Begin typing your search above and press return to search.

మేడే జ‌రుపుకోకుంటే ఏమ‌వుద్ది?

By:  Tupaki Desk   |   1 May 2021 6:37 AM GMT
మేడే జ‌రుపుకోకుంటే ఏమ‌వుద్ది?
X
మేడే అంటే.. ఏంటీ అనేవారు మ‌న‌దేశంలో కోట్లాది మంది ఉన్నారు. ప్ర‌పంచంలో వంద‌ల కోట్ల మంది ఉన్నారు. మ‌రికొంత మంది అదేదో ఫ్యాక్ట‌రీల్లో కూలీనాలీ చేసుకునే వారికి సంబంధించిన‌దిగా చూస్తున్నారు. నిజానికి మేడే అంటే ఏంటీ? కార్మిక దినోత్సవం ఎందుకు జరుపుకోవాలి? ఎవ‌రెవ‌రు జ‌రుపుకోవాలి? జ‌రుపుకోకుంటే ఏమ‌వుద్ది? అనేది చూద్దాం.

ఇది 1880వ ద‌శ‌కానికి ముందు ప‌రిస్థితి. చాలా మందికి పిల్ల‌ల‌కు త‌మ తండ్రి ఎవ‌రో తెలిసేది కాదు. ఒక వ‌య‌సు వ‌చ్చేంత వ‌ర‌కూ ఇదే ప‌రిస్థితి కొన‌సాగేది. ఎందుకంటే.. ఉద‌యం 5 గంట‌ల‌కు నిద్ర‌లేచి ఫ్యాక్ట‌రీల్లో ప‌నుల‌కు వెళ్లేవారు. అప్ప‌టికి పిల్ల‌లు నిద్ర‌లేచే వారు కాదు. రాత్రి 12 గంట‌ల‌కు మ‌ళ్లీ ఇల్లు చేరేవారు. అప్ప‌టికే పిల్ల‌లు నిద్ర‌లోకి జారుకునేవారు. ఇది అప్ప‌ట్లో సాధార‌ణ విష‌యం!

ఫ్యాక్ట‌రీ ఓన‌ర్ల ఆస్తులు పెంచేందుకే వీళ్లు బ‌తికేది అన్న‌ట్టుగా ప‌నులు చేసేవారు. ఇక్క‌డ ప‌నిచేయ‌డానికి శ‌క్తి కావాలి కాబ‌ట్టి.. శ‌క్తి కావాలంటే తిండి తినాలి కాబ‌ట్టి.. అందుకే కొంత జీతం ఇస్తున్నాం అన్న‌ట్టుగా వ్య‌వ‌హ‌రించేవారు పెట్టుబ‌డిదారులు. ఇదేంట‌ని ప్ర‌శ్నిస్తే ఉపాధి పోతుంది. దాంతోపాటు ప్రాణాలు కూడా! అలాంటి ప‌రిస్థితుల్లో గొడ్డులా ప‌నిచేసేవారు కార్మికులు.

ఇది అన్యాయం అంటూ ఒక‌రిద్ద‌రు అనేవారు. కానీ.. వారిపై దాడులు జ‌రిగేవి. అయితే.. ఇక్క‌డ ఓ విష‌యం గుర్తు పెట్టుకోవాలి. పీడ‌నం ఎక్కువైన‌ప్పుడు ఏదైనా ధ్వంస‌మైపోతుంది. ఇక్క‌డ కూడా అదే జ‌రిగింది. పెట్టుబ‌డి దారుల దోపిడీ పీడ‌నం ఎక్కువైపోవ‌డంతో కార్మికులు త‌ట్టుకోలేక‌పోయారు. ఎదురు తిరిగారు. దోపిడీకి అల‌వాటుప‌డ్డ ప్రాణం ఆగుతుందా? దాడిచేసింది. కార్మికులు రోడ్ల మీదకు వచ్చారు. తమ రక్తాన్ని చెమటగా పీల్చడాన్ని ఇక ఎంత‌మాత్ర‌మూ అంగీక‌రించ‌బోమ‌ని నిన‌దించారు. అధికారం చేతిలో ఉన్న‌వాళ్లు తుపాకులు ఉప‌యోగించారు. ఆ పోరాటంలో అన్యాయంగా ఎనిమిది మంది ప్రాణాలు అర్పించారు. అందులోని ఒక‌రు నెత్తుటితో త‌డిసిన త‌న చొక్కాను మ‌రొక‌రి చేతికి అందించారు. ఈ పోరాటం ఆగొద్ద‌ని నిన‌దించారు. అలా పురుడు పోసుకున్న‌దే మేడే. ఇంద‌తా అమెరికాలోని చికాగోలో 1886లో జ‌రిగింది.

