Begin typing your search above and press return to search.

రత్నప్రభ కేసు వేస్తే ఏమవుతుంది ?

By:  Tupaki Desk   |   21 April 2021 6:30 AM GMT
రత్నప్రభ కేసు వేస్తే ఏమవుతుంది ?
X
ఇదే విషయమై అందరు చర్చించుకుంటున్నారు. తిరుపతి లోక్ సభ ఉపఎన్నికలో అధికార వైసీపీ అరాచకాలు, అక్రమాలకు పాల్పడిందనే ఆరోపణలతో బీజేపీ అభ్యర్ధి రత్నప్రభ హైకోర్టులో కేసువేశారు. బహుశా ఈ కేసు బుధవారం విచారణకు రావచ్చు. అక్రమాలని, అరాచకాలనే ఆరోపణలతో ఎవరైనా, ఏ విషయంలో అయినా కోర్టులో పిటీషన్ వేయచ్చు. అయితే ఉపఎన్నిక విషయంలో బీజేపీ అభ్యర్ధి రత్నప్రభ కేసు వేయటమే అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తుతోంది.

ఇంతటి ఆశ్చర్యానికి కారణం ఏమిటంటే ఉపఎన్నికను రద్దుచేసి ఎన్నిసార్లు నిర్వహించినా బీజేపీకి డిపాజిట్ కూడా వచ్చే అవకాశం లేదన్న విషయం అందరికీ తెలుసు. ఇక దొంగఓట్లంటారా ఇది సాధారణమే. ఏ ఎన్నిక జరిగినా శక్తి ఉన్నవాళ్ళు ఎన్నోకొన్ని దొంగఓట్లు వేయించుకుంటారన్న విషయం అందరికీ తెలిసిందే. కాకపోతే ఈ ఉపఎన్నికలో వైసీపీ ఎన్ని దొంగ ఓట్లు వేయించుకున్నదనే విషయంలో క్లారిటి లేదు కానీ బాగా అల్లరైందన్నది మాత్రం వాస్తవం.

ఇదే విషయమై చంద్రబాబునాయుడు, బీజేపీ చీఫ్ సోమువీర్రాజు పోలింగ్ మొదలైన ఉదయం నుండే ఒకటే గోల మొదలుపెట్టేశారు. సరే వీళ్ళ ఫిర్యాదుల మీద కేంద్ర ఎన్నికల కమీషన్ ఏమి చర్యలు తీసుకుంటుందన్నది వేరే విషయం. బహుశా వీళ్ళ ఫిర్యాదుపై కమీషన్ చర్యలు తీసుకుంటుందనే నమ్మకం ఉన్నట్లు లేదు. అందుకనే రత్నప్రభ కోర్టులో పిటీషన్ వేశారు.

అయితే రత్నప్రభ కేసు విషయంలో కోర్టు విచారణ జరిగినా ఎన్నికల కమీషన్నే నివేదిక అడుగుతుంది. కమీషన్ ప్రతినిధుల హోదాలో నెల్లూరు, చిత్తూరు జిల్లాల కలెక్టర్లు కమ్ రిటర్నింగ్ అధికారులు ఇప్పటికే కేంద్ర ఎన్నికల కమీషన్ కు తమ నివేదికలను ఇచ్చేశారు. తమకు అందిన ఫిర్యాదులపై కమీషన్ రిటర్నింగ్ అధికారుల అభిప్రాయాలను అడిగింది. నివేదికలో ఏముందనే విషయం బయటకు తెలీదు.

అయతే ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నట్లుగా అక్రమాలు ఏమీ జరగలేదనే రిపోర్టిచ్చారని సమాచారం. ఒకవేళ హైకోర్టు విచారణ జరిపినా రిటర్నింగ్ అధికారులను అడక్కుండా కోర్టు ఏమీ తేల్చలేదు. ఇప్పటికే రిటర్నింగ్ అధికారులు తమ నివేదికను ఇచ్చేశారు కాబట్టి అదే నివేదికను కోర్టులో కూడా ప్రవేశపెడతారు. కాబట్టి ఏరూపంలో చూసినా రీపోలింగ్ అన్నది సాధ్యమయ్యేట్లు లేదు. అయినా గెలుపుకోసం కష్టపడిన టీడీపీ కేసు వేసినా అదో అందం చందం. అంతేకానీ డిపాజిట్ అయినా వస్తుందో లేదో తెలీని బీజేపీ కేసు వేయటమే విచిత్రంగా ఉంది.