Begin typing your search above and press return to search.

బ్రెజిల్ లో ఏమైంది? అధ్యక్ష.. సుప్రీంకోర్టు భవనాల్ని ఆక్రమించుకోవటమా?

By:  Tupaki Desk   |   10 Jan 2023 4:16 AM GMT
బ్రెజిల్ లో ఏమైంది? అధ్యక్ష.. సుప్రీంకోర్టు భవనాల్ని ఆక్రమించుకోవటమా?
X
రాజకీయ వార్తల్లో పెద్దగా కనిపించని బ్రెజిల్ పేరును ఈ రోజున ప్రధాన మీడియా సంస్థలన్ని హైలెట్ చేశాయి. ఆ దేశంలో చోటు చేసుకున్న అనూహ్య రాజకీయ పరిణామాల గురించి రిపోర్టు చేశాయి. ఈ దేశంలో చోటు చేసుకున్న పరిణామాల్ని చూసినంతనే.. ఒక్కసారిగా ఈ మధ్యన జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికలు.. అందులో రిపబ్లికన్ల తరపు దేశాధ్యక్ష పదవి కోసం పోటీ పడి.. చివరకు ఓటమి పాలైన ట్రంప్.. ఆ తర్వాత ఆయన ఓటమిపై ఆగ్రహంతో పెద్ద ఎత్తున హింసాకాండకు తెర తీయటం.. పార్లమెంట్ భవనాన్ని టార్గెట్ చేసేందుకు వెనుకాడకపోవటం.. అందులోకి చొచ్చుకుపోయిన తీరు పెను సంచలనంగా మారింది. ఆ సందర్భంగా చోటు చేసుకున్న హింస ప్రపంచ వ్యాప్తంగా పెను సంచలనంగా.. భారీ షాకింగ్ గా మారటం తెలిసిందే.

అయితే.. ఇలాంటి ఉపద్రవాల్ని కంట్రోల్ చేయటానికి సుశిక్షితులైన బలగం ఆ దేశంలో ఉన్నప్పటికీ.. అల్లర్లు.. ఆందోళనను కంట్రోల్ లోకి తేవటానికి చాలానే కష్టపడాల్సి వచ్చింది. ఇదంతా ఎందుకంటే.. ట్రంప్ మద్దతుదారులు తమ అధినేత ఎన్నికల్లో ఓటమి పాలు కావటంతో ఆగ్రహానికి గురైన పరిస్థితుల్లో ఇలా జరిగినట్లుగా చెప్పటం తెలిసిందే. అయితే.. ఈ ఆరాచకం వెనుక ట్రంప్ ఆశీస్సులు ఉన్నాయన్న విషయం తెలిసిందే. సరిగ్గా ఇలాంటి పరిస్థితే బ్రెజిల్ లో తాజాగా చోటు చేసుకుంది.

ఉత్తర అమెరికాలోని అతి పెద్ద ప్రజాస్వామ్య దేశాల్లో ఒకటిగా బ్రెజిల్ ను చెప్పొచ్చు. విస్తీర్ణం లెక్కన చూస్తే.. మన దేశం కంటే మూడు రెట్లు ఎక్కువ విస్తీర్ణం ఉన్న బ్రెజిల్ జనాభా మాత్రం కేవలం 20 కోట్లు మాత్రమే. తాటిచెట్ల భూమిగా పేరున్న ఈ దేశం ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశాల్లో ఒకటిగా పేరుంది. అలాంటి ఈ దేశంలో ఇటీవల దేశాధ్యక్ష ఎన్నికలు జరిగాయి. అందులో లూయిజ్ ఇన్సియో లూలా డసిల్వా చేతిలో ఆయన ప్రత్యర్థి జైర్ బోల్సోనారో ఓటమిపాలు అయ్యారు.

