Begin typing your search above and press return to search.

కోహ్లీకి ఏమైంది? జాతీయ గీతాలాపన వేళ అలా చేయటమా?

By:  Tupaki Desk   |   24 Jan 2022 5:01 AM GMT
కోహ్లీకి ఏమైంది? జాతీయ గీతాలాపన వేళ అలా చేయటమా?
X
టైం బాగోలేనప్పుడు మరింత జాగ్రత్తగా ఉండాలి. అయితే.. ఇలాంటివి అందరికి కుదురుతుందేమో కానీ.. విరాట్ కోహ్లీ లాంటి దిగ్గజ క్రికెటర్ కు వర్తించదని చెప్పొచ్చు. కానీ.. టైం అన్ని సందర్భాల్లో ఒకేలా ఉండదన్నది మర్చిపోకూడదు. గతానికి భిన్నంగా గడిచిన కొద్ది రోజులుగా కోహ్లీకి ఎదురవుతున్న చేదు అనుభవాల వేళలో అయినా.. ఆయన తన తీరును కాసింత మార్చుకుంటే బాగుండేది. అందుకు భిన్నంగా ఆయన వ్యవహరించిన తాజా తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే ఆయన కెప్టెన్సీ వదులుకోవటం.. ఆటలో ఫాం పోవటంతో పాటు.. గతంలో మాదిరి ఆట ఆడే వేళలో కోహ్లీలో కనిపించే ఫైర్ మిస్ కావటాన్ని పలువురు తప్పు పడుతున్నారు.

ఇదంతా ఒక ఎత్తు అయితే.. తాజాగా దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో వన్డేకు ముందు భారత జాతీయ గీతాలాపన సందర్భంగా టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ చేసిన పనిని పలువురు తప్పు పడుతున్నారు. ఆయన్ను అమితంగా అభిమానించే వారు సైతం తాజా చేష్టను జీర్ణించుకోలేకపోతున్నారు. ఓవైపు జాతీయ గీతాలాపన జరుగుతున్న వేళ.. నిర్లక్ష్యంగా చూయింగ్ గమ్ ను నములుతూ ఉన్న వైనం వీడియోలో స్పష్టంగా కనిపించటం.. దీనికి సంబంధించిన క్లిప్ ఒకటి ఆన్ లైన్ లో వైరల్ గా మారింది.

మిగిలిన విషయాల్లో ఎలా ఉన్నా.. విరాట్ కోహ్లీ.. దేశం పట్ల అమితమైన గౌరవం ఉందన్న మాట వినిపిస్తూ ఉంటుంది. అలాంటి ఆయన.. తన తీరుకు ఏ మాత్రం సంబంధం లేకుండా వ్యవహరించిన తీరును పలువురు తప్పు పడుతున్నారు. జాతీయ గీతాలాపన వేళ ఒళ్లు దగ్గర పెట్టుకొని ప్రవర్తించాలని.. కోహ్లీ నుంచి ఈ తరహా అనుచిత ప్రవర్తనను తాము ఊహించలేదంటూ కామెంట్లు చేయటం తెలిసిందే.

ఆయన తీరుకు తీవ్రంగా హర్ట్ అయిన పలువురు అభిమానులు.. జాతీయ జట్టుకు ఆడటం అంత ఇంట్రస్ట్ లేకుంటే.. ఆడటం మానేయాలని హితవు పలుకుతున్నారు. మొత్తంగా ఇప్పటికే బీసీసీఐతో కోహ్లీకి ఉన్న పంచాయితీ ఒక కొలిక్కి రాక ముందే.. ఇప్పుడీ వివాదంలో కూరుకుపోవటం ఏ మాత్రం సరైంది కాదంటున్నారు. ప్రజల ఎమోషన్ ను ఇట్టే టచ్ చేసే అంశంలో కోహ్లీ చేయకూడని తప్పు చేశారన్న మాట వినిపిస్తోంది. దీనికి ఆయన వెంటనే తన దైన స్పందనను తెలియజేస్తే.. ఈ ఇష్యూ ఇక్కడితో ఆగిపోతుంది. కోహ్లీ మరేం చేస్తారో చూడాలి.