Begin typing your search above and press return to search.

షాక్ లగా: మహారాష్ట్ర గవర్నర్ బంగ్లాలో అసలేం జరిగింది?

By:  Tupaki Desk   |   23 Nov 2019 11:10 AM GMT
షాక్ లగా: మహారాష్ట్ర గవర్నర్ బంగ్లాలో అసలేం జరిగింది?
X
అందరూ గాఢ నిద్రలో ఉన్నారు. తెల్లవారుజామున ఉదయం 5.47. మీడియా జర్నలిస్టులు, రాజకీయ నాయకులు లేట్ నైట్ పడుకొని ఉదయం సోయిలేకుండా నిద్దురపోతున్నారు.. కానీ ఢిల్లీలో మాత్రం బీజేపీ పెద్దలు అప్పుడే మేల్కొన్నారు. మహారాష్ట్ర రాజకీయాన్ని మలుపుతిప్పారు. తెల్లవారి లేచి చూసే సరికి శివసేన, కాంగ్రెస్ సహా మీడియా జర్నలిస్టుందరికీ షాకిచ్చారు. ఇదీ మోడీ-షాల మార్క్ రాజకీయంగా సంచలనం సృష్టిస్తోంది.

రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదవ.. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ తలుచుకుంటే అధికారం కొదవ.. ఇప్పుడు కేవలం మూడే మూడు గంటల్లో రాష్ట్రపతి పాలనలో ఉన్న మహారాష్ట్రలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడింది. గుట్టుచప్పుడు కాకుండా సాగిన ఈ వ్యవహారం తెల్లవారుజామున 5.47 నుంచి మొదలైంది.

మహారాష్ట్రలో బీజేపీ-ఎన్సీపీ ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి పరిణామాలు శనివారం ఉదయం అత్యంత గుట్టుచప్పుడు కాకుండా జరిగాయి. తెల్లవారుజామను ఉదయం 5.47 గంటలకు మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలనను ఎత్తివేస్తూ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఉత్తర్వులు జారీ చేశారు. గెజిట్ నోటిఫికేషన్ జారీ చేశారు. ఆ వెంటనే మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోషియారీ బీజేపీ-ఎన్సీపీలను ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించారు.

మహారాష్ట్ర గవర్నర్ నిలయమైన రాజ్ భవన్ వేదికగా ఈ గుట్టుచప్పుడు కాకుండా పరిణామాలు జరిగాయి. ఉదయం 8 గంటలకు మహారాష్ట్ర సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్ , ఉప ముఖ్యమంత్రిగా అజిత్ పవార్ లతో గవర్నర్ ప్రమాణ స్వీకారం చేశారు. తెల్లవారి శివసేన, కాంగ్రెస్, మీడియా జర్నలిస్టులు లేచేసరికే మహారాష్ట్రలో ప్రభుత్వం కొలువుదీరినట్టు తెలిసి అంతా అవాక్కయ్యారు. దీంతో కనీసం కోలుకోవడానికి, నిరసన తెలుపడానికి అవకాశం లేకుండా తెల్లవారుజామున బీజేపీ చేసిన పాలిటిక్స్ కు ‘శివసేన’ చిత్తైపోయింది.