Begin typing your search above and press return to search.

ఏపీలో బీఆర్ఎస్ విషయంలో అసలు కేసీఆర్ స్టాండ్ ఏంటి? ఎలా ముందుకెళతారు?

By:  Tupaki Desk   |   24 Dec 2022 10:55 AM GMT
ఏపీలో బీఆర్ఎస్ విషయంలో అసలు కేసీఆర్ స్టాండ్ ఏంటి? ఎలా ముందుకెళతారు?
X
ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనే ధ్యేయంగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్ర సమితి(టీఆర్ఎస్).. ఇప్పుడు భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్ ). తెలంగాణలో జరిగిన అభివృద్ధి దేశం మొత్తం చేస్తామని టీఆర్ఎస్ ను జాతీయ పార్టీగా ఆ పార్టీ అధినేత కేసీఆర్ మార్చారు. విభజిత ఆంధ్రప్రదేశ్లోనూ బీఆర్ఎస్ కొనసాగుతుందని సంకేతాలు ఇచ్చారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ కు మద్దతు ఇస్తూ ఏపీలోని కొందరు నాయకులు ఫ్లెక్సీలు కూడా ఏర్పాటు చేశారు. అయితే బీఆర్ఎస్ ఏపీలో పోటీ చేస్తే ఎలాంటి హామీలు ఇచ్చి ప్రజలను ఆకర్షిస్తుంది..? అనేది చర్చనీయాశంగా మారింది. ముఖ్యంగా ఏపీలో అధికార వైసీపీ ప్రవేశపెట్టిన మూడు రాజధానుల అంశాన్ని బీఆర్ఎస్ అంగీకరిస్తుందా..? లేక అమరావతికి జేై కొడుతుందా..? అనేది కీలకంగా మారింది. ప్రాంతీయ పార్టీ నుంచి ఇప్పుడే జాతీయ పార్టీగా అవతరించిన బీఆర్ఎస్ త్వరలో సరైన నిర్ణయం తీసుకుంటుందని ఆ పార్టీ కీలక నేత హరీశ్ రావు ఓ మీడియా సమావేశంలో చెప్పారు. కానీ స్పష్టమైన హామీ ఇవ్వకుండా దాటవేయడం పలు అనుమానాలకు దారి తీస్తోంది.

తెలంగాణ నుంచి విడిపోయిన తరువాత ఏపీలో టీడీపీ ప్రభుత్వం ఏర్పడింది. తమ రాష్ట్రానికి అన్ని విధాల అనుకూలంగా ఉంటుందని అమరావతిని రాజధానిగా ప్రకటించింది. అయితే వైసీపీ అధికారంలోకి వచ్చాక.. అన్ని ప్రాంతాల్లో అభివృద్ధి జరగాలాని కాంక్షిస్తూ మూడు రాజధానుల ప్రస్తావన తీసుకొచ్చారు. అప్పటికే ఉన్న అమరావతితో పాటు విశాఖ, కర్నూలు లను కూడా రాజధానులుగా ప్రకటించారు. దీనిపై అసెంబ్లీలో తీర్మానం చేశారు. కానీ అమరావతి రైతుల అభ్యంతరాలతో కోర్టు దానికి బ్రేకులు వేసింది. ఆ తరువాత ఈ విషయంలో వెనక్కి తగ్గేదే లే అంటూ మరోసారి ప్రకటన చేశారు. కానీ ప్రస్తుతం ఇది పెండింగులోనే ఉంది.

ఈ తరుణంలో మొన్నటి వరకు ప్రాంతీయ పార్టీగా ఉన్న టీఆర్ఎస్ ఇప్పుడు బీఆర్ఎస్ గా మారింది. అంటే దేశంలోని సమస్యలు పరిష్కరించే దిశగా తమ పార్టీ కార్యకలాపాలు చేస్తుందని ఆ పార్టీ అధినేత కేసీఆర్ ప్రకటించారు. అయితే ఏపీలోని మూడు రాజధానుల విషయంలో కేసీఆర్ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అమరావతి ప్రాంత ప్రజలు ఒకే రాజధాని ఉండాలని, సంవత్సరకాలంగా ఆందోళన చేస్తున్నారు. వీరికి టీడీపీ, బీజేపీ, జనసేనలు మద్దతు పలికాయి. కాంగ్రెస్ లోని కొందరు నాయకులు సైతం అమరావతికే జై అంటున్నారు.

ఇప్పుడు బీఆర్ఎస్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందోనని ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే కేసీఆర్, జగన్ ల మధ్య మైత్రి బంధం ఉంది. కానీ ఏపీలోకి బీఆర్ఎస్ ప్రవేశిస్తే వైసీపీ ఆహ్వానించే ప్రసక్తే లేదు. అటు ఇతర పార్టీలతోనూ కేసీఆర్ పొత్తు పెట్టుకునే అవకాశం లేదని తెలుస్తోంది. ఎందుకంటే ఇంతకాలం తెలంగాణలో ఉన్న తమకు వ్యతిరేకంగా పోరాడి వెళ్లగొట్టిన కేసీఆర్ తో మళ్లీ దోస్తీ కడితే ఏపీ ప్రజలు సహించరు. దీంతో ఒంటరిగానే బీఆర్ఎస్ ప్రజల్లోకి వెళ్లే అవకాశం ఉంది. దీంతో ఎటువంటి హామీలతో బీఆర్ఎస్ ప్రజలను ఆకర్షిస్తుందో చూడాలి.

ఏపీలో కేవలం మూడు రాజధానుల అంశమే కాకుండా ప్రత్యేక హోదా, పోలవరం ప్రాజెక్టు పూర్తికాని ఎన్నో సమస్యలు పెండింగులో ఉన్నాయి. వీటిపై స్పష్టమైన హామీ ఇచ్చే పార్టీకే పట్టం కట్టాలని అక్కడి ప్రజలు చూస్తున్నారు. ఒకవేళ బీఆర్ఎస్ ప్రత్యేకహోదాపై నిర్ణయం తీసుకుంటే తెలంగాణలో వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంది. మూడు రాజధానులకు సై అంటే అమరావతి ప్రాంత ప్రజలు దూరం పెడుతారు. ఈ నేపథ్యంలో ఎటు చూసినా బీఆర్ఎస్ కు ఏపీలో పెద్ద చిక్కులే ఎదురయ్యే అవకాశం ఉంది.

ఇటీవల బీఆర్ఎస్ పార్టీ కీలక నేత హరీశ్ రావు ను ఓ మీడియా ప్రముఖుడు మూడు రాజధానుల అంశంపై ప్రశ్నించారు. కానీ ఆయన ఆ విషయంపై దాట వేస్తూ సమాధానం చెప్పారు. ఇంకా సమయం ఉంది.. అంటూ చెప్పడం చూస్తే ఆ విషయంలో బీఆర్ఎస్ కు స్పష్టమైన క్లారిటీ లేనట్లే తెలుస్తోంది. మరో ఏడాదిలోనే ఏపీలో ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ మూడు రాజధానులపై స్పష్టమైన వైఖరి లేకపోతే ఏపీలో ఆ పార్టీని ఆదరించరని అంటున్నారు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.