Begin typing your search above and press return to search.

ఫామ్ హౌస్ లో పడుకుంటాడనేటోళ్లు సైతం షాక్ తినేలా చేసిన కేసీఆర్

By:  Tupaki Desk   |   20 Oct 2021 4:48 AM GMT
ఫామ్ హౌస్ లో పడుకుంటాడనేటోళ్లు సైతం షాక్ తినేలా చేసిన కేసీఆర్
X
అందరికీ తెలిసిన విషయమే అయినా.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తాను రోటీన్ కు భిన్నమైన ముఖ్యమంత్రి అన్న విషయాన్ని ఎప్పటికప్పుడు నిరూపిస్తూనే ఉంటారు. తాజాగా తన యాదాద్రి పర్యటన సందర్భంగా ఆ విషయాన్ని మరోసారి ప్రూవ్ చేశారు. సాధారణంగా సీఎం కేసీఆర్ ను విమర్శించాలన్నంతనే.. ఫామ్ హౌస్ లో పడుకుంటారు.. ప్రజల క్షేమాన్ని పట్టించుకోరన్న రొటీన్ డైలాగ్ రాజకీయ ప్రత్యర్థుల నోటి నుంచి వస్తుంది.కానీ.. ఆయన ఎంత పని రాక్షసుడున్న విషయం అప్పుడప్పుడు ఆయన చేసే పనులలో చూపిస్తారు. మాటలతో మంత్రించినట్లుగా చేసే ఆయన.. పలు సందర్భాల్లో చేతలతో కూడా సర్ ప్రైజ్ చేస్తారు. యాదాద్రి ఆలయాన్ని త్వరలో ప్రారంభించనున్న నేపథ్యంలో సీఎం కేసీఆర్ అక్కడ జరుగుతున్న పనులు.. చేయాల్సిన కార్యక్రమాల్ని అధికారులకు.. నేతలకు స్పష్టం చేయటం తెలిసిందే.

తన తాజా యాదాద్రి పర్యటన స్పెషల్ ఏమంటే.. ఆలయంలో జరుగుతున్న పనుల గురించి వివరంగా చర్చించటంతో పాటు.. గుడి ప్రాంగణాన్ని ఆయన ఎంత సునిశితంగా పరిశీలించారన్న దానికి ఆయన గడిపిన సమయం చెప్పేస్తుంది. సాధారణంగా ఇలాంటి కార్యక్రమానికి ముఖ్యమంత్రి వస్తే.. మహా అయితే అరగంట.. లేదంటే గంట.. కాదంటే మరో గంట పడుతుంది. కానీ.. సీఎం కేసీఆర్ మాత్రం అందుకు భిన్నంగా ఎనిమిది గంటలు గడపటం గమనార్హం.

ఆలయంలో జరుగుతున్న పనులు.. జరగాల్సిన పనుల గురించి వివరించటంతో పాటు.. ఆలయ నిర్మాణం మీదన తనకున్న పట్టును ఆయన ప్రదర్శించారు. అంతేకాదు.. ఆలయాన్ని పున: ప్రారంభించాలంటే మహాకుంభ సంప్రోక్షణ చేయాల్సి ఉంటుందని.. అందుకు అవసరమేన మహా కుంభ సంప్రోక్షణ కార్యక్రమానికి ముహుర్తాన్ని రివీల్ చేశారు. మార్చి 28న ఈ కార్యక్రమాన్ని చేపట్టాలని నిర్ణయించారు. దీనికి సరిగ్గా వారం ముందు అంటే.. మార్చి 21న 108 కుండాలతో మహా సుదర్శన యాగాన్ని చేపడతామని ప్రకటించారు. మహా కుంభ సంప్రోక్షణ తర్వాత స్వయంభూ లక్ష్మీనరసింహస్వామి దర్శనాలు పున: ప్రారంభమవుతాయని వెల్లడించారు.

యాదాద్రి పర్యటనను మంగళవారం మధ్యాహ్నాం 12.40 గంటలకు మొదలై.. రాత్రి తొమ్మిది గంటల వరకు సాగుతూనే ఉంది. ఇంత సేపు ఏకధాటిగా పని చేయటం.. అది కూడా ముఖ్యమంత్రిస్థానంలో ఉన్న వారికి సాధ్యం కాదనుకుంటాం. అసలు ఇలా పని చేయాలంటే అందుకు శరీరం సహకరించాలి కదా? కానీ.. ఆ విషయంలో తనకెంత శక్తి.. సామర్థ్యాలు ఉన్నాయన్న విషయాన్ని తాజా పర్యటనతో కేసీఆర్ ఫ్రూవ్ చేశారని చెప్పాలి. మరికాస్త వివరంగా చెప్పాలంటే.. అందరికి ఇష్టమైన షాపింగ్ ను నాన్ స్టాప్ గా 8 గంటలు చేయటమంటే ఎంత కష్టం? అలాంటిది కేసీఆర్ వయసును పరిగణలోకి తీసుకుంటే.. ఆలయం చుట్టూ తిరుగుతూ.. రివ్యూల్ని నిర్వహిస్తూ ఎనిమిది గంటలు వెచ్చించడం అంత సామాన్యమైన విషయం కాదు. ఫాంహౌస్ లో పడుకుంటూ విశ్రాంతి తీసుకుంటారు అంటూ తనపై విరుచుకుపడే వారికి.. తాను పడే శ్రమను చేతల్లో చూపించి యాదాద్రి టూర్ లో సరైన పంచ్ వేశారని చెప్పక తప్పదు.