Begin typing your search above and press return to search.

శ‌నివారం రాత్రి ఏం జ‌రిగింది కేసీఆర్‌?

By:  Tupaki Desk   |   3 Sep 2018 5:14 AM GMT
శ‌నివారం రాత్రి ఏం జ‌రిగింది కేసీఆర్‌?
X
కేసీఆర్ అంటే మాట‌ల మ‌రాఠి. ఎంత‌టోడినైనా త‌న మాట‌ల‌తో ఆయ‌న ఇట్టే ప‌డేస్తారు. కోట్లాది మందిని త‌న మాట‌ల‌తో క‌దిలించేలా చేస్తారు. ఉత్సాహం ఉప్పొంగేలా మాట్లాడ‌తారు. ఏదైనా భారీ బ‌హిరంగ స‌భ‌ను పెట్టిన‌ప్పుడు త‌న మాట‌ల‌తో ప్ర‌త్య‌ర్థుల్ని చిత్త‌య్యేలా మాట్లాడ‌తారు. మ‌డిసిలో ఎట‌కారం ఎంత ఉండాలో అంత‌కు రెట్టింపును ప్ర‌ద‌ర్శిస్తారు. మొత్తంగా తాను జోష్ లో ఉంటూ.. ఎదుటివారిని సైతం అందులో ముంచెత్తేలా వ్య‌వ‌హ‌రించ‌టం కేసీఆర్ కు అల‌వాటు. అయితే.. ఇదంతా ఆదివారం నాటి ప్ర‌గ‌తి నివేద‌న స‌భ‌కు ముందు మాత్ర‌మే.

టీఆర్ ఎస్ అత్యంత ప్ర‌తిష్ఠాత్మ‌కంగా నిర్వ‌హించిన ప్ర‌గ‌తి నివేద‌న స‌భ‌లో కేసీఆర్ అద్భుతాన్ని సృష్టిస్తార‌న్న‌ట్లుగా అంచ‌నాలు వ్య‌క్త‌మ‌య్యాయి. అందుకు భిన్నంగా ఆయ‌న మాట‌లు ఉండ‌టం గులాబీ శ్రేణుల‌కు సైతం ఒక ప‌ట్టాన వంట బ‌ట్ట‌ని విధంగా మారాయి. ఏదైనా భారీ బ‌హిరంగ స‌భ‌ను నిర్వ‌హించిన ప్ర‌తిసారీ ప్ర‌త్య‌ర్థుల దుమ్ము దులిపేలా మాట్లాడ‌టం ఆయ‌న‌కు అల‌వాటు.

అందుకు భిన్నంగా ప్ర‌గ‌తి నివేద‌న స‌భ మారింది. గంట‌న్న‌ర‌కు త‌క్కువ కాకుండా మాట్లాడ‌తార‌నుకున్న కేసీఆర్‌.. అందుకు విరుద్ధంగా త‌క్కువ స‌మ‌యం మాట్లాడ‌టం.. ఆయ‌న మాట‌ల్లోనూ.. చేత‌ల్లోనూ నీర‌సంగా వ్య‌వ‌హ‌రించ‌టం ఇప్పుడు అంద‌రి నోటా ప్ర‌శ్న‌గా మారింది. శ‌నివారం సాయంత్రం ప్ర‌గ‌తి భ‌వ‌న్ లో నిర్వ‌హించిన కార్య‌క్ర‌మంలో కేసీఆర్ పాల్గొన్నారు. ఆ స‌మ‌యంలోనూ ఆయ‌న మాంచి జోష్ లోనే ఉన్న‌ట్లు చెబుతున్నారు.

విద్యుత్ ఉద్యోగుల స‌మ‌స్య‌ల‌పై మాట్లాడిన సంద‌ర్భంలోనూ కేసీఆర్ మాంచి జోష్ లోనే ఉన్నార‌ని చెబుతున్నారు. త‌న‌దైన జోకులు.. సెటైర్లు వేసి విద్యుత్ ఉద్యోగుల్ని న‌వ్వుల్ని పంచిన కేసీఆర్‌.. ఆదివారం కొంగ‌ర క‌లాన్ లో నిర్వ‌హించిన స‌భ‌లో మాత్రం అందుకు భిన్నంగా వ్య‌వ‌హ‌రించ‌టం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

శ‌నివారం రాత్రికి రాత్రి ఏమైంది? అన్న ప్ర‌శ్న ప‌లువురినోట వినిపిస్తోంది. ఈ నేప‌థ్యంలో కొంద‌రు చేస్తున్న వ్యాఖ్య‌లు.. వినిపిస్తున్న వాద‌న‌లు సిత్రంగా అనిపిస్తున్నాయి. శ‌నివారం రాత్రి వేళ‌.. కొంగ‌ర క‌లాన్ లో ఈదురు గాలులు.. పెద్ద ఎత్తున వ‌ర్షం కురిసిన సంద‌ర్భంలో అక్క‌డ ఏర్పాటు చేసిన భారీ ఫ్లెక్సీ కూలిపోవ‌టం కేసీఆర్ సెంటిమెంట్ ను బ‌లంగా దెబ్బ తీసింద‌ని చెబుతున్నారు.

సెంటిమెంట్లు.. న‌మ్మ‌కాలు ఎక్కువ‌గా ఉండే కేసీఆర్ మ‌నో ధైర్యాన్ని ఫ్లెక్సీ కూలిపోయిన ఘ‌ట‌న దెబ్బ తీసి ఉండొచ్చ‌ని చెబుతున్నారు. సోష‌ల్ మీడియాలో సైతం.. శ‌కున‌మా? అపశ‌కున‌మా? అంటూ ప‌లువురు రియాక్ట్ అయిన తీరు కేసీఆర్ ను ప్ర‌భావితం చేసిందా? అన్న‌ది ప్ర‌శ్న‌గా మారింది. ఏది ఏమైనా.. కేసీఆర్ అంటేనే జోష్ అన్న దానికి భిన్నంగా కూడా ఉంటార‌న్న కొత్త విష‌యం తాజా ప్ర‌గ‌తి నివేద‌న స‌ద‌స్సుతో తేలిన‌ట్లుగా చెబుతున్నారు. అంద‌రూ అనుకున్న‌ట్లుగా శ‌నివారం రాత్రి ఏమైనా జ‌రిగిందా కేసీఆర్ జీ?