Begin typing your search above and press return to search.

కూల్‌ బ్రాండ్ వైసీపీ నాయ‌కుడు ఏమ‌య్యారు... ఏం చేస్తున్నారు...?

By:  Tupaki Desk   |   19 Jan 2023 12:30 AM GMT
కూల్‌ బ్రాండ్ వైసీపీ నాయ‌కుడు ఏమ‌య్యారు... ఏం చేస్తున్నారు...?
X
వైసీపీలో చాలా మంది నాయ‌కులు ఫైర్ బ్రాండ్లు అనే విష‌యం తెలిసిందే. అయితే.. వీరికి భిన్నంగా ఒక రిద్ద‌రు.. కూల్ కూల్‌గా ఉంటారు. వారిలో త‌ర‌చుగా వార్త‌ల్లో నిలిచే నాయ‌కుడు, మంగ‌ళ‌గిరి ఎమ్మెల్యే ఆళ్ల రామ‌కృష్ణారెడ్డి ఒక‌రు. ఈయ‌న పెద్ద‌గా నోరు విప్పి మాట్లాడ‌రు. అంతా సైలెంట్‌గా చేసేస్తారు. సీఎం జ‌గ‌న్ ద‌గ్గ‌ర మంచి యాక్స‌స్ ఉంద‌ని టాక్‌. రాజ‌ధాని రైతుల విష‌యం నుంచి ప్ర‌పంచ బ్యాంకు అప్పులు ఇచ్చే వ‌ర‌కు కూడా ఆయ‌న న్యాయ పోరాటం చేసి.. వాటిని నిలుపుద‌ల చేశార‌నే వాద‌న టీడీపీ నుంచి వినిపిస్తూ ఉంటుంది.

మంగ‌ళ‌గిరి నుంచి రెండు సార్లు వ‌రుస విజ‌యాలు ద‌క్కించుకున్నారు. గ‌త 2014 ఎన్నిక‌ల్లో కేవ‌లం 25 ఓట్ల‌తో గెలిస్తే.. త‌ర్వాత 2019లో జ‌రిగిన ఎన్నికల్లో టీడీపీ జాతీయ‌ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేష్‌పై ఏకం గా 5 వేల ఓట్ల తేడాతో విజ‌యం ద‌క్కించుకున్నారు. అంతేకాదు.. గ‌త ఏడాది జ‌రిగిన స్థానిక ఎన్నికల్లోనూ దుగ్గిరాల రాజ‌కీయాల‌ను త‌న‌దైన శైలిలో మేనేజ్ చేశారు. మొత్తానికి దీనిని వైసీపికి ద‌క్కించారు.

ఇక‌, జ‌గ‌న్‌తో ఉన్న అనుబంధం నేప‌థ్యంలో ఆళ్ల అయోధ్య రామిరెడ్డికి.. రాజ్య‌స‌భ‌సీటును కూడా సొంత చేసుకున్నారు. అయితే.. అలాంటి ఆళ్ల ఇటీవ‌ల కాలంలో మౌనంగా ఉంటున్నారు. ఎక్క‌డా ఉలుకు ప‌లుకు లేకుండా మౌనం పాటిస్తున్నారు. మ‌రి దీనికి కార‌ణం ఏంటి? ఆయ‌న‌కు ఇస్తాన‌న్న మంత్రి ప‌ద‌విని ఇవ్వ‌క‌పోవ‌డమా? అంటే.. కాద‌ని ఆయ‌న అనుచ‌రులే చెబుతున్నారు. దీంతో ఆళ్ల మౌనం వెనుక రీజ‌నేంట‌నేది చ‌ర్చ‌కు దారితీస్తోంది.

మ‌రోవైపు మంగ‌ళ‌గిరిలో నారా లోకేష్ దూకుడు పెంచారు. త‌న‌దైన శైలిలో దూసుకుపోతున్నారు. అయిన‌ప్ప‌టికీ ఆళ్ల మాత్రం మౌనంగానే ఉంటున్నారు. అయితే.. ప్ర‌స్తుతం ఇక్క‌డ జ‌రుగుతున్న అంత‌ర్గ‌త చ‌ర్చ ప్ర‌కారం.. ఆళ్ల త‌న నియోజ‌క‌వ‌ర్గంలో అభివృద్ధినిధుల‌కు ఇబ్బంది ప‌డుతున్నార‌ని.. ప్ర‌భుత్వం నుంచి ఎలాంటి సాయం లేకుండా పోయింద‌ని అందుకే ఆయ‌న పైకి క‌క్క‌లేక క‌డుపులో దాచ‌లేక ఇబ్బంది ప‌డుతున్నార‌ని ఆయ‌న వ‌ర్గం అంటోంది.

మ‌రి ఎప్ప‌టికి నోరు తెరుస్తారో చూడాలి. ఇక్క‌డ మ‌రో విష‌యం ఏంటంటే.. ఈ నియోజ‌క‌వ‌ర్గంలోని ఇప్ప‌టంలో జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ ఎంతో హ‌డావుడి చేసినా.. ఆళ్ల బ‌య‌ట‌కు రాక‌పోవ‌డం విశేషం.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.