Begin typing your search above and press return to search.

పవన్ పులివెందులలో పోటీ చేస్తే ఎలా ఉంటుంది....?

By:  Tupaki Desk   |   20 Sep 2022 9:54 AM GMT
పవన్ పులివెందులలో పోటీ చేస్తే ఎలా ఉంటుంది....?
X
ఏపీలో రాజకీయం జగన్ వర్సెస్ చంద్రబాబు మాత్రమే కాదు, జగన్ వర్సెస్ పవన్ అన్నట్లుగా కూడా ఉంది. చంద్రబాబు పవన్ ఈ మధ్య అయితే అసెంబ్లీలో కలుసుకోవడం లేదు కానీ ఏడాది దాకా ఇద్దరూ అక్కడే ముఖాముఖాలు చూసుకునేవారు. వాదనకు అయినా మాట్లాడుకునేవారు. అదే పవన్ కళ్యాణ్ అయితే జగన్ తో ఎక్కడా ఎదురిపడింది లేదు. ఇక ఈ మధ్య జనసేన కొత్త స్ట్రాటజీ అమలు చేస్తోంది. జగన్ పేరెత్తకుండానే పవన్ ఆయన్ని పట్టుకుని విమర్శిస్తున్నారు.

దీన్ని బట్టి అర్ధమయ్యేదేంటి అంటే చంద్రబాబు కంటే కూడా అతి పెద్ద రాజకీయ వైరం పవన్ జగన్ ల మధ్య ఉంది అనే. ఇక చంద్రబాబు రాజకీయ డిమాండ్ జగన్ గద్దె దిగాలని. కానీ పవన్ కి అది అతి పెద్ద ప్రతిష్టాత్మకమైన వ్యవహారంగా మారిపోయింది. వైసీపీ లేని ఏపీని ఆయన కోరుకుంటున్నారు. ఆ మాట ఎక్కడా చంద్రబాబు కూడా అనలేదు. మేము అధికారంలోకి రావాలని ఆయన కోరుకుంటున్నారు తప్ప వైసీపీ టోటల్ వాష్ అవుట్ చేయాలని భారీ శపధాలు చేయడంలేదు.

అంటే ఇక్కడ మ్యాటర్ ఏంటి అంటే బాబు కంటే కూడా పవన్ కి జగన్ విషయంలో చాలా ఎక్కువ పట్టుదల ఉందని. అలాగే జగన్ సైతం చంద్రబాబుని ఈ ఎన్నికల వరేకే ప్రత్యర్ధిగా చూస్తున్నారుట‌. పవన్ తనతో సమాన వయసు కలిగిన వారు కాబట్టి ఆయనే సుదీర్ఘకాలంలో బలమైన ప్రత్యర్ధి అవుతారని కూడా ఆలోచిస్తున్నారు. అందుకే జగన్ పవన్ పేరు తన నోటితో చెప్పకపోయినా ఆయనని రాజకీయంగా ఎలా తగ్గించాలనే ప్లాన్ వేస్తూ వస్తున్నారు.

వైసీపీ వారు సైతం పవన్ విషయంలో ఒక మాటకు పది మాటలు అంటూ రెచ్చుతారు. దానికి కారణం వైసీపీకి పవన్ అసలైన ప్రత్యర్ధిగా ఉన్నారనే అంటున్నరు. మరి ఈ నేపధ్యంలో చంద్రబాబు ఎటూ కుప్పం దాటి పులివెందులకు వెళ్ళి పోటీ చేయరు, అదే పవన్ కి ఈ రోజుకీ ఎక్కడ పోటీ చేయాలన్న ఆలోచనతోనే ఉన్నారు. దాంతో ఆయన ఎక్కడో ఎందుకు ఏకంగా పులివెందుల వెళ్ళి జగన్ మీదనే పోటీ చేస్తే ఎలా ఉంటుంది అన్నదే ఇపుడు చర్చగా ఉంది.

