Begin typing your search above and press return to search.

చరిత్ర మరిచిపోయి నోరు జారితే ఎలా సోము గారు?

By:  Tupaki Desk   |   29 April 2022 7:17 AM GMT
చరిత్ర మరిచిపోయి నోరు జారితే ఎలా సోము గారు?
X
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు పెద్ద జోక్ పేల్చారు. వచ్చే ఎన్నికల్లో తమకు జనసేనకే పొత్తుంటుందని చెప్పటం వరకు ఓకేనే. అలాగే జనసేనకు మరే పార్టీతోను పొత్తుండదని వీర్రాజే వకాల్తా పుచ్చేసుకోవటమే విచిత్రంగా ఉంది. ఇదే సమయంలో ఆయనో పెద్ద జోక్ పేల్చారు. అదేమిటయ్యా అంటే కుటుంబ పార్టీలతో బీజేపీ ఎప్పుడూ పొత్తులు పెట్టుకోదట. పాపం వీర్రాజు చరిత్రను పూర్తిగా మరచిపోయినట్లున్నారు.

ఇంతకీ బీజేపీ పొత్తు పెట్టుకున్న జనసేన కుటుంబ పార్టీయా లేకపోతే జాతీయ పార్టీ యో అర్ధం కావటంలేదు. ఒక వ్యక్తి పెట్టిన పార్టీ కుటుంబ పార్టీ కాకుండా ఏమవుతుందో వీర్రాజే చెప్పాలి.

ఎనిమిదేళ్ళ క్రితం పవన్ కల్యాణ్ జనసేనను ఏర్పాటుచేసిన విషయం తెలిసిందే. ఆ పార్టీలో సర్వం సహా అంతా పవన్ మాత్రమే. అలాంటిది జనసేన కుటుంబ పార్టీగా వీర్రాజుకు కనబడకపోవటమే ఆశ్చర్యంగా ఉంది.

సరే పవన్ విషయం వదిలేస్తే జమ్మ-కాశ్మీర్లో పీపుల్స్ డెమక్రటిక్ ఫ్రంట్ అధినేత్రి మహబూబా ముఫ్తీతో బీజేపీ పొత్తు పెట్టుకున్నది. మహారాష్ట్రలో శివశేనతో పొత్తు పెట్టుకున్నది. ఉత్తరప్రదేశ్ లో బీఎస్పీ అధినేత్రి మాయావతితో కూడా చివరకు పొత్తు పెట్టుకున్నారు కమలనాథులు. మరి ఇవన్నీ వీర్రాజుకు కుటుంబ పార్టీలుగా కనబడలేదా ? పంజాబ్ ఎన్నికల్లో మొన్ననే శిరోమణి అకాలీదళ్ తో పెట్టుకున్నది బీజేపీ కాదా ? ఇది కుటుంబ పార్టీ కాదా ?

ఏదో నోటికొచ్చినట్లు మాట్లాడేయటం వీర్రాజు లాంటి చాలా మందికి అలవాటైపోయింది. తాను ఏమి మాట్లాడుతున్నారో కూడా వీర్రాజుకు అర్ధమైనట్లు లేదు. అంతెందుకు 2014లో పొత్తు పెట్టుకున్న టీడీపీ కూడా కుటుంబ పార్టీయే కదా ? పవన్ తో పొత్తుల్లో ఉండదలచుకుంటే ఉండచ్చు ఎవరు కాదనలేరు.

అంతమాత్రాన జనసేన ఏదో జాతీయ పార్టీ అయినట్లు వీర్రాజు బిల్డప్ ఇవ్వటమే విచిత్రంగా ఉంది. తన పార్టీ పొత్తుల సంగతి చెప్పాల్సింది పవన్ కల్యాణ్. అయితే జనసేనకు ఇంకెవరితోను పొత్తుండని వీర్రాజు చెప్పడం ఏమిటో అర్ధం కావడం లేదు.