Begin typing your search above and press return to search.

కొత్త మంత్రులు 3 నెలలు ఏం చేశారంటే ?

By:  Tupaki Desk   |   8 Jun 2022 1:30 PM GMT
కొత్త మంత్రులు 3 నెలలు ఏం చేశారంటే ?
X
కొత్త మంత్రుల నియామ‌కం అయి మూడు నెల‌లు కావ‌స్తోంది. ఇప్ప‌టిదాకా వీరంతా స‌చివాల‌యం దాటి, గ‌డ‌ప‌గ‌డ‌ప‌కూ మ‌న ప్ర‌భుత్వం కార్య‌క్ర‌మంలో పాల్గొనేందుకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్న మాట వాస్త‌వ‌మే ! పాత మంత్రులు, కొత్త మంత్రులు క‌లిసి ప‌నిచేయాల‌న్న జ‌గ‌న్ మాట మాత్రం ఇక్క‌డ అమ‌లు కావ‌డం లేదు. ఇదే ఇప్పుడు పెద్ద త‌ల‌నొప్పిగా ఉంది. పాత మంత్రుల‌లో కొంద‌రు కంటిన్యూ కాగా, కొంద‌రు జిల్లాల అధ్య‌క్షులుగానూ, రీజ‌న‌ల్ కో ఆర్డినేట‌ర్లుగానూ నియ‌మితుల‌య్యారు. ముఖ్యంగా వైద్య, విద్య, విద్యుత్, ఆర్థిక, వ్య‌వ‌సాయ శాఖ‌ల‌కు సంబంధించి త‌రుచూ ఆరోప‌ణ‌లు కానీ వివాదాలు కానీ నెల‌కొంటున్నాయి. గ‌తంలో మాదిరిగా కాకుండా పాల‌న ప‌ర‌మైన నిర్ణ‌యాలు అన్నీ వేగం వేగంగా తీసుకోవాల్సిన బాధ్య‌త మంత్రుల‌పై ఉంది. కానీ మంత్రులు క్షేత్ర స్థాయిలో గడ‌ప‌గ‌డ‌ప‌కూ మ‌న ప్ర‌భుత్వం కార్య‌క్ర‌మంలో ఉండిపోవ‌డంతో పాల‌న‌పై ప‌ట్టు పెంచుకోలేక‌పోతున్నార న్న వాద‌న ఉంది. అయితే ఇదే స‌మ‌యంలో కొన్ని విమ‌ర్శ‌లూ ఉన్నాయి. అవేంటో చూద్దాం.

ముఖ్యంగా వైద్య ఆరోగ్య శాఖ‌ను విడ‌ద‌ల ర‌జ‌నీకి అప్ప‌గించాక ఆమె ఇప్ప‌టిదాకా జిల్లాల ప‌ర్య‌ట‌న‌ల‌కు పెద్ద‌గా ప్రాధాన్యం ఇవ్వ‌లేదు. తిరుప‌తి రుయాలో అంబులెన్స్ మాఫియా వెలుగు చూసినా కూడా అక్క‌డికి ఆమె వెళ్ల‌లేదు. పద‌వీ బాధ్య‌త‌లు చేప‌ట్టాక ఒక్క‌సారి మాత్ర‌మే గుంటూరు పెద్దాస్ప‌త్రికి వెళ్లి త‌నిఖీలు చేసి వ‌చ్చారు. త‌నిఖీల సంద‌ర్భంగా నెల రోజుల త‌రువాత అక్క‌డికి వ‌స్తాన‌ని చెప్పారే కానీ అది కూడా నెర‌వేర లేదు. అదేవిధంగా ప్రాంతీయ వైద్యాధికారుల‌తో ఇప్ప‌టిదాకా స‌మీక్ష‌లు ఏవీ చేప‌ట్ట‌లేదు. వీలున్నంత వ‌ర‌కూ ముఖ్య శాఖ‌ల స‌మీక్ష‌లు కూడా సీఎం మాత్ర‌మే చేస్తున్నారు. ఒక్కోసారి సంబంధిత మంత్రులు కూడా హాజ‌రు కావ‌డం లేదు.

విద్యాశాఖ‌కు సంబంధించి చూస్తే బొత్స సత్య‌నారాయ‌ణ నేతృత్వంలో న‌డుస్తున్న శాఖ ఇది. టెన్త్ పరీక్ష‌ల నిర్వ‌హ‌ణ‌లో అనేక త‌ప్పిదాలు వెలుగు చూశాయి. వాటి విష‌య‌మై మంత్రి అత్యంత బాధ్యతారాహిత్యంగా వ్యాఖ్య‌లు చేశార‌న్న ఆరోప‌ణ‌లూ ఉన్నాయి. ఆఖ‌రికి ఫ‌లితాల విడుద‌ల్లో కూడా ఏ స్ప‌ష్ట‌తా లేకుండా కొంత గంద‌ర‌గోళం సృష్టించారు. విద్యా శాఖ నిర్వ‌హ‌ణ పై ఇంకా ఆయ‌న‌కు ప‌ట్టు రాలేద‌నే అనిపిస్తోంది. తాజాగా ప‌దో త‌ర‌గ‌తి ఫ‌లితాలు విడుద‌ల కావ‌డంతో స‌ప్లిమెంట‌రికీ ఏర్పాట్లు జ‌రుగుతున్నాయి. వీటి నిర్వ‌హ‌ణ జూలై ఆరు నుంచి జ‌ర‌గ‌నుంది. వీటిపై అయినా ఆయ‌న పూర్తి దృష్టి సారిస్తే మేలు.

