Begin typing your search above and press return to search.

ప్రపంచ దేశాలు ఆదుకోకపోతే అంతేసంగతులా ?

By:  Tupaki Desk   |   24 Jun 2022 12:30 AM GMT
ప్రపంచ దేశాలు ఆదుకోకపోతే అంతేసంగతులా ?
X
శ్రీలంకలో పరిస్థితులు రోజురోజుకు మరీ అధ్వాన్నంగా మారిపోతున్నాయి. మూడు పూటలా తిండి తినడం కూడా లక్షలాది కుటుంబాలకు కష్టంగా మారిపోయింది. తినటానికి తిండి గింజలు దొరకటం లేదు, ఒకవేళ ఎక్కడన్నా ఉన్నాయని కొందామన్నా డబ్బులు లేవు. ఇంట్లో వంటలు చేసుకునేందుకు లేదు, హోటళ్ళు, రెస్టారెంట్లు నడపాలంటే గ్యాస్ లేదు, నిత్యావసరాలు దొరకటం లేదు.

ఇందుకనే ఈ పరిస్ధితుల్లో నుండి దేశాన్ని బయటపడేసేందుకు ఇతర దేశాలతో డోనార్ కాన్ఫరెన్సు నిర్వహించాలని డిసైడ్ చేసినట్లు ప్రధానమంత్రి రణిల్ విక్రమ్ సింఘే ప్రకటించారు. చైనా, భారత్, నేపాల్, బంగ్లాదేశ్, జపాన్ దేశాల సాయం కోరేందుకని డోనార కాన్ఫరెన్స్ గురువారం నిర్వహించబోతున్నారు. పనిలోపనిగా అమెరికా నుండి కూడా అవసరమైన సాయం అందుకోవాలని రణిల్ నిర్ణయించారు.

ఇప్పటికే భారత్ చమురు, గ్యాస్ ను పంపటమే కాకుండా 3 బిలియన్ డాలర్లు సాయం అందించింది. శ్రీలంకకు ప్రస్తుత పరిస్దితుల్లో అత్యవసరంగా తిండిగింజలు, మందులు, చమురు, గ్యాస్, నిత్యావసరాలు కావాలి. దేశ ప్రజలకు పైవి అందితె తక్షణ కరువు సమస్య నుండి బయటపడుతుంది.

ఏ ఏ దేశాల నుండి ఏమేమి కోరబోతున్నారనే జాబితాను శ్రీలంక ప్రభుత్వం ఇప్పటికే రెడీ చేసింది. అయితే ఇపుడు ఆశిస్తున్నదంతా కేవలం నూరుశాతం గ్రాంటుగానే శ్రీలంక చెబుతోంది. కాబట్టి ప్రపంచ దేశాలు ద్వీప దేశానికి ఉదారంగా సాయం అందించాల్సిందే.

ఇప్పటి పరిస్థితుల్లో శ్రీలంకను ప్రపంచ దేశాలు ఆదుకోకపోతే లక్షలాది మంది జనాలు అల్లాడిపోతారు. తొందరలోనే దేశంలో ఆకలి చావులు మొదలవ్వటం ఖాయమని అనేక రిపోర్టులు చెబుతున్నాయి. ప్రపంచ దేశాలతో పాటు ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ నుండి తీసుకున్న అప్పులను కూడా శ్రీలంక తీర్చలేక చేతులెత్తేసింది.

తాను తీసుకున్న అప్పును తీర్చలేను కాబట్టి తీసుకున్న అప్పును మాఫీ చేయాల్సిందిగా విజ్ఞప్తి చేసింది. ఇదే సమయంలో దేశం దివాలా తీసినట్లుగా శ్రీలంక రిజర్వ్ బ్యాంకు ప్రకటించటం అప్పట్లో సంచలనంగా మారింది. మొత్తానికి సంక్షోభం నుండి శ్రీలంక బయటపడాలంటే ప్రపంచ దేశాలు తలా ఒక చేయి వేయాల్సిందే.