Begin typing your search above and press return to search.

భారత్ పై విజయం సాధించాక పాక్ డ్రెస్సింగ్ రూంలో ఏం జరిగింది?

By:  Tupaki Desk   |   25 Oct 2021 12:30 PM GMT
భారత్ పై విజయం సాధించాక పాక్ డ్రెస్సింగ్ రూంలో ఏం జరిగింది?
X
ఫార్మాట్ ఏదైనా సరే.. ప్రపంచ కప్ టోర్నీలో భారత్.. పాకిస్థాన్ మధ్య మ్యాచ్ జరిగితే.. విజయం టీమిండియానే వరించేది. ఇప్పటివరకు ఉన్న ఈ రికార్డును బ్రేక్ చేసింది పాకిస్థాన్ జట్టు. తాజాగా జరిగిన టీ20 వరల్డ్ కప్ మ్యాచ్ లో భారత్ ను దారుణంగా ఓడించిన వైనం కోట్లాది మంది క్రికెట్ అభిమానుల్ని షాక్ కు గురి చేసింది. పసికూనపై గెలిచినంత సింఫుల్ గా భారత్ పై పాక్ విజయం సాధించటాన్ని క్రికెట్ అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు.

మరి..ఇంతటి అపురూపమైన విజయం సాధించిన తర్వాత పాక్ క్రికెట్ టీం డ్రెస్సింగ్ రూంలో ఏం జరిగింది? పెద్ద ఎత్తున సంబరాలు జరిగాయా? లాంటి ప్రశ్నలకు సమాధానాలు వెతికితే.. ఆశ్చర్యకరమైన విషయాలు బయటకు వస్తాయి. టీమిండియాపై సంచలన విజయం తర్వాత.. పాక్ డ్రెస్సింగ్ రూంలో ఎలాంటి వేడుకలు.. సంబరాలు జరగలేదట. ఆ మాటకు వస్తే.. మ్యాచ్ తర్వాత డ్రెస్సింగ్ రూంలో సీరియస్ సమావేశం ఒకటి జరిగిందట.

టీమిండియా మీద గెలుపు ఒక మ్యాచ్ లో విజయమే తప్పించి.. టోర్నీని గెలవలేదన్న విషయాన్ని జట్టు కెప్టెన్ బాబర్ ఆజమ్ వివరించినట్లు చెబుతున్నారు. ‘మనం గెలిచింది ఒక్క మ్యాచ్ మాత్రమే’ అంటూ ఆటగాళ్లకు హితబోధ చేసిన ఆయన.. భారత్ పై మ్యాచ్ గెలిచామన్న అతి విశ్వాసానికి వెళ్లకూడదన్నారు. తమ టార్గెట్ అయిన వరల్డ్ కప్ ను సాధించటాన్ని మర్చిపోకూడదని.. దీని కోసం ప్రతి ఒక్కరు వందశాతం శ్రమించాలని కోరినట్లుగా చెబుతున్నారు. జట్టు కోచ్ ముస్తాక్ సైతం.. జట్టు సభ్యులంతా ప్రపంచ కప్ సాధన మీద ఫోకస్ చేయాలని.. అదే తమ లక్ష్యం కావాలన్న మాటను చెప్పినట్లుగా తెలుస్తోంది. ఒక మ్యాచ్ విజయాన్ని టోర్నీ విజయంగా భావించకపోవటం చూస్తే.. పాక్ జట్టు వాస్తవిక ధోరణిని ప్రదర్శిస్తున్నట్లుగా చెప్పక తప్పదు.