Begin typing your search above and press return to search.

నియంత భార్య కనిపించడంలేదు.. హత్యా?

By:  Tupaki Desk   |   3 Nov 2016 10:30 PM GMT
నియంత భార్య కనిపించడంలేదు.. హత్యా?
X
ఉత్తరకొరియా నియంత కిమ్‌ జోంగ్‌ ఉన్‌ భార్య రి సోల్‌ జు గత కొంతకాలంగా కనిపించడం లేదు. అదేంటి... రాజుగారి భార్య కనిపించకపోవడం? ప్రస్తుతం ఇదే విషయమై ఉత్తరకొరియా ప్రజలు పలు అనుమానాలు వ్యక్తపరుస్తున్నారు. కారణం... ఆమె ప్రజలకు కనిపించి ఇప్పటికి సుమారు ఏడు నెలలు అవుతోంది. గత మార్చి 28న ఆమె చివరిసారిగా భర్త కిమ్‌ తో కలిసి ప్యాంగ్యాంగ్‌ లో జరిగిన ఒక బహిరంగ కార్యక్రమంలో కనిపించింది. ఆకార్యక్రమం అనంతరం ఆమె ఇప్పటివరకూ బయట ప్రపంచానికి కనిపించింది లేదు.. ఏ అధికారిక కార్యక్రమానికి హాజరైందీ లేదు!!

ఆ సంగతి కాసేపు అటుంచితే... నియంత కిమ్‌ జోంగ్‌ ఉన్‌ దేశద్రోహం ఆరోపణలపై కిమ్‌ తన మేనమామ జాంగ్‌ సాంగ్‌ థేక్‌ను 2013 డిసెంబర్‌ లో ఉరితీసిన సంగతి తెలిసిందే. ఇదే క్రమంలో తన స్నేహితులు, బంధువులు మొదలైన ఎంతోమందిని కిం ఉరి తీయించాడు. దీంతో తాజాగా అతడి భార్య అదృశ్యంపై ఊహాగానాలు, వదంతులు చక్కర్లు కొడుతున్నాయి. కిమ్‌ స్వయంగా తానే భార్యను చంపి ఉంటాడని కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇదే సమయంలో ఉత్తర కొరియా ప్రచార కార్యకలాపాల విభాగం చీఫ్‌ గా ఉన్న కిమ్‌ సోదరితో విభేదాల కారణంగానే రి సోల్‌ జు అదృశ్యమైందని మరికొందరు చెప్తున్నారు. ఆ అనుమానాలు ఒకలా ఉంటే... తన మేనమామ జాంగ్ సాంగ్ తో తన భార్య సోల్‌ జుతో కిమ్‌ కు విభేదాలు వచ్చాయని.. దీంతో కిమ్‌ ఆమెను చంపేసి ఉంటారని అనుమానిస్తూ పలు కథనాలు వస్తున్నాయట.

ఆ సంగతులు అలా ఉంటే... ఉత్తరకొరియా పరిణామాలను నిశీతంగా గమనించే టోక్యోలోని వసేదా యూనివర్సిటీ ప్రొఫెసర్‌ తోషిమిత్సు షిగెమురా మాత్రం... కిమ్‌ భార్య సోల్‌ జు అదృశ్యంపై పలు విషయాలు చెబుతున్నారు. ప్యాంగ్యాంగ్‌లో ఇటీవల పలు దాడులు జరగడంతో ప్రత్యేక రక్షణ నడుమ సోల్‌ జును ఉంచారని, అలాగే సోల్‌ జు గర్భవతి అయి ఉండొచ్చునని అందుకే బయట కనిపించడం లేదని తెలిపారు. కాగా 2012లోనే సోల్‌ జు ఓ ఆడశిశువుకు జన్మనిచ్చింది. అయితే, కిమ్‌ జోంగ్‌ భార్య గురించి అధికారికంగా ఉత్తరకొరియా ప్రకటన చేయడం త్వరలోనే జరగవచ్చని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. అది ఏదైనా కావొచ్చని సందేహాన్ని అలానే మిగిల్చారు!!

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/