Begin typing your search above and press return to search.

వైసీపీ ఫైర్‌ బ్రాండ్స్‌ కు అసలు ఏమైంది?

By:  Tupaki Desk   |   20 Dec 2022 3:30 PM GMT
వైసీపీ ఫైర్‌ బ్రాండ్స్‌ కు అసలు ఏమైంది?
X
వైసీపీలో కొడాలి నాని, అనిల్‌ కుమార్‌ యాదవ్, పేర్ని నాని, అంబటి రాంబాబు, ఆర్కే రోజా తదితరులకు ఫైర్‌ బ్రాండ్స్‌ గా పేరుంది. తీవ్ర విమర్శలతో, మాటల తూటాలతో, కొన్నిసార్లు అన్ని హద్దులను దాటి ప్రతిపక్ష నేతలను తిట్టిపోస్తారని వీరంతా పేరు తెచ్చుకున్నారు. ప్రతిపక్ష నేతలు చంద్రబాబు, నారా లోకేష్, పవన్‌ కల్యాణ్, తదితర నేతలను విమర్శించాలంటే కొడాలి నాని, పేర్ని నాని, అనిల్‌ కుమార్, రోజా, అంబటి వంటివారు అందరి కంటే ముందుండేవారు.

అయితే జగన్‌ తన రెండో మంత్రివర్గ విస్తరణలో కొడాలి నాని, పేర్ని నాని, అనిల్‌ కుమార్‌ యాదవ్‌ లను మంత్రివర్గం నుంచి తొలగించారు. దీంతో వారు అప్పటి నుంచి తమ దూకుడును తగ్గించారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మంత్రులుగా తమను తొలగించాక వారంతా వ్యూహాత్మకంగానో, యాధృచ్ఛికంగానో సైలెంట్‌ అయిపోయారు. టీడీపీ నేతలు విమర్శలతో రెచ్చిపోతుంటే కొడాలి నాని, పేర్ని నాని, అనిల్‌ వంటివారు ఏమైపోయారనే చర్చ కూడా ఒక దశలో నడిచిందంటే అతిశయోక్తి కాదు.

అయితే పాత మంత్రుల్లో 11 మందిని రెండోసారి కూడా కొనసాగించి తమను మాత్రమే తొలగించడంపై నానీలు, అనిల్‌ కుమార్‌ కలత చెందారనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. తాము ప్రతిపక్ష కార్యకర్తలు, పవన్‌ అభిమానుల వంటివారితో తిట్లు తింటూ పార్టీ కోసం గట్టిగా నిలబడుతూ ప్రతిపక్ష నేతలపై విమర్శలు చేస్తుంటే తమను మంత్రులుగా తొలగించడంపై వారు కలత చెందారని చెప్పుకున్నారు.

మరోవైపు తమపై తీవ్ర విమర్శలు చేస్తున్న పేర్ని నాని, కొడాలి నాని, రోజా, అంబటి రాంబాబు, అనిల్‌ కుమార్‌ యాదవ్‌ వంటివారిని ఈసారి చిత్తుగా ఓడించాలని టీడీపీ, జనసేన కంకణం కట్టుకున్నాయి. ఈసారి ఈ రెండు పార్టీల మధ్య పొత్తు కుదిరితే వీరు మళ్లీ గెలవడం కష్టమనే అభిప్రాయాలు కూడా ఉన్నాయి.

వైసీపీ ఫైర్‌ బ్రాండ్స్‌ సైలెంట్‌ అవ్వడానికి మరో కారణం కూడా వినిపిస్తోంది. చింతమనేని ప్రభాకర్‌ తన పనుల ద్వారా టీడీపీకి కనిపించని నష్టం ఎలా చేశాడో కొడాలి నాని, పేర్ని నాని, అంబటి, అనిల్‌ కుమార్‌ యాదవ్‌ వంటి వారితోనూ వైసీపీకి అలాంటి నష్టమే ఎదురవ్వనుందని టాక్‌ నడిచింది. వీరిని కంట్రోల్‌ చేయకపోతే.. ముఖ్యంగా వారు వాడుతున్న అసభ్య భాషను ఆపకపోతే వైసీపీకి నష్టం తప్పదని సొంత పార్టీ నేతలే హెచ్చరించారని సమాచారం. దీంతో వైసీపీ ఫైర్‌ బ్రాండ్స్‌ను సైలెంట్‌ అయిపొమ్మని పార్టీనే ఆదేశించిందని అంటున్నారు.

ఇక రోజాకు సొంత నియోజకవర్గంలోనే తీవ్ర అసమ్మతి పోరు ఉంది. ఈ విషయంపై పలుమార్లు ముఖ్యమంత్రి జగన్‌ దృష్టికి ఆమె తెచ్చారు. అయినా ఫలితం శూన్యం. రోజా వ్యతిరేకులకు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆశీస్సులు ఉండటంతో సీఎం జగన్‌ ఏమీ అనలేకపోతున్నారని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో రోజా సైతం తన వాగ్దాటిని తగ్గించారనే అబిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.