Begin typing your search above and press return to search.

కేసీఆర్ వ్యూహం : హోదాకు జై కొట్టడం ఎందుకంటే

By:  Tupaki Desk   |   6 March 2018 7:10 AM GMT
కేసీఆర్ వ్యూహం : హోదాకు జై కొట్టడం ఎందుకంటే
X
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆంధ్ర వాళ్లంటేనే చిందులు తొక్కుతారని మాత్రమే అందరూ అనుకుంటూ వుంటారు. అలాంటిది ఆయన ఒక్కసారిగా ఆంధ్రప్రదేశ్ కు హోదా ఇచ్చి తీరాల్సిందేనంటూ రంకెలు వేయడం పలువురికి ఆశ్చర్యం కలిగిస్తోంది. ఒకవైపు ఏపీ కి ప్రత్యేక హోదా గురించి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా గట్టిగా అడగడం లేదు... అలాంటిది.. కేసీఆర్ ఈ రేంజ్ లో ఫైర్ కావడం ఆశ్చర్యం కలిగించడం సహజమే.

అయితే.. ఆంధ్ర ప్రదేశ్ డిమాండ్ కు దన్నుగా నిలుస్తూ... పొరుగు రాష్ట్రంగా తెలంగాణ సీఎం కేసీఆర్ గళం వినిపించడం వ్యూహాత్మకమే అని పలువురు అంచనా వేస్తున్నారు. ఈ ఒక్క మాట చెప్పడం ద్వారా కేసీఆర్ ఏపీ లో కూడా జేజేలు కొట్టించుకోగలిగారు.

నిజానికి ఏపీ కి జరుగుతున్న నష్టాన్ని ప్రస్తావించి అక్కడి ప్రజల దగ్గర మంచి మార్కులు కొట్టేయడం అనేది... కేసీఆర్ సొంత ప్లాన్ కాకపోవచ్చు. ఆయనకంటే ముందే.. పార్లమెంటులో ఏపీ ప్రత్యేకహోదాపై అనుకూలంగా గళం వినిపించడం ద్వారా ఆయన కుమార్తె కవిత మార్కులు కొట్టేశారు. ఆ వెంటనే.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో సహా పలువురు కవిత కు మద్దతు ఇవ్వడం విశేషం. అదే స్ట్రాటజీ ని కేసీఆర్ కూడా అనుసరిస్తున్నారు.

ప్రధానంగా కేసీఆర్ ఇప్పుడు జాతీయ స్థాయి నాయకుడిగా తనను తాను ఆవిష్కరించుకోవాలని అనుకుంటున్నారు. ఉత్తరాది పార్టీలు, ప్రధానంగా ఉత్తరాది ప్రాధాన్యం ఉన్న జాతీయ పార్టీల కు సవాలు విసురుతూ.. దక్షిణాది రాష్ట్రాలకు ఒక ఐక్య ప్రతినిధిగా ఎదగాలని అనుకుంటున్నారు. ఇలాంటి నేపథ్యంలో.. ఏపీ పట్ల వ్యతిరేకత ఉన్ననాయకుడిగా ముద్ర ఆయనకు పనికి రాదు. జాతీయ దృక్పథం ఉన్న నేతగా ప్రజలు గుర్తించాలంటే ఏపీ పట్ల కూడా సానుకూల దృక్పథం అవసరం అని భావించినట్లుంది.

అలాగే వచ్చే ఏడాది ఎన్నికల్లో జంట నగరాల్లో కూడా ఎమ్మెల్యే సీట్లను గెలుచుకోవాలంటే.. ఇక్కడ గణనీయంగా ఉన్న ఆంధ్రోళ్ల మద్దతును సంపాదించడం కూడా ఆయన వ్యూహమే. ఇక్కడ ఎటూ తెలుగుదేశం మనుగడలో లేదు. అలాంటప్పుడు.. ఆంధ్ర ప్రాంత ప్రజల ఓట్లను గంపగుత్తగా దోచుకోవాలనే ఆలోచన కూడా ఆయనకు ఉన్నదని.. హోదా కు జైకొట్టడం ద్వారా అది సాధ్యమవుతుందని.. ఇక్కడ తమకు పోటీగా ఎదగాలనుకుంటున్న భాజపాను కూడా బద్నాం చేసినట్లు అవుతుందని అనుకుంటున్నారని ఒక వాదన ఉన్నది.

అన్నిటినీ మించి.. ‘తాను జూ కొట్టినంత మాత్రాన హోదా రాదు. అది వస్తే వస్తుంది.. రాకపోతే రాదు. తాను జై కొట్టడం వల్ల పోయేదేముంది’ అనే ధోరణి కేసీఆర్ తో అలా పలికించిందని కొందరు భావిస్తున్నారు.