Begin typing your search above and press return to search.

ఉండవల్లి అఖిలపక్ష భేటీలో ఏం జరిగిందంటే..

By:  Tupaki Desk   |   29 Jan 2019 11:20 AM GMT
ఉండవల్లి అఖిలపక్ష భేటీలో ఏం జరిగిందంటే..
X
మొత్తానికి ఉండవల్లి అరుణ్‌ కుమార్‌ ఏర్పాటు చేసిన అఖిలపక్ష భేటీ ప్రశాంతంగానే ముగిసింది. ఈ కార్యక్రమానికి అహ్వానించిన అన్ని పార్టీల వాళ్లు వచ్చారు. ఒక్క వైసీపీ, సీపీఎం తప్ప. టీడీపీతో భేటీ షేర్‌ చేసుకునే ఉద్దేశం తనకు లేదు కాబట్టి.. భేటీకి రామని వైసీపీ ముందే చెప్పేసింది. ఇక బీజేపీ ఉంటే తాము రామని సీపీఎం కూడా చెప్పింది. టీడీపీ నుంచి మంత్రులు సోమిరెడ్డి, నక్కా ఆనంద్‌ బాబు హాజరయ్యారు. జనసేన నుంచి పవన్‌ కల్యాణ్‌, బీజేపీ నుంచి ఐవైఆర్‌ కృష్ణారావు సమావేశానికి వచ్చారు. అలాగే మాజీ న్యాయమూర్తి జాస్తి చలమేశ్వర్‌, ప్రణాళికా సంఘ ఉపాధ్యక్షుడు కుటుంబరావు కూడా వచ్చారు.

భేటీ మొదలుకాగానే.. హామీల అమలు పైనే ప్రధానంగా చర్చ జరిగింది. యూపీఏ ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఏమాత్రం అమలు కాలేదనే ప్రస్తావన వచ్చింది. ఆ తర్వాత ఎన్డీయే ప్రభుత్వం కూడా హామీల విషయంలో నిర్లక్ష్యం చూపించిందని అఖిలపక్షం అభిప్రాయ పడింది. మన హక్కుల సాధనకు అందరూ కలిసికట్టుగా పోరాడాలని ఈ సందర్భంగా ఏకవ్యాఖ్య తీర్మానం చేశారు. ఇక బీజేపీ ప్రభుత్వం ఏపీ ఎంత ఇచ్చింది అనే విషయంపై కాసేపు కుటుంబరావు, ఐవైఆర్‌ కృష్ణారావు మధ్య వాగ్వాదం జరిగింది. దాదాపు అరగంటకు పైగా వీరిద్దరూ లెక్కల విషయంలో వాదించుకున్నారు. ఫైనల్‌ గా అందరూ కలుగచేసుకోవడంతో.. అఖిలపక్ష భేటీ ముగిసింది. త్వరలో ఎన్నికలు రానున్న నేపథ్యంలో ఎన్నికలు అయిన తర్వాత కేంద్రం పై అందరూ కలిసి పోరాడాలని ఈ సందర్భంగా నిర్ణయం తీసుకున్నారు.

ఈ సమావేశంలో పవన్ క‌ళ్యాణ్‌ మాట్లాడుతూ ఏపీ విభజన రాజ్యాంగ విరుద్ధమని అన్నారు. ఎవరు ఏ లెక్కలు చెప్పినా.. రాష్ట్రానికి అన్యాయం జరిగిందనడంలో సందేహం లేదన్నారు. కేంద్రం ఎంత ఇవ్వాలి అనే అంశం పై భిన్నాభిప్రాయాలు ఉన్నాయనన్న ఆయన.. ఉండవల్లి ప్రవేశపెట్టిన తీర్మానానికి తన సంపూర్ణ మద్దతు ఉంటుందన్నారు. రాష్ట్రానికి జరిగిన అన్యాయం పై అన్ని రాజకీయ పార్టీలూ స్పందించాలన్నారు. ఇప్పుడు గొంతెత్తకపోతే భవిష్యత్తు తరాలు ఇబ్బంది పడతారని జనసేన అధినేత పవన్‌కల్యాణ్ అన్నారు.