Begin typing your search above and press return to search.

నల్లపురెడ్డి వర్సెస్ జగన్ : నెల్లూరు వైసీపీలో ఏం జరుగుతోంది...?

By:  Tupaki Desk   |   19 July 2022 12:30 PM GMT
నల్లపురెడ్డి వర్సెస్ జగన్ : నెల్లూరు వైసీపీలో ఏం జరుగుతోంది...?
X
నెల్లూరు జిల్లా అంటే వైసీపీకి కంచుకోట. 2019 ఎన్నికల నుంచి ఈ రోజు దాకా చూస్తే అన్నింటా వైసీపీదే హవా. ఇక వైసీపీకి ఈ జిల్లాలో సీనియర్ నేతలు పలువురు ఉన్నారు. ఇక దిగ్గజాల వంటి నాయకులు అనేకులు వైసీపీలో కనిపిస్తారు. ఇక రాజకీయ కుటుంబ చరిత్ర, ఘనమైన రాజకీయ వారసత్వాలు కలిగిన వారు కూడా ఇదే జిల్లాలో ఉన్నారు. వారిలో నల్లపురెడ్డిది రాజకీయ కుటుంబం. అప్పట్లో అంటే 1970 దశకంలోనే నల్లపురెడ్డి శ్రీనివాసులురెడ్డి కాంగ్రెస్ రాజకీయాల్లో చురుకుగా ఉండేవారు.

ఆయన తెలుగుదేశం పార్టీ పెట్టడంతో అందులో చేరిపోయారు. 80 దశకంలో ఆయన హవా మామూలుగా ఉండేది కాదు, ఆయనకు చంద్రబాబుతో విభేదాలు రావడంతో టీడీపీని వీడిపోయారు. ఎన్టీయార్ మీద కూడా పెద్ద ఎత్తున విమర్శలు చేస్తూ అప్పట్లో ఏపీ అంతా పర్యటించారు. ఇక తరువాత రోజుల్లో కాంగ్రెస్ లో చేరినా ఆయన మునుపటి వెలుగు వెలగలేదు. ఆయన గతించాక వారసుడిగా వచ్చిన నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ఉప ఎన్నికల్లో టీడీపీ ద్వారానే తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టారు.

ఆ తరువాత ఆయన కాంగ్రెస్ రాజకీయాలను చూశారు. అక్కడ కూడా చాన్నాళ్ళు ఉన్నారు. ఇక ఆయన జగన్ పార్టీ పెడితే వచ్చి చేరిన తొలి బ్యాచ్ లో ఒకరు. జగన్ తనను నమ్ముకున్న వారందరికీ ఏదోలా న్యయం చేశారు. కానీ నల్లపురెడ్డికి మాత్రం మంత్రి పదవి ఇవ్వలేదు 2019 ఎన్నికల తరువాత మేకపాటి గౌతం రెడ్డికి, అనిల్ కుమార్ యాదవ్ కి మంత్రి పదవులు లభించాయి.

దాంతో నాడే అసంతృప్తికి గురి అయిన నల్లపురెడ్డి మూడేళ్ళు ఎలాగో ఓర్చుకున్నారు. కానీ మలివిడతలో సైతం కాకాణి గోవర్ధనరెడ్డికి పదవి రావడంతో ఒక విధంగా మండిపోయారనే చెబుతారు. ఇక ఆయన సర్కార్ మీద తన అసంతృప్తిని ఎపుడూ దాచుకోలేదు. జగనన్న ఇళ్ళు కొత్తగా కాపురం చేసుకునేవారికి ఏ మూలకు సరిపోతాయని ప్రశ్నించి ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టిన వారు నల్లపురెడ్డి.