విద్యుత్ శాఖ కు సంబంధించి బాధ్య‌త‌లు చేప‌ట్టిన మొద‌ట్లో పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కోత‌ల నివార‌ణ‌కు కొన్ని చ‌ర్య‌లు తీసుకుంటున్నామ‌ని చెప్పారు. అదేవిధంగా ప‌రిశ్ర‌మ‌ల‌కు ప‌వ‌ర్ హాలీడే లు ప్ర‌క‌టించి కొంత మేర‌కు గృహావ‌సరాలు తీర్చారు. తాజా ప‌రిణామాల నేప‌థ్యంలో గ్రామీణ ప్రాంతాల‌లో కొద్దిపాటి కోత‌లు అయితే ఉన్నాయి. విద్యుత్ కొనుగోలుకు సంబంధించి కొన్ని స‌త్వ‌ర చ‌ర్య‌లు తీసుకున్నా కూడా సమ‌స్య‌లు అయితే త‌ప్ప‌లేదు. అదేవిధంగా విద్యుత్ ఛార్జీల పెంపుతో మంత్రి పెద్దిరెడ్డి విమ‌ర్శ‌ల పాల‌య్యారు. ఎన్న‌డూ లేనివిధంగా విద్యుత్ ఛార్జీలు ఉండ‌డంతో సామాన్యుల నుంచి తీవ్ర నిర‌స‌న వ్య‌క్తం అయింది. శాఖ పర‌మైన స‌మీక్ష‌ల‌కు అయితే పెద్దిరెడ్డి ప్రాధాన్యం ఇస్తున్నా ఇంకా ఈ శాఖ‌కు సంబంధించి కొన్ని కీల‌క నిర్ణ‌యాలు తీసుకోవాల్సి ఉంది. ప్రస్తుతానికి ప‌వ‌ర్ హాలీడేలు అయితే ప‌రిశ్ర‌మ‌ల‌కు లేవు. కొన్నిచోట్ల మాత్రం కోత‌లు త‌ప్ప‌డం లేదు.

వ్య‌వ‌సాయ శాఖ‌కు సంబంధించి ఖ‌రీఫ్ సీజ‌న్ త్వ‌ర‌లోనే ప్రారంభం కానుంది.మంత్రి కాకాణి గోవ‌ర్థ‌న్ రెడ్డి నేతృత్వంలో విత్త‌నాల పంపిణీ, ఎరువుల అమ్మ‌కం ఇంకా ఇత‌ర ప‌నులు అన్న‌వి జ‌ర‌గాల్సి ఉంది. నిన్న‌టి వేళ యంత్ర సేవా ప‌థ‌కాన్ని సీఎం జ‌గ‌న్ ప్రారంభించారు. ఇది ఏ మేర‌కు రైతులను ఆదుకోనున్న‌దో చూడాలిక. అయితే వ్య‌వసాయ రంగం తీవ్ర సంక్షోభంలో ఉంది అని చెబుతూ పంట విరామం ప్ర‌క‌టించే ప‌నిలో కోన‌సీమ రైతులు ఉన్నారు. ఈ నిర్ణ‌యాన్ని నిలువ‌రించాల్సిన బాధ్య‌త కూడా కాకాణిదే! కానీ ఆయ‌న ఎక్క‌డా త‌న వాయిస్ వినిపించ‌డం లేదు. అదేవిధంగా ఇప్ప‌టికే రైతుకు కొంత పెట్టుబ‌డి సాయం కూడా ప్ర‌భుత్వం అందించింది.

ఆ సాయం కూడా రైతుల ఖాతాల‌న్నింటికీ చేరిందో లేదో కూడా చూడాల్సిన బాధ్య‌త ఆయ‌న‌దే! కానీ ముఖ్య సంద‌ర్భాలలో ఆయ‌న మాత్రం క‌నిపించ‌డం లేదు. ఆయ‌న గొంతుక వినిపించ‌డం లేదు. ప‌దవి అందుకున్న తొలి రోజుల్లో కాస్త యాక్టివ్ గా ఉన్నా త‌రువాత ఆయ‌న పెద్ద‌గా చొర‌వ చూప‌డం లేదు అన్న విమ‌ర్శ ఉంది. ఇంకా చెప్పాలంటే వ్య‌వ‌సాయ శాఖ ప‌నులకు సంబంధించిన స‌మీక్ష‌లు కూడా సీఎం జ‌గ‌నే చేస్తున్నారు. వీరితో పాటు సాగునీటి పారుద‌ల శాఖ‌ను చూస్తున్న అంబ‌టి స్టేట్మెంట్లు కొన్ని వ‌స్తున్నాయి. అవి కూడా త‌రుచూ వివాదాస్పదం అవుతున్నాయి. పోల‌వరం విష‌య‌మై అంబ‌టికి ప‌లు సూచ‌న‌లు చేసేందుకు విశ్రాంత ఇంజ‌నీరింగ్ అధికారులు కూడా సిద్ధంగా ఉన్నారు కానీ వారి మాట ఈయ‌న వింటారో లేదో !మొత్తంగా కీల‌క శాఖల మంత్రుల ప‌నుల‌న్నింటినీ దాదాపు సీఎం మాత్ర‌మే చూస్తున్నారు. వాళ్లంతా కేవ‌లం ప‌దవుల‌కే ప‌రిమితం అవుతున్నారు అన్న వాద‌న ఉంది. విమ‌ర్శ ఉంది. వీటిపై వైసీపీ ఏం చెప్పినా కూడా కొన్ని వాస్త‌వాలు మాత్రం క్షేత్ర స్థాయిలో అత్యంత దారుణంగానే ఉన్నాయి.