Begin typing your search above and press return to search.

అంతరిక్షం నుంచి కోడిగుడ్డు కింద పడితే ఏమవుతుంది?

By:  Tupaki Desk   |   28 Nov 2022 11:30 PM GMT
అంతరిక్షం నుంచి కోడిగుడ్డు కింద పడితే ఏమవుతుంది?
X
కోడి ముందా.. గుడ్డు ముందా? అంటే చెప్పడం కష్టమోగానీ.. గుడ్డు కింద పడితే మాత్రం ఏమవుతుందో ప్రతీ ఒక్కరికి ఏదో ఒక సందర్భంలో అనుభవం అయ్యే ఉంటుంది. చేయి జారి కింద పడిన కోడిగుడ్డు పగలకుండా సేఫ్ గా తిరిగి రావడం చరిత్రలో లేదంటే అతిశయోక్తి కాదేమో..! అలాంటిది అంతరిక్షం నుంచి కిందపడిన కోడిగుడ్డు పగలకుండా ఉందంటే మీరు నమ్ముతారా.. కానీ అలాంటి అద్భుతాన్ని నాసా తాజాగా చేసి చూపించింది.

ఈ అద్భుత ప్రయోగం కోసం నాసా మాజీ సైంటిస్టు.. ప్రస్తుత యూట్యూబర్ మార్క్ రాబర్ ఎన్నో వ్యయప్రయాసలకు ఒర్చుకొని అనుకున్న లక్ష్యాన్ని సాధించాడు. అంతరిక్షం నుంచి కోడిగుడ్డును నేల మీద పడినప్పటికీ పడకుండా ఉండేందుకు ప్రత్యేక ఏర్పాట్లను మార్క్ బృందం చేసింది. ఎత్తుకు వెళ్లే కొద్ది వాతావరణ పరిస్థితుల కారణంగా గుడ్డు పగిలిపోయే అవకాశం ఉండటంతో ఇందుకోసం ప్రత్యేకమైన బెలూన్లను మార్క్ బృందం తయారు చేసింది.

హీలియం బెలూన్ సహాయంతో కోడిగుడ్డును ముందుగా లక్ష అడుగుల ఎత్తుకు తీసుకెళ్లారు. అక్కడి నుంచి గుడ్డును జారవిడిచారు. దీంతో కోడిగుడ్డు భూమి దిశగా 150 మైళ్ల వేగంతో దూసుకొచ్చింది. అయినప్పటికీ గుడ్డు నేల మీదకి సురక్షితంగా ల్యాండ్ అయింది. ఒక్క క్రాచ్ కూడా గుడ్డుకు పడకపోవడం విశేషం. అంతరిక్ష ప్రయోగాల్లో అనుకోని ప్రమాదాలు జరిగితే సురక్షితంగా ఆస్ట్రోనాట్ నేలకు చేరేలా ఈ ప్రయోగం చేసినట్లు మార్క్ తెలిపారు.

ఈ ప్రయోగాన్ని ముందుగా ప్రపంచంలోనే ఎత్తైన బుర్జ్ ఖలీఫా టవర్ నుంచి ప్రయోగించాలని మార్క్ భావించాడు. అయితే ప్రయోగాలు చేస్తున్న కొద్దీ అతడి లక్ష్యం మారుతూ వచ్చింది. ఈ క్రమంలోనే అంతరిక్షంలోకి కోడిగుడ్డును తీసుకెళ్లే ఆలోచన వచ్చింది. అనుకున్నదే తడవుగా రాకెట్లో కోడిగుడ్డును తీసుకెళ్లడానికి అనువైన స్థలాన్ని తయారు చేశారు. అలా అంతరిక్షంలోకి కోడిగుడ్డును తీసుకెళ్లి అక్కడి నుంచి నేరుగా కిందకి పడేలా చేశారు.

ఇక ఈ ప్రయోగానికి సంబంధించిన ప్రతీ అంశాన్ని మార్క్ బృందం రికార్డు చేసింది. అంతరిక్షం నుంచి కోడిగుడ్డు నేలకు సురక్షితంగా చేరడాన్ని కళ్ళకు కట్టినట్లు చూపించారు. 26 నిమిషాల నిడివితో ఈ ప్రయోగానికి సంబంధించిన వీడియోను మార్క్ బృందం యూట్యూబ్ లో పోస్ట్ చేసింది. రెండ్రోజుల్లోనే ఈ వీడియోకు 14 మిలియన్ వ్యూస్ వచ్చాయి. ప్రస్తుతం ఈ వీడియో యూట్యూబ్లో తెగ ట్రెండింగ్ అవుతోంది. ఈ ప్రయోగం చేసిన మార్క్ బృందంపై ప్రతీఒక్కరూ ప్రశంసలు కురిపిస్తున్నారు.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.