అంతే కాదు సొంత ప్రభుత్వం మీదనే ఆయన చాలా విమర్శలు చేస్తూ వచ్చారు. అధికారుల మీద కామెంట్స్ చేస్తూనే ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెడుతూ వచ్చారు. ఇవన్నీ ఇలా ఉంటే మే 11 నుంచి గడప గడపకు మన ప్రభుత్వం అన్న పేరిట వైసీపీ ఒక కార్యక్రమం తీసుకుంది. దీనికి అందరి కంటే కూడా చాలా తక్కువగా మరీ బొత్తిగా రెండు రోజులు మాత్రమే అటెండ్ అయిన వారిలో ఇద్దరు ఎమ్మెల్యేలు ఉన్నారు. మాజీ మంత్రి ఆళ్ల నాని ఒకరైతే నల్లపురెడ్డి రెండవవారు.

ఇదే విషయం గతసారి జరిగిన ఎమ్మెల్యేల వర్క్ షాప్ లో జగన్ చెప్పి హెచ్చరించారు. అయినా షరా మాములుగానే నల్లపురెడ్డి తీసుకున్నారు అంటున్నారు. దాంతో జగన్ కి వచ్చిన సర్వేలను చూస్తే నల్లపురెడ్డి గడప గడపకూ పోవడంలేదని తెలుస్తోంది. దీని మీద జగన్ ఎమ్మెల్యేల సమావేశంలో కచ్చితంగానే చెప్పారు. ఎవరు గడప గడపకు వెళ్ళారో, ఎవరు ప్రజల మద్దతు చూరగొనరో వారికి టికెట్లు ఉండవని క్లారిటీ ఇచ్చేశారు.

దాంతో ఇపుడు అందరి చూపు నల్లపురెడ్డి మీద ఉంది. ఆయనకు జగన్ టికెట్ నిరాకరిస్తారా అన్నదే చర్చ. నిజంగా అదే జరుగుతుందా అని కూడా ఆసక్తిగా చూస్తున్నారు. అయితే నెల్లూరు జిల్లాలో నల్లపురెడ్డిది ప్రతిష్ట కలిగిన రాజకీయ కుటుంబం. ఆయన కూడా దూకుడు కలిగిన నేత. జగన్ అంటే బాగా ఇష్టపడే నాయకుడు. ఇపుడు నల్లపురెడ్డి వర్సెస్ వైసీపీ అన్నట్లుగా వ్యవహారం వచ్చింది.

మరి జగన్ అంటే అన్న మాట ప్రకారం చేస్తారు. నల్లపురెడ్డిని తీసుకుంటే ఆయన కూడా పట్టుదల మనిషి. వెనక్కి తగ్గే వైఖరి లేదు. ఈ మధ్యనే ఆత్మకూరు ఉప ఎన్నికల ప్రచారంలో ఆయన మాట్లాడుతూ ఉప ఎన్నికల్లో పోటీ పెట్టనందుకు తెలుగుదేశం పార్టీకి, చంద్రబాబుకు మనం రుణపడిఉండాలని హాట్ కామెంట్స్ చేశారు. మరి నల్లపురెడ్డి వేరే ఆలోచనలు చేస్తున్నారా. లేక ఆయన అసంతృప్టి పీక్స్ కి చేరుకుందా అన్నది కూడా ఆలోచించాలి.

నల్లపురెడ్డి బలమైన నాయకుడు. గడప గడపకూ వెళ్తేనే అందరూ ఎమ్మెల్యేలుగా తిరిగి నెగ్గుతారని లేదు. చాలా మందికి మొదటి నుంచి ఉన్న రాజకీయ పరపతి కూడా గెలుపును డిసైడ్ చేస్తుంది. అలా కనుక ఆలోచిస్తే గట్టి నాయకుడు, సీనియర్ ఎమ్మెల్యేగా ఉన్న నల్లపురెడ్డిని దూరం చేసుకుంటే మాత్రం వైసీపీకి ఇబ్బందే అన్న వారూ ఉన్నారు. చూడాలి మరి ఈ వ్యవహారం ఎంత దూరం వెళ్తుందో. మొత్తానికి చూస్తే నల్లపురెడ్డి పార్టీ మీద తీవ్ర అసంతృప్తితో ఉన్నారని అంటున్నారు. అదే సమయంలో ఆయన వ్యవహార శైలి పట్ల జగన్ కూడా అసహనంగా ఉన్నరని చెబుతున్నారు.