Begin typing your search above and press return to search.

సీఎం కేసీఆర్ కి ఏమైంది ? ఆయన ఆరోగ్యంపై హెల్త్ బులెటిన్ కి రేవంత్ రెడ్డి డిమాండ్ !

By:  Tupaki Desk   |   8 July 2020 7:45 AM GMT
సీఎం కేసీఆర్ కి ఏమైంది ? ఆయన ఆరోగ్యంపై హెల్త్ బులెటిన్ కి రేవంత్ రెడ్డి డిమాండ్ !
X
తెలంగాణ లో కరోనా మహమ్మారి పాజిటివ్ కేసులు రోజురోజుకి భారీగా పెరుగుతున్నాయి. ఇదే సమయంలో ప్రభుత్వం పాత సెక్రెటేరియేట్ కూల్చివేత పనులు కూడా ప్రారంబించింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో కరోనా విజృంభణ , సచివాలయ కూల్చివేత పై మంగళవారం మధ్యాహ్నం రేవంత్ రెడ్డి జూమ్ యాప్ ద్వారా విలేకరుల సమావేశం నిర్వహించారు. గవర్నర్ పిలిచినా రాకుండా తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడ్డారని , కాబట్టి వెంటనే సీఎస్‌ను, ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి ని విధుల్లోంచి తొలగించాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు.

కేంద్ర మంత్రిగా కిషన్ రెడ్డి ఉండి ఇంత జరుగుతున్నా పట్టించుకోవడం లేదని రేవంత్ రెడ్డి మండి పడ్డారు. బీజేపీ, టీఆర్ఎస్ కలిసి ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని విమర్శించారు. సీఎం కేసీఆర్ హైదరాబాద్ ప్రజలను గాలికొదిలేసి ఫాంహౌస్‌కి వెళ్లిపోయారని మండిపడ్డారు. గవర్నర్ తమ హక్కులను ఉపయోగించుకోవాలని, గవర్నర్‌కి ప్రభుత్వ అధికారులు స్పందించకపోతే కేంద్ర మంత్రి కలగజేసుకోవాల‌ని అన్నారు. పీవీ శత జయంతి రోజు మాయమైన‌ సీఎం ఇప్పటి వరకు కనిపించడం లేదని రేవంత్ అన్నారు. సీఎం కేసీఆర్ ఆరోగ్యం పై హెల్త్ బులిటెన్ విడుదల చెయ్యాలని డిమాండ్ చేశారు.

హైదరాబాద్ ‌లోని భవనాలన్నీ గవర్నర్ ఆధీనంలో ఉంటాయని, సెక్రటేరియట్ కూల్చివేసే ముందు గవర్నర్ అనుమతి ప్రభుత్వం తీసుకుందా అని రేవంత్ ప్రశ్నించారు. మూడు రోజుల్లో కేబినెట్ భేటీ ఉంటుందని, హైదరాబాద్‌లో లాక్‌డౌన్ అనే వార్తలతో ప్రజలంతా హైదరాబాద్ ఖాళీ చేస్తున్నారని అన్నారు. అంతేగాక, సెక్షన్-8ని ఉపయోగించి హైదరాబాద్‌లో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలని అన్నారు. ప్రైవేటు, ప్రభుత్వ వైద్యాన్ని ఒకే వేదిక మీదకు తేవాలన్నారు.అలాగే క‌రోనా బాధితుల‌కు చికిత్స విష‌యం లో ఒక్కో పేషెంట్‌ పై రూ.3.50 లక్షల ఖర్చు చేస్తునట్లుగా ప్రభుత్వం చెబుతోంది. ఎంతమంది కరోనా పేషెంట్లకు రూ.మూడున్నర లక్షలు ఖర్చు చేశారో చెప్పాలి అని రేవంత్ డిమాండ్ చేశారు.