Begin typing your search above and press return to search.

రాజాసింగ్ వ్యాఖ్యల నేపథ్యంలో పాతబస్తీ ఇప్పుడెలా ఉంది?

By:  Tupaki Desk   |   24 Aug 2022 7:30 AM GMT
రాజాసింగ్ వ్యాఖ్యల నేపథ్యంలో పాతబస్తీ ఇప్పుడెలా ఉంది?
X
కారణం ఏదైనా కావొచ్చు.. చాలా కాలం తర్వాత పాతబస్తీలో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. తప్పు ఎవరిదన్న దాన్ని పక్కన పెడితే.. వివాదాస్పద స్టాండప్ కమెడియన్ మునావర్ ఫారుఖీ హైదరాబాద్ షోతో మొదలైన రచ్చ... సోమవారం అర్థరాత్రి దాటిన తర్వాత పోస్టు చేసిన గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ వివాదాస్పద వీడియోతో పరిస్థితులు మారాయి. పాతబస్తీలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మంగళవారం ఉదయం మొదలైన నిరసనలు.. ఆందోళనలతో సిటీలో ఎప్పుడేం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి నెలకొంది.

వివాదాస్పద వీడియోను యూట్యూబ్ లో పోస్టు చేయటం.. అది కాస్తా కొద్ది గంటలకే డిలీట్ చేయటం.. అప్పటికే పాతబస్తీలో నిరసనలు పెల్లుబుకాయి. వివాదాస్పద పోస్టు పెట్టిన రాజాసింగ్ ను పోలీసులు అరెస్టు చేసి నాంపల్లి కోర్టులో హాజరు పర్చటం.. నిబంధనల ప్రకారం పోలీసులు అరెస్టు చేయని నేపథ్యంలో ఆయన్ను బెయిల్ మీద విడుదల చేశారు. ఇదిలా ఉంటే.. బెయిల్ మీద రాజాసింగ్ విడుదల కావటాన్ని నిరసిస్తూ.. మంగళవారం అర్థరాత్రి వేళలో పాతబస్తీలోని పలు ప్రాంతాల్లో పెద్ద ఎత్తున నిరసనలు చోటు చేసుకున్నాయి.

మొగల్ పుర.. శాలిబండ.. చంచల్ గూడ.. అలియాబాద్.. సయ్యద్ అలీ చబుత్రా.. చార్మినార్.. లాడ్ బజార్.. దారుల్ షిఫా..గుల్జార్ హౌస్ ప్రాంతాల్లో యువత పెద్ద ఎత్తున రోడ్ల మీదకు వచ్చారు. కాలం గడుస్తున్నకొద్దీ ఆందోళనల తీవత్ర ఎక్కువ కావటంతో పోలీసులు ఉరుకులు పరుగుల మీద అదనపు భద్రతా సిబ్బందిని మొహరించారు. పలుచోట్ల రాజాసింగ్ దిష్టిబొమ్మను దగ్థం చేశారు. రాజాసింగ్ పై చర్యలు తీసుకోవాలంటూ భారీ ఎత్తున నినాదాలు చేశారు.

మొగల్ పురా ప్రాంతంలో పోలీసులపైనా.. వాహనాలపైనా ఆందోళనకారులు రాళ్లు రువ్వారు. ఈ ఉదంతంలో పలువురికి గాయాలు అయ్యాయి. అలియాబాద్ క్రాస్ రోడ్డులో చేపట్టిన ర్యాలీలో నిరసనకారులు రాళ్లు రువ్వటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు.

మంగళవారం రాత్రి 10 గంటలకు మొదలైన ఆందోళనలు అర్థరాత్రి దాటిన తర్వాత పెద్దవి అయ్యాయి. అదనపు భద్రతా బలగాలు పెద్ద ఎత్తున మొహరించి.. స్థానికులతో కలిసి చర్చలు జరిపి.. పరిస్థితుల్ని అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేశారు.

మొత్తంగా మంగళవారం రాత్రి పాతబస్తీలోని పలు ప్రాంతాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ రోజు ఉదయం (బుధవారం) కూడా పలువురు నిరసనలు చేపట్టారు. ముందస్తు జాగ్రత్తగా పెద్ద ఎత్తున పోలీసుల్ని మొహరించారు. మరోవైపు నిరసన ర్యాలీలు నిర్వహించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు చెబుతున్నారు. నివురు గప్పిన నిప్పులా పాతబస్తీ ఉన్న పరిస్థితి.