Begin typing your search above and press return to search.

జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌ టీకా ప్రత్యేకతలేంటి? డెల్టాను ఎదుర్కొనే దమ్ము ఎంత?

By:  Tupaki Desk   |   8 Aug 2021 4:38 AM GMT
జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌ టీకా ప్రత్యేకతలేంటి? డెల్టాను ఎదుర్కొనే దమ్ము ఎంత?
X
కరోనా మహమ్మారి నేపథ్యంలో.. దాని వ్యాప్తిని అడ్డుకునేందుకు వచ్చిన సమర్థవంతమైన టీకాల్లో ఒకటిగా చెప్పే జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీ వ్యాక్సిన్ కు భారత ప్రభుత్వం అత్యవసర వినియోగం కోసం ఓకే చెప్పేసింది. ఇదే విషయాన్ని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖా మంత్రి స్వయంగా ప్రకటించారు. దీంతో.. కరోనా మీద పోరాడుతున్న భారత్ కు మరో టీకా అమ్ములపొదిలో చేరింది. టీకాల విషయానికి వస్తే.. ఇది ఐదోది. దేశంలో అత్యవసర వినియోగానికి ఓకే చెప్పిన ఐదు టీకాల్ని చూస్తే..

1. ఫూణెలోని సీరం వారి కోవిషీల్డ్
2. హైదరాబాద్ కు చెందిన భారత్ బయోటెక్ వారి కొవాగ్జిన్
3. రష్యాకు చెందిన స్పుత్నిక్ (దీన్ని డాక్టర్ రెడ్డీస్ ల్యాబరేటరీ తయారు చేస్తోంది)
4. అమెరికాకు చెందిన మోడెర్నా
5. అమెరికాకు చెందిన జాన్సన్ అండ్ జాన్సన్

ఆసక్తికరమైన విషయం ఏమంటే.. జాన్సన్ అండ్ జాన్సన్ సంస్థ అత్యవసర వినియోగానికి అనుమతులకై దరఖాస్తు చేసుకున్న రోజునే ఓకే చెప్పేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. అనుమతి కోసం అప్లికేషన్ పెట్టుకున్న రోజే ఓకే చెప్పేస్తూ డీసీజీఐ పచ్చజెండా ఊపేసింది. మిగిలిన టీకాలకు జాన్సన్ అండ్ జాన్సన్ వ్యాక్సిన్ కు ఉన్న తేడా.. ఈ టీకాను ఒక్క డోసు వేసుకుంటే సరిపోతుంది. ఒక్క డోసు 0.5మిల్లీలీటర్లు వినియోగిస్తారు. 18 ఏళ్లు.. అంతకంటే ఎక్కువగా వయసున్న వారికి ఈ టీకాను వినియోగించే వీలుంది. వ్యాక్సిన్ తీసుకున్న 28 రోజుల తర్వాత పూర్తిస్థాయిలో ప్రభావాన్ని చూపిస్తుందని అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి.

ఇక్కడ ప్రస్తావించాల్సిన మరో అంశం ఏమంటే.. జాన్సన్ అండ్ జాన్సన్ టీకాకు ఎప్పుడో అనుమతులు ఇవ్వాల్సి ఉంది. కానీ.. ఈ వ్యాక్సిన్ వాడిన వారికి నరాలకు సంబంధించిన సైడ్ ఎఫెక్ట్స్ ను ఎదుర్కొంటున్నట్లుగా వార్తలు రావటంతో తన అప్లికేషన్ ను సదరు కంపెనీ వెనక్కి తీసుకుంది. తాజాగా పూర్తి అయిన అధ్యయనం.. అందులో క్లీన్ చిట్ రావటంతో మరోసారి దరఖాస్తు పెట్టుకోవటం.. ఆ వెంటనే కేంద్రం స్పందించిన లైన్ క్లియర్ చేయటం జరిగింది.
ఇప్పటికే అందుబాటులో ఉన్న వ్యాక్సిన్లతో పోలిస్తే.. ఈ టీకాకు చాలానే ప్రత్యేకతలు ఉన్నట్లు చెబుతారు. అవేమిటన్నది చూస్తే..

