Begin typing your search above and press return to search.

కౌన్సిల్ మీటింగ్ పెడితే.. ఆస్తుల్నిధ్వంసం చేస్తారా?

By:  Tupaki Desk   |   24 Nov 2021 1:30 PM GMT
కౌన్సిల్ మీటింగ్ పెడితే.. ఆస్తుల్నిధ్వంసం చేస్తారా?
X
కమలనాథులకు ఏమైంది? విలువలు.. సిద్ధాంతాల పేరు చెప్పి మాటలు చెప్పే బీజేపీ నేతలు తాము చెప్పే మాటలకు భిన్నంగా వారి చేతలు ఉండటం గమనార్హం. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లో నిర్వహించాల్సిన కౌన్సిల్ సమావేశాన్ని సమయానికి నిర్వహించలేదన్న కోపంతో బీజేపీ కార్పొరేటర్లు చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. నిబంధనల ప్రకారం ప్రతి మూడు నెలలు (90 రోజులు)కు ఒకసారి కౌన్సిల్ సమావేశాన్ని నిర్వహించాలి. కరోనా నేపథ్యంలో వర్చువల్ మీటింగ్ ను ఏర్పాటు చేశారు.

తాజాగా ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో మూడు నెలలు దాటిన తర్వాత కూడా కౌన్సిల్ సమావేశాన్ని నిర్వహించలేదు. గతంలో అయితే.. మొత్తం కార్పొరేటర్లు అధికార టీఆర్ఎస్ కు చెందిన వారే ఉండటంతో.. షెడ్యూల్ ప్రకారం సమావేశాల్ని నిర్వహించేవారు. తాజాగా జరిగిన ఎన్నికల్లో టీఆర్ఎస్ అధిక్యత బాగా తగ్గిపోవటం.. అంచనాలకు మించి బీజేపీ అభ్యర్థుల్ని విజయం సాధించటంతో.. అధికార పార్టీకి ధీటుగా బదులిచ్చే పరిస్థితి ఉంది. ఈ కారణంతో కౌన్సిల్ సమావేశాన్ని వాయిదా వేసేందుకే ఎక్కువ ఆసక్తి చూపుతున్నారన్న విమర్శ ఉంది.

నిజానికి కౌన్సిల్ సమావేశాన్ని నిర్వహించాలన్న డిమాండ్ తో ఆందోళన చేయటం.. నిరసన చేపట్టటం తప్పేం కాదు. ఆ పేరుతో విధ్వంసాన్ని క్రియేట్ చేయటం.. తాళం వేసి ఉన్న మేయర్ ఛాంబర్ తలుపుల్ని డ్యామేజ్ చేసి మరీ లోపలకు దూసుకెళ్లటం.. మేయర్ ఆఫీసులోపలి టేబుల్ మొదలుఅక్కడ ఉన్న ఫర్నీచర్ ను ధ్వంసం చేయటం ఏ మాత్రం హర్షించే పరిణామం కాదు.

వారు ధ్వంసం చేసింది మొత్తం ప్రజల ఆస్తిని.. తాము పరిరక్షించాల్సిన ఆస్తుల్ని అన్న విషయాన్ని బీజేపీ కార్పొరేటర్లు మర్చిపోయినట్లుగా వ్యవహరించారు. జరిగిన దాడితో టీఆర్ఎస్ వర్గీయులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు.

ప్రజాప్రతినిధులుగా ఉండి ఆస్తుల్ని ధ్వంసం చేయటం ఏమిటని మండిపడుతున్నారు. తాజాగా ఈ ఉదంతంపై మాట్లాడిన మేయర్ గద్వాల విజయలక్ష్మీ మాట్లాడుతూ.. ప్రజాప్రతినిధులుగా ఉంటూ ఆస్తుల మీద దాడి చేయటంపై బీజేపీ కార్పొరేటర్లు ఆత్మపరిశీలన చేసుకోవాలని.. రాజ్యాంగ పరమైన పదవిలో ఉండి ఇలాంటి దాడులకు పాల్పడితే ప్రజలకు వ్యవస్థలపై నమ్మకం పోతుందని మండిపడ్డారు.

కరోనా తీవ్రత ఉన్న సమయంలో జూన్ 29న వర్చువల్ విధానంతో జనరల్ బాడీ సమావేశాన్ని నిర్వహించామని.. రాజకీయాలకు అతీతంగా కార్పొరేటర్లు విన్నవించిన సమస్యల్ని పరిష్కరించిన గద్వాల విజయలక్ష్మీ చెబుతున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఉన్న వేళ జనరల్ బాడీ మీటింగ్ పెట్టలేని పరిస్థితి ఉందని.. ఇవన్నీ తెలిసే బీజేపీ కార్పొరేటర్లు దాడి ఎలా చేస్తారని ప్రశ్నిస్తున్నారు.

జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో బీజేపీ కార్పొరేటర్లు దాడి చేసి.. ఆస్తుల్ని ధ్వంసం చేసిన వైనంపై సైఫాబాద్ పోలీస్ స్టేషన్ లో 20మంది వరకు కార్పొరేటర్లు.. బీజేపీనేతలపై కేసులు నమోదు చేశారు. మిగిలిన రాజకీయాలు ఎలా ఉన్నా.. ప్రజాప్రతినిధులుగా దాడులు చేయటం ఏ మాత్రం సబబు కాదని చెప్పక తప్పదు.