Begin typing your search above and press return to search.

ఆనందయ్య మందుపై జరిగిన రివ్యూలో జగన్ చెప్పిందేమిటి?

By:  Tupaki Desk   |   25 May 2021 4:07 AM GMT
ఆనందయ్య మందుపై జరిగిన రివ్యూలో జగన్ చెప్పిందేమిటి?
X
రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ కృష్ణపట్నం ఆనందయ్య కరోనా మందు హాట్ టాపిక్ గా మారటం.. పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ ఎపిసోడ్ పై ఏపీ ప్రభుత్వం వేగంగా స్పందించటమే కాదు.. దీనిపై ఉండే అపొహల్ని తొలగించటంతో పాటు.. శాస్త్రీయతను లెక్క కట్టి.. అంతా ఓకే అయితే.. దీని తయారీలో తానే కీలక భూమిక పోషించాలన్న ఆలోచనలో ఏపీ ప్రభుత్వం ఉన్నట్లుగా చెబుతున్నారు. తాజాగా ఆనందయ్య మందుపై ఆయుష్ అధికారులతో భేటీ అయ్యారు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి.

రివ్యూలో బాగంగా మందు తయారు చేస్తున్న విధానాన్ని ముఖ్యమంత్రికి వివరించారు. కృష్ణపట్నంలో దాదాపు 35 ఏళ్ల నుంచి ఆనందయ్య మందులు అందిస్తున్నారని.. ఆయన వాడే మూలికలు ఆరోగ్యానికి నష్టం కలిగించేవి కావని.. మొత్తం ఐదు రకాల మందుల్ని ఆయన ఇస్తున్నట్లు చెప్పారు. నాలుగు నోటి ద్వారా.. ఒకటి మాత్రం కంటి ద్వారా ఇస్తున్నారు. ముందుల్ని తయారు చేసేందుకు 18 రకాల పదార్థాల్ని ఆనందయ్య వినియోగిస్తున్నారని.. అవన్నీ సహజసిద్ధంగా దొరికేవని పేర్కొన్నారు.

మందును ఎలా తయారు చేస్తారన్నది ఆనందయ్య తమకు చూపించారని.. ఫార్ములా తమకు వివరించినట్లుగా అధికారులు సీఎం జగన్ కు చెప్పారు. ఇప్పటికే వచ్చిన పరీక్షల ఫలితాల్లో ఎలాంటి ప్రతికూలత ఉండదని వచ్చిందని.. మరొకొన్ని ఫలితాలు రావాల్సి ఉందని చెప్పారు. మందు శాంపిల్ ను సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ ఆయుర్వేదిక్ స్టడీస్ కు పంపినట్లుగా చెప్పారు.

ఈ మందును వినియోగించిన 500 మందికి సంబంధించిన వివరాలు.. ఈ మందు వాడిన తర్వాత వారికి ఎలా ఉందన్న విషయాల్ని తాము సేకరిస్తున్నట్లు తెలిపారు. ఈ మందును వాడటం వల్ల ఆరోగ్య సమస్యలు ఏమైనా తలెత్తే అవకాశం ఉందా? అన్న విషయం మరో ఆరేడు రోజుల్లో తేలనుందని.. అధికారుల నుంచి నివేదిక రానున్నట్లు చెప్పారు.

అధికారులు చెప్పిన వివరాల్ని జాగ్రత్తగా విన్న ముఖ్యమంత్రి జగన్.. కంట్లో వేసే మందుకు సంబంధించి కంటి వైద్యులతో పరిశీలన చేయించాలన్న కీలక సూచన చేశారు. ఆ ఫలితాలు వచ్చిన తర్వాత ప్రభుత్వ పరంగా నిర్ణయం తీసుకుందామని చెప్పినట్లుగా తెలిసిందే. ఆనందయ్య మందు విషయంలో ఏపీ ప్రభుత్వం మొదట్నించి సానుకూలంగా ఉంటూనే.. ప్రజలకు ఎలాంటి హాని కలగని రీతిలో ఉండాలన్న ప్రయత్నం చేస్తోంది. మరి.. అధికారుల నివేదిక ఏమని వస్తుందో చూడాలి.