- ఇప్పటివరకు ఉన్న టీకాలన్ని రెండు డోసులు వేసుకోవాల్సిందే. జాన్సన్ అండ్ జాన్సన్ వ్యాక్సిన్ మాత్రం ఒక్క డోసుతోనే సరిపోతుంది.
- ఈ టీకా అత్యంత సురక్షితమైనదన్న విషయం అమెరికా.. దక్షిణాఫ్రియాలో జరిపిన పరిశోధనలు తేల్చాయి.
- ఫైజర్.. మోడెర్నా మాదిరి అత్యంత శీతలీకరణలో ఉంచాల్సిన అవసరం లేదు. సాధారణ ఫ్రిజ్ లో కూడా ఎంచక్కా మూడు నెలల పాటు నిల్వ ఉంచొచ్చు. ఈ నేపథ్యంలో కోల్డ్ స్టోరేజీ సదుపాయాలు లేని మారుమూల ప్రాంతాల్లోకి ఈ వ్యాక్సిన్ ను తీసుకెళ్లటం చాలా సులువు.
- ఫైజర్, మోడెర్నా వ్యాక్సిన్‌లో వినియోగించే ఎంఆర్ఎన్ఏ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఈ టీకాలో వాడలేదు. ఆక్స్‌ఫర్డ్‌–ఆస్ట్రాజెనెకా టీకా మాదిరిగా ఇది ఎడెనోవెక్టర్‌ వ్యాక్సిన్‌.
- ఎడెనోవెక్టర్‌ వ్యాక్సిన్‌ అంటే.. కరోనా వైరస్ జన్యువుల్లోని స్పైక్ ప్రొటీన్ ను ఎడెనోవైరస్ తో సమ్మేళనం చేసి ఈ టీకాను తయారు చేశారు. ఇది శరీరంలో ప్రవేశించాక రోగనిరోధక వ్యవస్థ ప్రతిస్పందించి స్పైక్‌ ప్రొటీన్‌పై పోరాడడానికి సిద్ధమవుతుంది. దీంతో శరీరంలో యాంటీబాడీలు వచ్చి చేరుతాయి.

ఒక్క డోస్ తోనే కరోనాను కంట్రోల్ చేసే శక్తివంతమైన ఈ టీకాకు సంబంధించి పలు వివాదాలు ఉన్నాయి. కానీ.. అవన్నీ కాలపరీక్షలో మాత్రం నిలవకపోవటం గమనార్హం. ఈ వ్యాక్సిన్ ను అమెరికాలో వాడటం మొదలు పెట్టిన ఏప్రిల్ లో కొన్ని కేసుల్లో రక్తం గడ్డ కట్టటం జరుగుతుందన్న విషయాన్ని గుర్తించారు. దీంతో ఈ టీకా కార్యక్రమాన్ని చేపట్టారు. అమెరికా ప్రభుత్వం స్వయంగా ఈ టీకా పర్యవేక్షణ చేయటం.. అందులో క్లీన్ చిట్ రావటంతో ఈ టీకాను మళ్లీ మార్కెట్లో అందుబాటులోకి తీసుకొచ్చారు.

తాజాగా ఈ టీకా మీద పరిశోధనలు జరిపిన దక్షిణాఫ్రియా అధ్యయనం మరో ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించింది. ప్రపంచానికి కునుకు లేకుండా చేస్తున్న డెల్టా వేరియంట్ పై సమర్థంగా పని చేస్తుందని చెబుతున్నారు. దక్షిణాఫ్రికాలో సిస్నోక్‌ అనే పేరుతో ఒక సర్వేను నిర్వహించారు. డెల్టా వేరియంట్ తో పాటు బీటా వేరియంట్ పైనా ఈ వ్యాక్సిన్ పని చేస్తుందన్న మాట వినిపిస్తోంది. ఈ టీకా వేయించుకున్న తర్వాత డెల్టా వేరియంట్ సోకితే ఆసుపత్రిలో చేరే అవసరం 71 శాతం మందికి ఉండదని తేల్చింది. బీటా వేరియంట్ అయితే 67 శాతం మందికి ఇంట్లోనే నయమవుతుందని.. మరణాల రేటును 96 శాతం తగ్గిస్తుందని తేల్చారు. ఈ వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత ఆసుపత్రికి వెళ్లే అవకాశం ఉండదని.. ప్రాణం మీదకు రావటం అసాధ్యమన్న విషయాన్ని ఈ అధ్యయనం స్పష్టం చేస్తోంది. డెల్టా వేరియంట్ వణికిస్తున్న తరుణంలో జాన్సన్ అండ్ జాన్సన్ టీకా ఒక ధైర్యాన్ని ఇస్తుందన్న మాట వినిపిస్తోంది.