Begin typing your search above and press return to search.

విపక్షంలో ఉన్నప్పుడు సీపీఎస్ ఏంది? పవర్లోకి వచ్చాక జీపీఎస్ ఏంది జగన్?

By:  Tupaki Desk   |   26 April 2022 7:30 AM GMT
విపక్షంలో ఉన్నప్పుడు సీపీఎస్ ఏంది? పవర్లోకి వచ్చాక జీపీఎస్ ఏంది జగన్?
X
అందుకే అంటారు హామీలు ఇవ్వటం తేలిక.. వాటిని అమలు చేయటం చాలా కష్టమని. విపక్షంలో ఉన్నప్పుడు ఏం చేసైనా సరే అధికారంలోకి రావాలని తపిస్తుంటారు. పవర్లోకి వచ్చిన తర్వాత మాత్రం తాము అదే పనిగా చెప్పిన మాటల్ని ఆచరణలోకి తీసుకురావటానికి కిందామీదా పడుతుంటారు. ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఇప్పుడు ఇదేలా ఉంది. ప్రభుత్వ ఉద్యోగుల మనసుల్ని దోచుకోవటానికి వీలుగా.. విపక్షంలో ఉన్న వేళలో ఆయన నోటి నుంచి తరచూ ఒక మాట వస్తూ ఉండేది.

కాంట్రిబ్యూటరీ ఫించన్ పథకం కింద పని చేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులకు.. సీపీఎస్ ను రద్దు చేస్తామని.. పాత ఫించన్ విధానాన్ని అమలు చేస్తామని చెప్పేవారు. అందుకు ఎంత ఖర్చు అయినా ఫర్లేదని.. తమ ప్రభుత్వం భరిస్తుందని భరోసా ఇచ్చేవారు. ఎన్నికల వేళ జగన్ కు పరిస్థితులు అనుకూలంగా మారటంలో ప్రభుత్వ ఉద్యోగులకు రద్దు చేస్తామన్న సీపీఎస్ సైతం చాలానే వర్కవుట్ అయ్యిందని చెబుతారు. అధికారంలోకి వచ్చి మూడేళ్లు అవుతున్నా.. రద్దు చేస్తామన్న సీపీఎస్ ను మాత్రం అలానే ఉంచటంపై ఉద్యోగ సంఘాల వారు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు.

ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీల్ని ఎలాగైనా అమలు చేస్తానని చెప్పిన జగన్.. ప్రభుత్వాధినేతగా వ్యవహరిస్తూ కూడా ఇచ్చిన హామీని ఎందుకు అమలు చేయడం లేదన్న ప్రశ్నను ఉద్యోగులు సంధిస్తున్నారు. అయితే.. ఈ హామీని అమలు చేయాలంటే భారీగా నిధులు అవసరం కావటం.. ప్రభుత్వం మీద భారం అధికంగా పడుతుందన్న ఉద్దేశంతోనే సీపీఎస్ ను రద్దు చేయటం లేదన్న మాటను చెబుతున్నారు.

ప్రభుత్వ తీరుపై గుర్రుగా ఉన్న ప్రభుత్వ ఉపాధ్యాయులు సీఎంవోను ముట్టడిస్తామని సోమవారం ప్రయత్నాలు చేయటం.. పోలీసులు భారీ ఎత్తున మొహరించి ఎక్కడికక్కడ నిలువరించటం.. నిరసనల మీద ఉక్కుపాదం మోపటంతో ప్రభుత్వం మీద నిరసన అన్నది బయటకు రాకుండా చేశారన్న మాట వినిపిస్తోంది. ప్రభుత్వంపై ఉద్యోగులు చేస్తున్న నిరసన కారణంగా భారీగా డ్యామేజ్ అవుతుందన్న మాట బలంగా వినిపిస్తోంది. దీనికి చెక్ పెట్టేందుకు సీపీఎస్ స్థానంలో జీపీఎస్ (గ్యారంటీడ్ పింఛన్ పథకం) విధానాన్ని తీసుకొస్తామన్న ప్రతిపాదనను ప్రభుత్వం తీసుకొచ్చింది.

దీనిపై ఉద్యోగ సంఘాలు తీవ్రంగా తప్పు పడుతున్నాయి. ఎన్నికల వేళలో సీపీఎస్ ను రద్దు చేస్తామని చెప్పి.. ఇప్పుడు అందుకుభిన్నంగా కొత్త విధానాన్ని తీసుకొస్తామని చెప్పటాన్ని తప్పు పడుతున్నారు. ఈ విధానంతో ఉద్యోగులకు జరిగే ప్రయోజనం పెద్దగా ఉండదని స్పష్టం చేస్తున్నారు. తాను విపక్ష నేతగా ఉన్న వేళలో ఇచ్చిన హామీని సీఎం జగన్ నెరవేర్చాలని కోరుతున్నారు. గత ప్రభుత్వ హయాంలో టక్కర్ కమిటీ 50 శాతం పింఛన్ పథకాన్ని ప్రతిపాదించినా దాన్ని తిరస్కరించటాన్ని గుర్తు చేస్తున్నారు. ప్రస్తుతం జగన్ ప్రభుత్వం తీసుకొస్తానన్న జీపీఎస్ లో కేవలం 33 శాతమే పింఛన్ పథకాన్ని తేవాలని చూస్తుందని.. ఇదేమాత్రం సరికాదని స్పష్టం చేస్తున్నారు.

సీపీఎస్ రద్దు పై ఉద్యోగ సంఘాల వారితో చర్చలు జరిపిన ప్రభుత్వం.. తాజాగా కొత్త కమిటీని ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో మంత్రి బొత్స సత్యానారాయణ.. బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి.. ఆదిమూలపు సురేశ్.. ప్రభుత్వ సలహాదారు సజ్జల రామక్రిష్ణారెడ్డి.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కూడా ఈ కమిటీలో ఉంటారని చెబుతున్నారు. ఏమైనా.. విపక్షంలో ఉన్నప్పుడు చెప్పిన సీపీఎస్ ను రద్దు చేయకుండాకొత్తగా జీపీఎస్ విధానాన్ని తెస్తామని చెప్పటాన్ని ఉద్యోగులు వ్యతిరేకిస్తున్నారు. అధికారంలో లేనప్పుడు ఒక మాట.. ఉన్నప్పుడు మరో మాట ఏంది జగన్? అన్న ప్రశ్న పలువురి నోటి వెంట వినిపిస్తోంది.