ఇవాళ మ‌నం ఉద‌యాన్ని ఆపీసుకు వెళ్తున్నాం.. టంచ‌నుగా 8 గంట‌లు కొట్టిన త‌ర్వాత ఇంటికి బ‌య‌లుదేరుతున్నాం. ప‌నికి త‌గిన వేతనం పొందుతున్నాం. కుటుంబంతో హాయిగా బ‌తుకుతున్నాం. ఇదంతా ఎలా సాధ్య‌మైందో తెలుసా? ఆ నాటి చికాగో కార్మిక పోరాటం ఫ‌లిత‌మే. అందుకే.. మేడే అంత‌ర్జాతీయ కార్మిక దినోత్స‌వం అయ్యింది. ఆ విధంగా ఇది ఎవ‌రో ఒక‌రు జ‌రుపుకోవాల్సిన వేడుక కాదు. కొంద‌రికే ప‌రిమిత‌మైన అంశం అస‌లే కాదు. ప‌నిచేసే ప్ర‌తి ఒక్క‌రూ జ‌రుపుకోవాల్సిన ఉత్స‌వం. త‌మ హ‌క్కుల‌ను గుర్తు చేసుకుంటూ.. వాటిని కాపాడుకుంటూ ముందుకు సాగాల‌ని నిర్దేశించుకునే స‌మ‌యం.

ఇవాళ దేశంలో మ‌ళ్లీ కార్మిక హ‌క్కులు ప్ర‌మాదంలో ప‌డుతున్నాయి. ప్ర‌భుత్వ రంగం నిర్వీర్య‌మైపోతోంది. ప్రైవేటు రంగంలో అద‌న‌పు డ్యూటీలు చేయిస్తున్న తీరును చూస్తూనే ఉన్నాం. ఇందులో ఎంతో మంది బాధితులుగా ఉంటూనే ఉన్నారు. రోజుకు 10 నుంచి 12 గంట‌లు ప‌నిచేయిస్తున్న సంస్థ‌లు కూడా ఉన్నాయి. ఇది కార్మిక హ‌క్కుల ఉల్లంఘ‌నే. కాబ‌ట్టి.. సూటూ బూటూ వేసుకున్నాం కాబ‌ట్టి.. మ‌న‌కు మేడేతో సంబంధం లేదు అనుకుంటే అజ్ఞాన‌మే అవుతుంది. హోదాల్లో తేడాలుండొచ్చుగాక‌.. యూనీ ఫామ్ వేరుగా ఉండొచ్చుగాక‌.. కానీ.. అంద‌రూ జీతం కోసం ప‌నిచేసే కార్మికులే. అంద‌రికీ ఉండేవి.. ఉండాల్సిన‌వి ఒకేవిధ‌మైన హ‌క్కులే.

ఈ ప‌రిస్థితి చేయి దాటితే.. ప‌ని గంట‌లు పెరుగుతూ పోవ‌చ్చు. మ‌ళ్లీ.. పాత రోజులు వ‌చ్చినా రావొచ్చు. అందుకే.. ప్ర‌తి ఒక్క‌రూ కార్మిక హ‌క్కుల గురించి తెలుసుకోవాలి. వాటిని కాపాడుకోవాలి. అది జ‌ర‌గాలంటే.. మేడే స్ఫూర్తిని నిరంత‌రం మ‌దిలో త‌ల‌చుకోవాలి. ముందుకు సాగుతూ ఉండాలి.