Begin typing your search above and press return to search.

ఒడిస్సా కుట్రలు చేస్తుంటే జగన్ ఏమి చేస్తున్నారు ?

By:  Tupaki Desk   |   13 Feb 2021 12:30 AM GMT
ఒడిస్సా కుట్రలు చేస్తుంటే జగన్ ఏమి చేస్తున్నారు  ?
X
విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటీకరించాలనే కుట్ర వెనుక ఒడిస్సా రాష్ట్రం ఉందా ? తాజాగా వైసీపీ ఎంపి విజయసాయిరెడ్డి చేసిన ఆరోపణలు చూస్తుంటే అవుననే అనిపిస్తోంది. ఒడిస్సా ఒత్తిడికి తలొంచిన కేంద్రప్రభుత్వం విశాఖ ఉక్కును ప్రైవేటీకరించాలని డిసైడ్ అయ్యిందన్నారు. ఒడిస్సా కుట్ర ఏముందయ్యా అంటే కేంద్ర ఉక్కు పరిశ్రమల శాఖ మంత్రి ఒడిస్సా ఎంపినేట. అలాగే ఉక్కు ఫ్యాక్టరీకి సీఎండిలుగా పనిచేసిన వారిలో అత్యధికులు ఒడిస్సా రాష్ట్రం వారేనట.

స్టీలు ప్లాంటును సొంతం చేసుకునేందుకు కేంద్రంలోని పెద్దలు, పారిశ్రామికవేత్తలు కలిసి కుట్రలు పన్నిన కారణంగానే కేంద్రం ప్రైవేటీకరణకు అనుకూలంగా నిర్ణయం తీసుకున్నట్లు ఎంపి ఆరోపించారు. ఇంత వరకు ఎంపి చేసిన ఆరోపణలు నిజమనే అనుకుందాం. మరి వాళ్ళ కుట్రకు విరుగుడుగా మన ప్రభుత్వం ఏమి చేసింది ? జగన్మోహన్ రెడ్డి ఏమి చేశారు ? ఏమి చేయబోతున్నారు ? అన్నది చాలా కీలకంగా మారింది.

విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ వెనుక ఎవరెన్ని కుట్రలు చేసినా వాటిని ఛేదించాల్సిన బాధ్యత అయితే జగన్ పై ఉంది కదా. 22 మంది ఎంపిల బలమున్న అధికారపార్టీ కేంద్రం నిర్ణయానికి తలొంచాల్సిన అవసరం ఏమిటి ? విశాఖ ఉక్కును కాపాడుకునేందుకు ఎటువంటి ప్లాన్ వేస్తోందనే విషయంపైనే జనాలు ఎదురు చూస్తున్నారు. కుట్రలు ఎవరు చేశారన్నది ఇక్కడ అప్రస్తుతం. ఆ కుట్రలను జగన్ ఎలా బద్దలు కొట్టబోతున్నాడన్నదే ప్రధానమైంది.

ఉక్కు ప్రైవేటాకరణలో ఒడిస్సా కుట్రుందని చెప్పి తమ బాధ్యత నుండి సింపుల్ గా తప్పించుకుంటామంటే కుదరదని ఎంపి గ్రహించాలి. జనాలు 151 అసెంబ్లీ, 22 ఎంపి సీట్లిచ్చింది రాష్ట్రప్రయోజనాలను కాపాడుతారనే. అంతే తప్ప మన రాష్ట్రానికి వ్యతిరేకంగా ఎవరెరవరు కుట్రలు చేస్తున్నారో ప్రకటిస్తారని కాదు. మన రాష్ట్రప్రయోజనాలను దెబ్బ కొట్టేందుకు కచ్చితంగా ఇతర రాష్ట్రాలు ప్రయత్నిస్తాయనటంలో సందేహం లేదు. అయితే ఆ కుట్రలను ఎలా తిప్పి కొట్టామన్నదే కీలకం. మరిపుడు ఒడిస్సా కుట్రలను జగన్ ఎలా తిప్పి కొడతారో ? ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటుపరం కాకుండా ఎలా కాపాడుతారో చూడాలి.