Begin typing your search above and press return to search.

కరోనాతో మరణిస్తే ఏం చేయాలన్న దానిపై కొత్త గైడ్ లైన్స్

By:  Tupaki Desk   |   18 March 2020 4:30 AM GMT
కరోనాతో మరణిస్తే ఏం చేయాలన్న దానిపై కొత్త గైడ్ లైన్స్
X
కరోనా రేపుతున్న కలకలం అంతా ఇంతా కాదు. ఇప్పటివరకూ తుపానులు.. వరదలు.. భూకంపాలు.. అగ్నిప్రమాదాలు మాత్రమే పరిచయమైన మనకు.. ఒక వైరస్ కారణంగా చోటు చేసుకున్న భయం.. ఆందోళన లాంటి వాటికి సంబంధించిన అవగాహన తక్కువ. గడిచిన యాభై.. అరవై ఏళ్లలో వైరస్ కారణంగా సామాజికంగా ఇంత తీవ్రస్థాయిలో ఆందోళన చోటు చేసుకోవటం ఇప్పుడే.

ఇప్పటి రాజకీయ నేతలకు.. అధికార యంత్రాంగానికి.. ఆ మాటకు వస్తే.. మనకు కానీ.. మన పెద్దవాళ్లకు కానీ.. ఎవరికి ఎలాంటి అవగాహన లేదు. మీడియాకు సైతం ఇలాంటి సందర్భాల్ని ఎలా డీల్ చేయాలో తెలీని పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో కరోనాకు సంబంధించిన ప్రతి విషయాన్ని ఎలా డీల్ చేయాలో తెలుసుకోవాల్సిన దుస్థితి. ప్రపంచాన్ని ఇప్పటికే వణికిస్తున్న కరోనా.. మన దేశంలో చూపిస్తున్న ప్రభావం తక్కువ.

చిన్న చిన్న దేశాల్లో వేలాదిగా కరోనా పాజిటివ్ కేసులతో విలవిలాడి పోతున్నవేళ.. భారత్ లో కరోనా పాజిటివ్ కేసులు ఇప్పటివరకూ నమోదైనవి 137 కాగా.. మరణించిన వారు ముగ్గురే. అయితే.. అసలు సవాలు రానున్న రోజుల్లోనే అన్న మాట పలువురి నోట వినిపిస్తోంది. కరోనాకు సంబంధించి ప్రతి విషయానికి ఎలా రియాక్ట్ కావాలన్న దానిపై మార్గ దర్శకాల్ని విడుదల చేస్తోంది కేంద్ర ప్రభుత్వం.

తాజాగా.. కరోనా కారణంగా మరణించిన వారికి ఏ తరహాలో అంతిమసంస్కారాలు చేయాలన్న దానిపై కొత్త సందేహాలు నెలకొన్నాయి. వీటిని క్లారిఫై చేస్తూ.. అంత్యక్రియలు నిర్వహించే అంశంలో అనుసరించాల్సిన విధి విధానాలకు సంబంధించిన మార్గ దర్శకాల్ని జారీ చేశారు.

మరణించిన తర్వాత శవపరీక్ష చేయాల్సి వచ్చినప్పుడు ఏమేం చేయాలన్న విషయంలో..
% వీలైనంతవరకు శవపరీక్ష లేకుండా చేయాలి. తప్పనిసరైతే.. మృత దేహాన్ని తరలించేటప్పుడు చుట్టుపక్కల ప్రాంతాల్ని తరచూ ఒక శాతం హైపోక్లోరైట్ ద్రావణంతో శుభ్రం చేయాలి. మార్చురీ.. అంబులెన్స్.. శ్శశానవాటికల్లో మృతదేహాల్ని ఎత్తి.. దించే కార్మికులందరూ ఇన్ ఫెక్షన్ బారిన పడకుండా శిక్షణ ఇవ్వాలి. మృతదేహాల్ని నాలుగు డిగ్రీల సెల్సియస్ కోల్డ్ ఛాంబర్స్ ను ఉంచాలి. ఆ సందర్భంగా మార్చురీని ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలి.
% పోస్టుమార్టం చేసే సిబ్బంది.. ఫోరెన్సిక్ నిపుణులు.. సహాయక సిబ్బందికి ఎన్ 95 మాస్కులు.. కళ్లద్దాలు.. ముఖాన్ని కప్పేందుకు అవసరమైన వాటిని వినియోగించాలి. రౌండ్ ఎండెడ్ కత్తుల్ని మాత్రమే పోస్టుమార్టం కోసం వాడాలి. ఈ ప్రక్రియ అయ్యాక డెడ్ బాడీని పూర్తిగా ఒక శాతం సోడియం హైపోక్లోరైట్ తో క్లీన్ చేసి.. బ్యాగులో భద్ర పర్చాలి.

డెడ్ బాడీని తరలించే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు
% మృతదేహాన్ని తరలించే సిబ్బందికి సర్జికల్ మాస్కులు.. గ్లోవ్స్ తో పాటు ఇతర జాగ్రత్తలన్నీ పాటించాలి. డెడ్ బాడీకి ఎంబామింగ్ చేసేందుకు అనుమతి ఇవ్వకూడదు. చనిపోయిన ప్రదేశం నుంచి తరలించే వేళలో మృతుడి కుటుంబ సభ్యులు ఎవరైనా చూడాలనుకుంటే అందుకు తగ్గ జాగ్రత్తలు తీసుకోవాలి. డెడ్ బాడీని తరలించిన వాహనాన్ని ఒక శాతం సోడియం హైపోక్లోరైట్ తో క్లీన్ చేయాలి. మరణించిన వారిని పరిశీలించే సమయం లో.. తడి అంటని యాప్రాన్.. గ్లోవ్స్.. మాస్కులు వాడాలి. మృతదేహానికి ట్యూబులు.. డ్రైన్లు లాంటివి ఉంటే వాటిని తొలగించాలి. మృతదేహం నుంచి ద్రవాలు ఏమీ బయటకు రాకుండా నోరు.. ముక్కు రంధ్రాల్ని సరిగా మూసి ఉంచాలి. లీక్ ఫ్రూప్ ప్లాస్టిక్ బ్యాగులో బాడీని భద్రపర్చాలి. ఆ బ్యాగును ఒక శాతం హైపోక్లోరైట్ తో క్లీన్ చేయాలి. మరణించిన వ్యక్తి ఉన్న గదిలోని వస్తువులు (నేల.. మంచం.. రెయిలింగ్స్.. టేబుల్లు.. స్టాండ్లు) లాంటి వాటిని ఒక శాతం సోడియం హైపోక్లోరైట్ ద్రావణం తో క్లీన్ చేయాలి.

అంత్యక్రియల సమయంలో ఏమేం చేయాలంటే..
% మృతదేహాల కారణంగా అదనపు మప్పు ఉండన్న విషయాన్ని కాటికాపరులకు అవగాహన కల్పించాలి. మృతదేహాన్ని ఉంచిన బ్యాగును తెరిచినప్పుడు.. ఆఖరిసారి చూసేందుకు అనుమతివ్వాలి.కాకుంటే.. ఆ సమయంలో ముట్టుకోకూడదు. మతపరమైన క్రతువును కాస్త దూరంగా నిర్వహించాలి. ఆఖరిసారి చూసే సమయంలో తాకటం.. ముట్టుకోవటం.... పట్టుకోవటం లాంటివేమీ చేయకూడదు. అంతిమ యాత్రకు ఎక్కువ మంది లేకుండా చూసుకోవాలి. బూడిద నుంచి ఎలాంటి ఇన్ ఫెక్షన్లు రావు. మిగిలిన క్రతువుల కోసం వాటిని సేకరించొచ్చు.