Begin typing your search above and press return to search.

ముఖ్యమంత్రి పదవి దక్కాలంటే కాపులు ఏం చేయాలంటే...?

By:  Tupaki Desk   |   2 Jan 2023 10:23 AM GMT
ముఖ్యమంత్రి పదవి దక్కాలంటే కాపులు ఏం  చేయాలంటే...?
X
ఏపీలో కాపులు అతి పెద్ద సామాజికవర్గంగా ఉన్నారు. వారు తలచుకుంటేనే ఎవరైనా అందలం ఎక్కగలరు. వారు ఏ వైపు తీసుకుంటే అటు వైపు వారిదే అధికారం. అంతటి బలమైన కాపులు తన సొంత సామాజికవర్గానికి రాజ్యాధికారాన్ని మాత్రం చేరువ చేయలేకపోతున్నారు. దానికి కారణం కాపులలో ఉన్న అనైక్యత అంటున్నారు. కాపులు ఏపీలో అన్ని పార్టీలలో ఉన్నారు.

ఇక కాపు నాయకులు ముందుకు వచ్చి రాజకీయాలు చేస్తున్నారు. కీలకమైన పదవుల్లో వారు ఉన్నారు. ఒక్క ముఖ్యమంత్రి పదవి తప్ప అన్నీ వారికి అందుతున్నాయి. మరి ముఖ్యమంత్రి పదవి దక్కాలంటే కాపులు ఏం చేయాలన్నదే చర్చగా ఉంది. కాపులు వివిధ పార్టీల నాయకులు అంతా కూడా ఒక చోట చేరి మాట్లాడుకుంటున్నారు. అలాగే తాము ఏ విధంగా పటిష్టం కావాలని కూడా ఆలోచిస్తూంటారు.

కానీ ఆచరణకు వచ్చేసరికి పార్టీల కంచె దాటి ముందుకు రాలేకపోతున్నారు అని అంటున్నారు. ఈ మధ్యనే విజయవాడలో మాజీ మంత్రులు గంటా శ్రీనివాసరావు, కన్నా లక్ష్మీ నారాయణ, తెలుగుదేశం ఎమ్మెల్యే బోండా ఉమా కలసి మాట్లాడుకున్నారు. కన్నా బీజేపీలో ఉన్నారు. మరి వీరు ఏమి మాట్లాడారు అంటే తెలియడంలేదు. కాపుల కోసం ఒక కార్యాచరణ రూపొందించారు అని కూడా ప్రచారం సాగినా అది ఏమీ కాకుండానే మిగిలిపోయింది.

అంతకు ముందు చూస్తే వరసబెట్టి హైదరాబాద్ విశాఖలలో కాపు నాయకులతో మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు మీటింగ్స్ పెట్టారు. మరి వాటి తాలూకా రిజల్ట్స్ ఏమిటి అన్నది కూడా ఎవరికీ తెలియదు అంటున్నారు. ఇక కాపులకు జయంతి వర్ధంతుల వేళ వంగవీటి మోహన రంగా గుర్తుకు వస్తారు. ఆయన పేరిట సదస్సులు నిర్వహిస్తారు. ఆయనని ఘన నివాళి అర్పిస్తూ ఆయన ఆశయాలు అమలు చేస్తామని అంటారు.

కానీ కాపులు మాత్రం తలో పార్టీలో ఉంటూ అవతల వారిని తమ సామాజికవర్గం వారినే టార్గెట్ చేస్తూ ఉంటారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ని వైసీపీలో ఉన్న కాపు నేతలు అంబటి రాంబాబు, పేర్ని నాని వంటి వారు గట్టిగా కామెంట్స్ చేసారు. ఆయన మీద విమర్శలు పెద్ద ఎత్తున చేస్తూ ఉంటారు. ఇంకోవైపు చూస్తే పవన్ కళ్యాణ్ణి కాపులు తమ నాయకుడిగా సొంత చేసుకున్నా ఆయన అన్ని కులాలు వర్గాలు తమకు కావాలని కాపుల గురించి తక్కువగా మాట్లాడుతున్నారు.

ఏపీలో ముద్రగడ పద్మనాభం కాపు జాతి కోసం పోరాటం చేసినపుడు కూడా అధికార టీడీపీలో కాపు నాయకులు అలా వేరేగా ఉండిపోయారు. దాంతో ముద్రగడ పోరాటం కాస్తా ఒక దశ వరకు మాత్రమే సాగింది. ఇక కాపులకు రిజర్వేషన్లు అంటూ ఎనిమిదిన్నర పదుల వయసులో మాజీ మంత్రి హరి రామజోగయ్య అమరణ దీక్ష చేస్తున్నారు. ఆయన దీక్ష ఈ వయసులో చేయాల్సిన అవసరం వచ్చింది అంటే మిగిలిన కాపు నాయకులు ఆలోచన చేయాలి కదా అనే అంటున్నారు.

ఇంకో వైపు కాపు నాయకులను అదే సమాజికవర్గం వారు ఎంతవరకూ పట్టించుకుంటున్నారు అన్నది కూడా చర్చగా ఉంది. వంగవీటిని అంతలా అభిమానించే కాపులు ఆయన కుమారుడు రాధాను మాత్రం ఓడించేస్తున్నారు. బీజేపీకి కాపు నేత సోము వీర్రాజు ప్రెసిడెంట్ గా ఉన్నా ఆయన ప్రత్యక్ష ఎన్నికల్లో ఎపుడూ గెలవలేదు అంటే కాపుల మద్దతు ఆయనకు ఎంత ఉందో అర్ధమవుతోంది. ఇక పవన్ కళ్యాణ్ 2019 ఎన్నికల్లో ఏపీలో పోటీ చేసినపుడు రెండు చోట్లా ఓడారు. దానికి కాపుల ఓట్లు చీలికే కారణం అని చెబుతారు.

ఇపుడు జనసేన నుంచి ఒక కీలక కాపు నేత తోట చంద్రశేఖర్ కాస్తా వెళ్లి బీయారెస్ లో చేరుతున్నారు. ఈ విధంగా చూసుకుంటే కాపులు తలా ఒక పార్టీలో ఉంటున్నారు. తమ పరిధిలో తాము ఉంటూ తోచిన తీరున రాజకీయం చేస్తున్నారు. ఇక జనంలో బలమైన కాపు నాయకుడు ఇపుడు రావాల్సిన అవసరం ఉంది అని అంటున్నారు. ఆ విషయంలో కాపు యువత ముందుకు వచ్చి తమ నేతను ఎన్నుకుంటేనే భవిష్యత్తులో కాపులకు రాజ్యాధికారం తధ్యమని అంటున్నారు. లేకపోతే కాపుల అనైక్యత కాస్తా ఇతర పార్టీలకే వరంగా మారుతుంది అనే అంటున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.