Begin typing your search above and press return to search.

ఏపీ ఎంగిలికూడును మనం ఆశించటం ఏంది కేసీఆర్?

By:  Tupaki Desk   |   11 Jan 2023 9:04 AM GMT
ఏపీ ఎంగిలికూడును మనం ఆశించటం ఏంది కేసీఆర్?
X
తెలంగాణ ఉద్యమ సమయంలో ఉద్యమ అధినేతగా తనకు తాను ప్రకటించుకొన్న గులాబీ బాస్.. తరచూ సంచలన ప్రకటనలు చేసేశారు. కొత్త లాజిక్కులు బయటకు తీసేవారు. తన వాదనలో నిజాయితీని చూపించేందుకు గణాంకాల సాయాన్ని తీసుకునేవారు. ఇలా తెలంగాణ ప్రజల్లో సెంటిమెంట్ పెంచేలా చేయటమే కాదు.. ఉమ్మడి ఏపీలో తమకు జరిగిన అన్యాయం గురించి బోలెడు మాటల్ని చెప్పేవారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ప్రతి విభాగంలోనూ తెలంగాణ వాటా గురించి అదే పనిగా ప్రస్తావించటం ద్వారా.. తెలంగాణకు ఇంత అన్యాయం జరిగిందా? అన్న భావన కలిగేలా చేశారు.

ఉద్యమ సమయంలో ఉద్యమ నాయకుడి హోదాలో మాట్లాడిన కేసీఆర్ కు.. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి దానికి ముఖ్యమంత్రిగా మారిన తర్వాత ఆయనకు ఉన్న కోర్ టీంలో తెలంగాణ ప్రాంతానికి చెందిన అత్యున్నత స్థాయి అధికారులు ఎందరు ఉన్నారు? ప్రభుత్వ వ్యవస్థల్ని నడిపే ప్రధాన కార్యదర్శి మొదలు.. కీలక విభాగాలకు చెందిన వారిలో తెలంగాణ ప్రాంతీయులు ఎందరు ఉన్నారు?

సీఎస్ పదవికి తెలంగాణ.. ఆంధ్రా.. ఇదేం లెక్క సామీ. నీకు పాలనాపరమైన అంశాల మీద ఏమైనా పట్టు ఉందా? మీరు.. మీ చిల్లర రాతలు అంటూ ఒంటికాలి మీద ఎగిరిపడేవారంతా మర్చిపోకూడని విషయం ఏమంటే.. మనసు ఉంటే మార్గం ఉండకపోదు. ఓన్టీజీసీలో అత్యున్నత స్థానంలో ఉన్న నర్సింగరావును తన మాటలతో తెలంగాణకు తీసుకొచ్చిన కేసీఆర్ టాలెంట్ ను పరిగణలోకి తీసుకుంటే.. దేశ వ్యాప్తంగా ఉన్న అత్యంత సీనియర్ తెలంగాణ ప్రాంతానికిచెందిన ఐఏఎస్ లను పట్టుకొని.. మీరు రాష్ట్రానికి డిప్యూటేషన్ మీద రండి.. నేను కేంద్రంతో మాట్లాడతానని చెప్పి.. వారికి కీలక పదవులు కట్టబెడితే ఎవరు మాత్రం కాదంటారు?

తెలంగాణ ఉద్యమ సమయంలో చెప్పిన మాటలకు తగ్గట్లే చేస్తున్నారన్న భావన కలుగుతుంది. ఇవాల్టి రోజున చూస్తే.. సీఎస్ గా వ్యవహరిస్తున్న సోమేశ్ కుమార్ విషయానికి వస్తే.. ఆయన ఏపీ క్యాడర్ కు చెందిన అధికారి. కానీ.. ఆయన్ను తెలంగాణ క్యాడర్ లో ఉంచటం.. దానిపై కేంద్రం చేసిన న్యాయ పోరాటంతో ఆయన ఏపీకి వెళ్లాల్సిందేనంటూ హైకోర్టు తీర్పు ఇవ్వటం తెలిసిందే.

అయినా.. ఏపీకి కేటాయించిన అధికారిని తెలంగాణలో సీఎస్ గా పెట్టుకోవటం ఏమిటి? సాదాసీదా ఉద్యోగులకు సంబంధించి ఏపీకి చెందిన వారన్నప్పుడు వారిని వెనుకా ముందు చూడకుండా.. తమ పిల్లా పాపలు.. కుటుంబాలు దశాబ్దాల తరబడి తెలంగాణలో ఉన్న విషయాన్ని చెప్పినా.. ఆంధ్రోళ్లు ఆంధ్రాకు వెళ్లిపోవాలని చెప్పినప్పుడు.. ఆంధ్రాకు కేటాయించిన ఒక సీనియర్ ఐఏఎస్ అధికారిని తెలంగాణలో ఉంచడటంలో అర్థమేంటి? అంటే.. ఏపీ ఎంగిలికూడుకు కేసీఆర్ ఆశ పడ్డారంటే ఆయనకు ఎలా ఉంటుంది?

సాదాసీదా ఉద్యోగుల విషయంలోనూ.. తన రాజకీయానికి పనికి వచ్చే అంశాల్లో తెలంగాణ సెంటిమెంట్ ను రాజేసే కేసీఆర్.. మరి మిగిలిన విషయాల్లోనూ దాన్ని ఎందుకు పాటించరు? చట్టబద్ధంగా.. నిబంధనలు ఒప్పుకోని ఒక బిహారీ కోసం తెలంగాణ ఉద్యమ నిర్మాత ఎందుకంత తహతహలాడటం? ఇదే తహతహ ఒక తెలంగాణ ప్రాంతానికి చెందిన అధికారి కోసం పడి ఉంటే.. ఉద్యమ వేళలో ఆయన చెప్పిన మాటలకు కాస్త అయినా అర్థం ఉండేదన్నది మర్చిపోకూడదు. ఇదంతా చూసినప్పుడు ఏపీ ఎంగిలికూడుకు కేసీఆర్ తహతహలాడారన్న మాటలో వాస్తవం ఉందంటారా? లేదంటారా?


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.