Begin typing your search above and press return to search.

హైదరాబాద్ కు ఏమైంది? ఎందుకిలా వణుకుతోంది?

By:  Tupaki Desk   |   19 Dec 2021 8:33 AM GMT
హైదరాబాద్ కు ఏమైంది? ఎందుకిలా వణుకుతోంది?
X
చలిపులి పంజా విసురుతోంది.దేశంలో రాష్ట్రంలో ఒక్కసారిగా ఉష్ణోగ్రతలు పడిపోయాయి. చలికి తట్టుకోలేని విధంగా మారింది. హైదరాబాద్ నగరంలో అయితే ఎల్లో అలెర్ట్ జారీ చేశారు. ప్రస్తుతం భాగ్యనగరం గజగజా వణికిపోతోంది. చలి తీవ్రత విపరీతంగా పెరిగిపోయింది. ఎక్కడా లేని విధంగా ఈసారి హైదరాబాద్ లో మూడు, నాలుగురోజుల నుంచి ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పడిపోయాయి. సిమ్లాలోని చలివాతావరణం ఈసారి ప్రస్తుతం హైదరాబాద్ లో కనిపిస్తోంది.

తెలంగాణలోనూ అదే పరిస్థితి నెలకొంది. పలు జిల్లాల్లో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతుండడంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గత పదేళ్లుగా చూడని ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని వాతావరణశాఖ అధికారులు తెలిపారు.

తెలంగాణలో పలు జిల్లాల్లో omicr 10 డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువ నమోదయ్యాయి. శనివారం తెల్లవారుజామున పటాన్ చెరు ప్రాంతంలో 8.4 డిగ్రీసెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. గతంలో చూస్తే డిసెంబర్ 13, 2015న హైదరాబాద్ లో 9.5 డిగ్రీ సెల్సియస్ ల ఉష్ణోగ్రత నమోదైంది. అప్పట్లో ఇదే అత్యల్పం. ఇది సాధారణం కంటే (12.5) కంటే 2 డిగ్రీలు తక్కువ కావడం గమనార్హం. మరో నాలుగు ఐదు రోజుల వరకూ ఉష్ణోగ్రత మరింత తగ్గే అవకాశం ఉందని భారత వాతావరణశాఖ వెల్లడించింది.

ప్రస్తుతం ఉన్న 3 నుంచి 4 డిగ్రీల వరకూ ఉష్ణోగ్రత తగ్గే అవకాశం ఉందని.. అలాగే గంటకు 6 నుంచి 8 కి.మీల వేగంతో చల్లని గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీంతో వాతావరణశాఖ డిసెంబర్ 21 వరకూ నగరవ్యాప్తంగా ఎల్లో అలెర్ట్ ప్రకటించింది. అలాగే ఆదిలాబాద్, రాజన్న సిరిసిల్ల, జగిత్యాల, మహబూబాబాద్ జిల్లాలకు వచ్చే కొన్ని రోజుల వరకూ ఆరెంజ్ వార్నింగ్ ను వాతావరణశాఖ జారీ చేయనుంది. ఇదే సమయంలో తెలంగాణలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య క్రమక్రమంగా పెరిగిపోతుంది. తాజాగా తెలంగాణలో కొత్తగా 12 ఒమిక్రాన్ కేసులు నమోదు అయ్యాయని వైద్యశాఖ పేర్కొంది.

తెలంగాణలో ఒమిక్రాన్ వేరియంట్ కేసుల సంఖ్య 20కి చేరింది. హైదరాబాద్ నగరంలోని టోలీచోకి ప్రాంతంలో ప్రైమరీ కాంటాక్టులు ఎక్కువగా ఉన్నట్లు అనుమానిస్తున్న అధికారులు పెద్ద ఎత్తున కోవిడ్ పరీక్షలు నిర్వహిస్తున్నారు.

ఇటు ఏపీలోనూ చలితీవ్రత క్రమేపీ పెరుగుతూనే ఉంది. వాయువ్య, ఉత్తర, మధ్య భారతం నుంచి వీస్తున్న చలిగాలులు కోస్తాలో అనేక ప్రాంతాలపై ప్రభావం చూపుతున్నాయి. ప్రధానంగా ఉత్తరాంధ్రతోపాటు కోస్తాలోని శివారు ప్రాంతాల్లో చలి ఎక్కువగా ఉంది.

ఏపీలోని ఏజెన్సీ ప్రాంతాల్లో చలిపులి పంజా విసురుతోంది. ఈ ఏడాది శీతాకాలంలో తొలిసారిగా కనిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే మూడు నుంచి నాలుగు డిగ్రీలు తక్కువగా నమోదయ్యాయి. జంగమహేశ్వరపురంలో 13.4, కళింగపట్నంలో 13.5, నందిగామలో 14.5, విశాఖ ఎయిర్ పోర్టులో 15.4 డిగ్రీలు నమోదైనట్టు వాతావరణ కేంద్రం ప్రకటించింది.

విశాఖ ఏజెన్సీలోని చింతపల్లిలో శనివారం 6.1 డిగ్రీల కనిష్ట ఉష్నోగ్రత నమోదైంది. జనవరి మొదటి పక్షం వరకూ కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతాయని చింతపల్లి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం వాతావరణ విభాగం వెల్లడించింది.

ఉత్తరాది నుంచి వస్తున్న శీతల గాలుల ప్రభావంతో అనేక రాష్ట్రాల్లో ఇదే పరిస్థితి కనిపిస్తోంది. అయితే ప్రధానంగా తెలుగు రాష్ట్రాల్లో చలి ప్రభావం ఎక్కువగా ఉండడంతో ఆరోగ్యపరంగానూ జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఉదయం సమయంలోనూ తెలుగు రాష్ట్రాల్లో మంచు ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది.