Begin typing your search above and press return to search.

సీఎం పదవి కొత్త కాదన్న బాబు సంచలన నిర్ణయాన్ని తీసుకుంటే?

By:  Tupaki Desk   |   6 May 2022 4:30 PM GMT
సీఎం పదవి కొత్త కాదన్న బాబు సంచలన నిర్ణయాన్ని తీసుకుంటే?
X
ఇప్పుడు మేం చెబుతున్నది మొత్తం అంచనా మాత్రమే. ఏపీకి చెందిన పలువురితో మాట్లాడే క్రమంలో మేం ఇప్పుడు చెప్పబోయే అంశాలు ప్రస్తావనకు వచ్చాయి. కానీ.. సమయం.. సందర్భం లేకుండా మాట్లాడితే ఇలాంటి వాటికి విలువ ఉండదు. తాజాగా కాకినాడలో పార్టీ నేతలు.. కార్యకర్తలతో సమావేశమైన సందర్భంగా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నోటి నుంచి వచ్చిన ఒక కీలక వ్యాఖ్య...ఈ కథనం రాయటానికి కారణమైంది. అదేమంటే.. తనకు సీఎం పదవి కొత్త కాదని.. తాను అధికారం కోసం పాకులాడే వ్యక్తిని కాదని పేర్కొన్నారు.

ఏపీని రక్షించుకోవటం కోసం.. క్విట్ జగన్.. సేవ్ ఆంధ్రప్రదేశ్ అంటూ పిలుపునిచ్చారు. ఇదంతా ఓకే.. రాజకీయం.. అందునా ఏపీలో రాజకీయం ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కానీ.. సీఎం పదవి తనకు కొత్త కాదన్న చంద్రబాబు.. అదే మాట మీద ఉంటారా? ఒకవేళ ఉంటే.. ఏం జరుగుతుందంటే.. ఏపీ రాజకీయ స్వరూపం మొత్తం మారిపోతుందంటున్నారు. అదెలానంటే.. ఇప్పుడున్న పరిస్థితుల్లో చంద్రబాబు వయసు 72 సంవత్సరాలు. ఎన్నికలు మరో రెండేళ్లు సమయం ఉంది. అంటే.. ఆయనకు 74 ఏళ్ల వయసు ఉంటుంది.

పెరుగుతున్న వయోభారానికి తగ్గట్లు ఆయన నీరసించకుండా ఈ రోజుకు ఆయన తీవ్రంగా కష్టపడుతున్నారు. పార్టీ కోసం ఆయన శ్రమిస్తున్న తీరు చాలా మంది నేతలకు స్ఫూర్తి దాయకమని చెప్పాలి. 72 ఏళ్ల వయసులో.. తన వయసులో సగం కంటే కాస్త ఎక్కువ ఉన్న యువకుడితో పోటీపడుతున్నారు. అయితే.. ఏపీ రాజకీయం పూర్తిగా మార్చేసే అవకాశం చంద్రబాబు చేతిలోనే ఉందంటున్నారు. అదెలానంటే.. ఇప్పటికే వచ్చే ఎన్నికల్లో పొత్తుకు చంద్రబాబు సిద్ధంగా ఉన్నారు. ఆ మధ్యన జనసేన అధినేత పవన్ కల్యాణ్ నోటి నుంచి వచ్చిన వ్యాఖ్యల్ని చూస్తే. టీడీపీతో ఆయన పొత్తుకు సిద్ధమనే చెప్పాలి.

ఇప్పుడున్న పరిస్థితుల్లో జనసేన కంటే కూడా టీడీపీకే ఎక్కువగా పొత్తు అవసరం ఉందంటున్నారు. ఎందుకంటే.. ఒంటరిగా పోటీ చేసే సత్తా ఉన్నా.. జగన్ ను ఢీ కొట్టాలంటే మాత్రం బాబు బలం ఒక్కటే సరిపోదని.. దానికి పవన్ శక్తి చాలా అవసరమని చెబుతున్నారు. అయితే.. ఇంత చేసిన తర్వాత పవన్ కు జరిగే మేలు ఏమిటి? అన్న దానిపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. తాజాగా.. తనకు సీఎం పదవి కొత్త కాదు.. తాను ముఖ్యమంత్రిపదవి కోసం పాకులాడటం లేదని చంద్రబాబు చెప్పిన నేపథ్యంలో.. ఆయన వచ్చే ఎన్నికల్లో సీఎం పదవికి దూరంగా ఉంటానని చెబితే మొత్తం మారిపోతుందంటున్నారు. ఇప్పటికిప్పుడు కాకుండా జనసేనతో పొత్తు అనంతరం.. తమ కూటమి అభ్యర్థిగా పవన్ కల్యాణ్ ను సీఎం చేస్తానని చెబితే.. సీన్ మొత్తం మారిపోతుందని చెబుతున్నారు.

పాలనలో ఉన్న అవగాహనతో.. పవన్ కు దన్నుగా నిలవటం.. తెలుగుదేశం పార్టీ నేతలకు ఎక్కువగా మంత్రి పదవులు ఇప్పించటం ద్వారా.. ఊహలకే పరిమితమైన ఒక కాంబినేషన్ ను రియాలిటీలోకి తెస్తే.. సీన్ మొత్తం మారిపోతుందంటున్నారు. పొత్తు వేళ.. తమ మిత్రపక్షాల షరతులన్నింటికి ఓకే చెప్పేయాలన్నట్లు ఉంటున్న చంద్రబాబు.. అందుకు తగ్గట్లే సీఎం అభ్యర్థి విషయంలోనూ పెద్ద మనసుతో నిర్ణయం తీసుకుంటే.. ఫలితాలు సానుకూలంగా ఉంటాయని చెబుతున్నారు. అలా కాని పక్షంలో మరో రాజీ మార్గంలో.. తొలుత ముఖ్యమంత్రిగా చంద్రబాబు వ్యవహరించి.. పద్దెనిమిది నెలలు కానీ లేదంటే ఏడాది పాటు సీఎంగా ఉండి.. ఆ తర్వాత జనసేన అధినేతకు అధికారాన్ని బదిలీ చేస్తానని చెబితే కూడా బాగుంటుందన్న మాట వినిపిస్తోంది.

అదేజరిగితే.. ఏపీ రాజకీయం మొత్తం టర్న్ అయిపోతుందన్న మాట వినిపిస్తోంది. అయితే.. ఈ కాంబినేషన్ అనుకున్నంత.. చెప్పినంత ఈజీ ఎంత మాత్రం కాదు. ఆ విషయం మీద అవగాహన ఉంది. కానీ.. ఏపీ రాజకీయాల్ని సమూలంగా మార్చాలంటే ఇలాంటి సాహసోపేతమైన.. ప్రయోగాత్మక నిర్ణయాన్ని చంద్రబాబు తీసుకుంటే తప్పించి.. ఇదేమీ ఆచరణలోకి రాదు. తన రాజకీయ వారసుడు లోకేశ్ ను వదిలేసి.. మరొకరికి సీఎం కుర్చీ షేర్ చేసుకునేంత పెద్ద మనసు బాబుకుఉందా? అన్నది అసలు ప్రశ్న. అయితే.. రాజకీయాల్లో ఏదీ అసాధ్యం కాదన్న విషయాన్ని పరిగణలోకి తీసుకుంటే మాత్రం.. ఇదేమీ అసాధ్యమైతే కాదని చెప్పక తప్పదు.