Begin typing your search above and press return to search.

గవర్నర్ తో జగన్ భేటీ... ఏం చెప్పారంటే?

By:  Tupaki Desk   |   16 April 2019 11:27 AM GMT
గవర్నర్ తో జగన్ భేటీ... ఏం చెప్పారంటే?
X
ఏపీ విపక్ష నేత, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కాసేపటి క్రితం తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ ఈఎస్ ఎల్ నరసింహన్ తో భేటీ అయ్యారు. పార్టీకి చెందిన సీనపియర్ నేతలను వెంటేసుకుని హైదరాబాదులోని రాజ్ భవన్ కు వెళ్లిన జగన్... నరసింహన్ తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా జగన్ పలు అంశాలకు సంబంధించి గవర్నర్ తో చర్చించడమే కాకుండా... పోలింగ్ లో తమకు ఎదురైన అనుభవాలు, టీడీపీ నేతల దౌర్జన్యాలు, ఏపీ పోలీసులు వ్యవహరించిన తీరుపై సమగ్రంగానే వివరించారు.

అధికార పార్టీగా ఉన్న టీడీపీ... ఈ ఎన్నికల్లో ఎలాగైనా గెలిచేయాలన్న కసితో చేయరాని పనులన్నీ చేసిందని, టీడీపీ నేతలు బరి తెగించి వ్వవహరించారని గవర్నర్ కు ఫిర్యాదు చేశారు. గవర్నర్ తో భేటీ అనంతరం రాజ్ భవన్ వద్దే మీడియాతో మాట్లాడిన జగన్... తాను గవర్నర్ కు చెప్పిన అంశాలేమిటన్న వివరాలను వెల్లడించారు. అంతేకాకుండా పోలింగ్ ముగిసిన తర్వాత తమ పార్టీ ప్రతినిధులు కేంద్ర ఎన్నికల సంఘానికి చేసిన ఫిర్యాదునే మళ్లీ గవర్నర్ కు చేశామని కూడా ఆయన చెప్పుకొచ్చారు. గవర్నర్ వద్ద జగన్ లేవనెత్తిన అంశాలేమిటన్న విషయానికి వస్తే...

- వైసీపీ కార్యకర్తలు, నేతలపై దాడులు జరిగితే...దాడులు చేసిన టీడీపీ నేతలపై కేసులు పెట్టకుండా... తిరిగి వైసీపీ నేతలపైనే కేసులు ఎలా పెట్టారు?

- సత్తెనపల్లి నియోజకవర్గంలో పోలింగ్ బూత్ లోకి వెళ్లి తలుపులు వేసుకున్న కోడెల శివప్రసాద్ పై కేసు ఎందుకు పెట్టలేదు?

- పోలింగ్ బూత్ లోకి వెళ్లి.. తన చొక్కాను తానే చించేసుకున్న కోడెల రాద్ధాంతం చేయడం కరెక్టేనా?

- గురజాల నియోజకవర్గంలో తమకు ఓటేయలేదని ఎస్సీలు, ముస్లింలపై దాడికి దిగిన టీడీపీ నేతలపై కేసులు ఎందుకు పెట్టలేదు?

- పూతలపట్టు నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి ఎంఎస్ బాబుపై టీడీపీ నేతలే దాడికి దిగితే... వారిపై కేసు పెట్టకుండా తిరిగి ఆ దాడిలో ఆస్పత్రి పాలైన బాబుపైనే కేసు ఎలా పెట్టారు?

- తమ పార్టీ ఎమ్మెల్యే పుష్ప శ్రీవాణీని గదిలో బందించి టీడీపీ నేతలు దాడి చేస్తే కేసులు ఎందుకు పెట్టలేదు?

- చంద్రబాబు సరిగ్గా ఎన్నికలకు ముందు తన సామాజిక వర్గానికి చెందిన 40 మంది పోలీసులకు డీఎస్పీలుగా పదోన్నతి కల్పించి వారితోనే అక్రమ కేసులు పెట్టించారు.

- మచిలీపట్నంలో స్ట్రాంగ్ రూం తలుపు తీసి ఈవీఎంలను ఎందుకు బయటకు తీశారు?

- స్ట్రాంగ్ రూంల వద్ద కేంద్ర బలగాలనే నియమించాలి. రాష్ట్ర పోలీసులను అక్కడి నుంచి తప్పించాలి.

- బాబు పాలనలో చోటుచేసుకున్న అవినీతి అక్రమాలకు సంబంధించిన ఆధారాలను తొలగించే పని సెక్రటేరియట్ లో యధేచ్ఛగా సాగుతోంది.

- రాష్ట్రంలో ఆపద్ధర్మ ప్రభుత్వం ఉన్న నేపథ్యంలో నిధులు రిలీజ్ చేయకుండా సీఎస్ కు ఆదేశాలు జారీ చేయాలి.
ఇలా పలు అంశాలపై గవర్నర్ వద్ద ప్రస్తావించిన జగన్... వాటిపై తక్షణమే చర్యలు చేపట్టేలా ఆదేశాలు జారీ చేయాలని గవర్నర్ ను కోరినట్టు తెలిపారు.