి ఉందని, ప్రభుత్వానికి చాలా సమయం ఇచ్చామని, ఇక ఓపికపట్టలేమని చెప్పాం. సజ్జల మాతో మాట్లాడిన తర్వాత ప్రభుత్వానికి సరెండర్‌ అయ్యామంటున్నారు. అయితే, ఆ ఫోన్‌ సంభాషణ తర్వాత జరిగిన విలేకరుల సమావేశంలో మా మాటతీరు మారిందా? సరెండర్‌ అయితే రెండు జేఏసీలు ఒక మహా జేఏసీగా ఎందుకు ఏర్పడతాయి? కార్యాచరణ దిశగా ఎందుకు వెళతాయి? ఉద్యోగులం కాబట్టి రాజకీయ పార్టీలు మాదిరిగా వ్యవహరించలేం'' అంటూ కాస్త సీరియస్ గానే కవర్ చేసుకున్నారు.