దీంతో తమ నాయకుడి ఓటమిని జీర్ణించుకోలేని ఆయన మద్దతుదారులు.. దేశ రాజధాని బ్రసీలియాలోని దేశాధ్యక్ష భవనంతో పాటు.. సుప్రీంకోర్టు.. కాంగ్రెస్ భవనాల్ని అక్రమించే ప్రయత్నం చేశారు. ఇందులో భాగంగా ఆయా భవనాల ముందున్న బారికేడ్లను బద్దలుకొట్టి.. భవనాల గోడలు ఎక్కేశారు. అద్దాలు.. కిటికీల్ని ధ్వంసం చేశారు. సుప్రీంకోర్టులో న్యాయమూర్తులు కూర్చునే టేబుళ్లను ధ్వంసం చేయటం చూస్తే.. ఓటమి పాలైన నేత మద్దతుదారుల ఆరాచకం ఏ స్థాయిలో ఉందో ఇట్టే అర్థం చేసకోవచ్చు. ఇక.. అక్కడి ఫర్నీచర్ ను.. సామాన్లను ఇష్టారాజ్యంగా ధ్వంసం చేసిన వారిని అదుపులోకి తీసుకోవటం కోసం భద్రతా దళాలు పడిన కష్టం అంతా ఇంతా కాదు.

ఊహించని రీతిలో చోటు చేసుకున్న పరిణామాలతో ఉలిక్కిపడిన సైన్యం ఎంట్రీ ఇచ్చిన తర్వాత కానీ సీన్ మారలేదు. మొత్తంగా 300 మందిని అదుపులోకి తీసుకున్నారు. దీనిపై దేశాధ్యక్షుడు సీరియస్ గా స్పందించటం వరకు ఓకే కానీ.. ఇలాంటిదేదో జరుగుతుందని రాజకీయ విశ్లేషకులు పెద్ద ఎత్తున హెచ్చరిస్తున్న వైనం చూసినప్పుడు.. నిఘా వ్యవస్థ నిద్ర పోతుందా? అన్న సందేహం కలుగక మానదు. అధ్యక్ష ఎన్నికల్లో డసిల్వా గత ఏడాది అక్టోబరు 30న విజయం సాధించిన తర్వాత నుంచి ఓటమికి పాలైన వర్గంనుంచి నిరసనలు.. ఆందోళనలు చోటు చేసుకుంటున్నాయి.

తాజా పరిణామాలపై స్పందించిన అధ్యక్షుడు డసిల్వా గవర్నర్ పై వేటు వేశారు. మిగిలిన వారిపై చర్యలకు సిద్ధమయ్యారు. ఇదిలా ఉంటే.. ఈ మొత్తం ఎపిసోడ్ కు కేంద్ర బిందువుగా మారిన మాజీ అధ్యక్షుడు జైర్ బోల్సోనార్ మాత్రం కడుపు నొప్పి కారణంగా ఆసుపత్రిలో చేరటం గమనార్హం. ఆయన తీవ్రమైన కడుపునొప్పితో బాధ పడుతున్నట్లుగా ఆయన సతీమణి పేర్కొన్నారు. ఇక్కడో ఆసక్తికర విషయాన్ని ప్రస్తావించాలి. ప్రస్తుతం ఈ పెద్ద మనిషి ఎక్కడ ఉన్నారో తెలుసా? అమెరికాలో. అవును.. ఫ్లోరిడాలో ఉన్న ఆయన.. అడ్వెంట్ హెల్త్ సెలబ్రేషన్ అక్యూట్ కేర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఎన్నికల్లో ఓడినప్పటికీ ఆయన పదవీ కాలం జనవరి 2 వరకు ఉంది. అయితే.. దానికి రెండు రోజుల ముందే అంటే.. డిసెంబరు 31న ఆయన అమెరికాకు వెళ్లిపోవటం.. ఇది జరిగిన తొమ్మిది రోజులకే ఇలాంటి పరిణామాలు చోటు చేసుకోవటంపై పలు సందేహాలు.. అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.