దీని మీదనే ఒక విచిత్రమైన వాదన అయితే రాజకీయ వర్గాలలో సాగుతోంది. పవన్ పులివెందులలో పోటీ చేస్తే ఎలా ఉంటుంది అన్నదే ఆ వాదన. టీడీపీ మద్దతుతో పవన్ పులివెందుల వెళ్ళి పోటీ చేస్తే గెలవకపోవచ్చు కానీ జగన్ మెజారిటీని గణనీయంగా తగ్గించడం ఖాయమనే అంటున్నారు. పవన్ కి అక్కడ పెద్ద ఎత్తున ఓట్లు వస్తాయని కూడా చెబుతున్నారు.

ఒక వైపు జగన్ కుప్పంలో చంద్రబాబుని ఓడించడానికి ప్లాన్స్ వేస్తూ పెద్దాయనని తెగ టెన్షన్ పెడుతూంటే జగన్ కి కూడా అలాంటి టెన్షన్ పెట్టాలంటే ఇదే కరెక్ట్ స్ట్రాటజీ అని అంటున్నారు. ఈ విధంగా పవన్ చేత పులివెందులలో నామినేషన్ వేయించి జగన్ కి హై బీపీ పెంచేందుకు టీడీపీ ఆలోచిస్తోంది అని అంటున్నారు.

పశ్చిమ బెంగాల్ లో మమతా బెనర్జీ మీద ఆమె ఒకనాటి కుడి భుజం అయిన సువేందు అధికారిని పోటీగా బీజేపీ పెట్టి ఓడించేసింది. మరి ఏపీలో కూడా ఈసారి అలాంటి విన్యాసాలు చాలానే జరుగుతాయని అంటున్నారు. ఇక పులివెందుల గురించి చెప్పుకోవాలీ అంటే గతం కంటే జగన్ కి ఆదరణ కొంత తగ్గింది అని అంటున్నారు. పైగా వైఎస్సార్ కుటుంబానికి అండగా పెద్ద దిక్కుగా ఉండే మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి కూడా లేరు. పైగా ఆయనది దారుణ హత్య‌. అది ఈ రోజుకీ తెమలని కేసుగా ఉంది.

ఈ నేపధ్యంలో పులివెందులలో 2019 ఎన్నికల్లో 80 వేల పైచిలుకు మెజారిటీ వచ్చిన జగన్ కి ఈసారి మామూలుగానే అది బాగా తగ్గుతుంది అంటున్నారు. దాంతో పవన్ కళ్యాణ్ లాంటి వారి బరిలో ఉంటే ఇంకా తగ్గుతుంది అని కూడా అంచనా కడుతున్నారు. అక్కడ పవన్ సామాజికవర్గం కూడా పెద్ద ఎత్తున ఉన్నారు. సామాజికవర్గం కోణంలో చూసినా మారిన రాజకీయ పరిస్థితులు చూసినా జగన్ ని పులివెందులలో కార్నర్ చేయాలీ అంటే పవన్ పోటీకి దిగాల్సిందే అంటున్నారు. ]

అయితే పవన్ ఈ విషయంలో ఎంతవరకూ సవాల్ గా తీసుకుని ముందుకు వస్తారో అన్న చర్చ అయితే ఉంది మరి. చంద్రబాబుని కుప్పంలో కట్టేయాలని వైసీపీ చూస్తే జగన్ ని పులివెందుల పొలిమేరలు దాటలేకుండా కట్టడి చేయాలంటే పవన్ బరిలోకి దిగాల్సిందే అని అంటున్నారు. ఆ ప్రభావం ఏకమొత్తంగా రాయలసీమ మీద కూడా ఉంటుంది కాబట్టి ఇది అద్భుతమైన వ్యూహం. మరి పవర్ స్టార్ ఓకే అంటే చాలు ఏపీ పాలిటిక్స్ టోటల్ చేంజ్ అవడం ఖాయమే అంటున్నారు.




నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.