Begin typing your search above and press return to search.

పీకే కాంగ్రెస్ లో చేరితే.. జ‌రిగేది ఇదేన‌ట‌!

By:  Tupaki Desk   |   30 July 2021 12:30 AM GMT
పీకే కాంగ్రెస్ లో చేరితే.. జ‌రిగేది ఇదేన‌ట‌!
X
'ప్ర‌శాంత్ కిషోర్‌..' ఆయ‌న ప‌క్క‌నున్న వారికి ఖ‌చ్చితంగా గుండె ధైర్యం వ‌స్తుంది. ప్ర‌త్య‌ర్థుల‌కు మాత్రం గుండెల్లో వ‌ణుకు పుడుతుంది. అంత‌లా.. త‌న స్థాయిని పెంచుకున్నాడు. త‌న‌ని తాను నిరూపించుకున్నాడు. ఆయ‌న సాధించిన విజ‌యాలు అలాంటివి మ‌రి. అందుకే.. ఎన్నిక‌లు వ‌స్తున్నాయంటే.. పీకేను రాజ‌కీయ వ్యూహ‌క‌ర్త‌గా నియ‌మించుకోవాల‌ని పార్టీలు పోటీప‌డే ప‌రిస్థితి వ‌చ్చింది. ప్ర‌శాంత్ కిషోర్ వ్యూహ క‌ర్తగా ఉన్నాడంటే.. ఆ పార్టీ అధికారంలోకి వ‌చ్చేస్తుంది అన్నంత‌గా న‌మ్మ‌కం వ‌చ్చేసింది రాజ‌కీయ పార్టీల‌కు! అలాంటి పీకే.. కాంగ్రెస్ పార్టీలో చేర‌నున్నారా? అనే వార్త‌ కొన్ని రోజులుగా చ‌ర్చ‌నీయాంశం అయ్యింది.

కాంగ్రెస్ పార్టీ ప‌రిస్థితి నానాటికీ తీసిక‌ట్టు అన్న చందంగా త‌యారైంది. రెండు ద‌ఫాలుగా ఓడిపోవ‌డంతో పార్టీని పున‌ర్ నిర్మించ‌డానికి రాహుల్ గాంధీ న‌డుం బిగించారు. యువ‌త‌కు ప‌ట్టం క‌ట్టి, వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఎలాగైనా గెలిచి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకు రావాల‌నే కృత‌నిశ్చ‌యంతో ఉన్నారు రాహుల్‌. ఆయ‌న తీసుకుంటున్న నిర్ణ‌యాలు.. చేస్తున్న ప‌నులు అదే విష‌యాన్ని చాటి చెబుతున్నాయి. ఈ మార్పు తెలంగాణ నుంచే మొద‌లు పెట్టారు. సీనియ‌ర్లు ఎంతో మంది ఎన్ని అడ్డంకులు పెట్టినా, మ‌రెన్ని అభ్యంత‌రాలు పెట్టినా.. ఫైన‌ల్ గా పార్టీని బ‌తికించేవాడు.. న‌డిపించేవాడు కావాల‌ని రేవంత్ రెడ్డికి ప‌గ్గాలు అప్ప‌గించారు. అటు పంజాబ్ లోనూ సిద్ధూకు పీసీసీ ఇచ్చారు. అంతేకాదు.. ముఖ్య‌మంత్రి అమ‌రీందర్‌, సిద్ధూకు మ‌ధ్య ఏర్ప‌డిన వివాదాన్ని కూడా సెటిల్ చేశారు. ఆ త‌ర్వాత రాజ‌స్థాన్ పైనా దృష్టిపెట్టారు. స‌చిన్ పైల‌ట్‌-గెహ్లాట్ మ‌ధ్య‌నున్న వివాదాన్ని ప‌రిష్క‌రించేందుకు దూత‌ల‌ను రంగంలోకి దించారు.

