Begin typing your search above and press return to search.

బయటకు వెళుతున్న అచ్చెన్నను ఆపి సీఎం జగన్ ఏమన్నారు?

By:  Tupaki Desk   |   19 Nov 2021 4:57 AM GMT
బయటకు వెళుతున్న అచ్చెన్నను ఆపి సీఎం జగన్ ఏమన్నారు?
X
ఏపీ విపక్ష నేత చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం అసెంబ్లీ పరిధిలో జరిగిన ఎన్నికల్లో దారుణ పరాజయాన్ని టీడీపీ ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. ఇది జరిగిన గంటల వ్యవధిలోనే.. గురువారం అసెంబ్లీ సమావేశాల్ని నిర్వహించేందుకు వీలుగా స్పీకర్ తమ్మినేని సీతారాం అధ్యక్షతన శాసనసభా వ్యవహారాల సలహా సంఘం సమావేశం జరిగింది. ఈ సమావేశానికి స్పీకర్ తో పాటు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి.. మంత్రులు బుగ్గన.. అనిల్.. ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంతరెడ్డి తదితరులు హాజరయ్యారు.

ఈ సమావేశానికి టీడీపీ తరఫున అచ్చెన్నాయుడు హాజరయ్యారు.

ఆయన సమావేశ మందిరంలోకి వచ్చినంతనే.. ‘కమాన్.. అచ్చెన్నా ది గ్రేట్. నిన్న మీరిచ్చిన స్టేట్ మెంట్ చూశాను’ అంటూ సీఎం జగన్ ఆహ్వానించినట్లు తెలిసింది. కుప్పంలో ఓటమి గురించి అధికారపక్ష నేతలు చేసిన వ్యాఖ్యలకు అచ్చెన్న ధీటుగా సమాధానం ఇచ్చారు. ఈ సందర్భంగా సీఎం జగన్ కలుగజేసుకొని అసెంబ్లీకి చంద్రబాబును తీసుకురావాలని కోరటం.. అందుకు తప్పక వస్తారంటూ అచ్చెన్న చెప్పిన విషయం కూడా మీడియాలో వచ్చింది.

ఆ తర్వాత జరిగిన అంశాలు కవర్ కాలేదు. చంద్రబాబును సభకు తీసుకురావాలని చెప్పిన సీన్ తర్వాత.. అసెంబ్లీ సమావేశాల్ని ఎప్పటివరకు నిర్వహించాలన్న అంశం చర్చకు వచ్చింది. ఒక రోజు నిర్వహించాలని స్పీకర్ తమ్మినేని చెప్పటంతో.. సరేనన్న అచ్చెన్నా సమావేశ మందిరం నుంచి వెళ్లేందుకు లేచినట్లుగా తెలుస్తోంది. బయటకు వెళుతున్న అచ్చెన్నను ఆపిన సీఎం జగన్మోహన్ రెడ్డి.. ‘‘సభను ఎన్ని రోజులు జరపాలని అచ్చెన్న ది గ్రేట్ కోరుకుంటున్నారు’’ అని వ్యాఖ్యానించారు.

దీనికి స్పందించిన అచ్చెన్న.. కనీసం 15 రోజులైనా సభను నిర్వహిస్తే బాగుంటుందన్నారు. అదే సమయంలో సీఎం జగన్ తన చొక్కా జేబులో నుంచి చిన్న పుస్తకాన్ని తీసి.. తేదీల్ని చూసుకుంటూ.. ‘అచ్చెన్నా ది గ్రేట్ అడుగుతున్నారుగా.. కనీసం వారం రోజులైనా పెడదాం. ఈ నెల 26 వరకు సభను నిర్వహిద్దాం.

పెద్దాయన అడుగుతున్నారుగా’ అని వ్యాఖ్యానించారు. సభ నిర్వాహణకు సంబంధించిన అంశాల్ని అచ్చెన్నతో సమన్వయం చేసుకోవాలని చీఫ్ విప్ గడికోటకు సూచన చేశారు. ఇలా.. వెళుతున్న అచ్చెన్నను ఆపి మరీ ఒక రోజు కాస్తా వారం రోజులకు సభ నిర్వహణను పెంచటం ఆసక్తికరంగా మారింది. జేఏసీ సమావేశంలో అచ్చెన్నను.. తరచూ అచ్చెన్నా దిగ్రేట్ అనటం.. ఒక సందర్భంలో పెద్దాయన అని వ్యాఖ్యలు చేసిన వైనం అందరిని ఆకర్షించాయి.