ఇలా.. ఒక్కొక్క‌టిగా సెట్ చేసుకుంటూ వ‌స్తున్న రాహుల్‌.. ప్ర‌శాంత్ కిషోర్ ను పార్టీలోకి తీసుకొచ్చే అంశంపై సీరియ‌స్ గా చ‌ర్చిస్తున్నారు. ఆ మ‌ధ్య రాహుల్ గాంధీ, సోనియాతో ప్ర‌శాంత్ కిషోర్ భేటీ కావ‌డం జాతీయ రాజ‌కీయాల్లో సంచ‌ల‌నం సృష్టించింది. కేంద్రంలో రాబోయే ఎన్నిక‌ల‌కు చాలా స‌మ‌యం ఉన్న‌ప్ప‌టికీ.. ఎందుకు వీరిద్ద‌రు భేటీ అయ్యార‌నే చ‌ర్చ జ‌రిగింది. అయితే.. పీకే కాంగ్రెస్ లో చేర‌బోతున్నాడ‌నే వార్త‌లు గుప్పుమ‌న్నాయి. ఇప్ప‌టి వ‌ర‌కూ ప్ర‌శాంత్ కిషోర్ దీనిపై స్ప‌ష్ట‌మైన ప్ర‌క‌ట‌న ఏదీ చేయ‌లేదు. ఈ మ‌ధ్య‌నే ప‌లుమార్లు ఎన్సీపీ అధినేత శ‌ర‌ద్ ప‌వార్ ను కూడా పీకే క‌లిసిన సంగ‌తి తెలిసిందే. థ‌ర్డ్ ఫ్రంట్ కు పీకే స‌ల‌హాదారుగా ఉండ‌బోతున్నార‌నే ప్ర‌చారం కూడా సాగింది. కానీ.. ఏదీ క్లారిటీ రాలేదు.

ఇలాంటి ప‌రిస్థితుల్లోనే రాహుల్ గాంధీ అధ్య‌క్ష‌త‌ను కాంగ్రెస్ స‌మావేశం నిర్వ‌హించింది. ఈ స‌మావేశంలో క‌మ‌ల్ నాథ్‌, మ‌ల్లిఖార్జున ఖ‌ర్గే, ఏకే ఆంటోనీ, అజ‌య్ మాకెన్‌, ఆనంద్ శ‌ర్మ‌, హ‌రీష్ ర‌వ‌త్‌, అంబికా సోని, వేణుగోపాల్ వంటి సీనియ‌ర్ నాయ‌కులు ఈ స‌మావేశంలో పాల్గొన్నారు. ఈ భేటీలో ప్ర‌ధానంగా ప్ర‌శాంత్ కిషోర్ గురించే చ‌ర్చించిన‌ట్టు స‌మాచారం. ప్ర‌శాంత్ కిషోర్ ను పార్టీలో చేర్చుకుంటే మంచి జ‌రుగుతుందా? వ్యతిరేకత వచ్చే అవకాశం ఏమైనా ఉందా? అనే చ‌ర్చ కూడా సాగింద‌ని స‌మాచారం. అయితే.. చాలా మంది పీకేను పార్టీలో చేర్చుకోవాల‌ని, అది మేలు చేకూరుస్తుంద‌ని కూడా చెప్పిన‌ట్టు తెలుస్తోంది.

వ‌చ్చే ఏడాది ఐదు రాష్ట్రాల్లో ఎన్నిక‌ల జ‌ర‌గ‌బోతున్న సంగ‌తి తెలిసిందే. ఇందులో కాంగ్రెస్ అధికారంలో ఉన్న పంజాబ్ కూడా ఉంది. మిగిలిన నాలుగు రాష్ట్రాలు బీజేపీ పాలిత రాష్ట్రాలు. ఈ ఎన్నిక‌ల్లో పంజాబ్ ను నిల‌బెట్టుకోవ‌డంతోపాటు.. మిగిలిన రాష్ట్రాల్లోనూ హ‌స్తం జెండా ఎగ‌రేయాల‌ని కాంగ్రెస్ ఆరాట‌ప‌డుతోంది. దీనికి ప్ర‌శాంత్ కిషోర్ తోడైతే.. పార్టీకి ఎదురే ఉండ‌ద‌ని నేత‌లు భావిస్తున్నారు. మ‌రి, ఏం జ‌రుగుతుంది? నిజంగానే పీకే కాంగ్రెస్ లో చేరుతారా? అన్న‌ది చూడాలి.