Begin typing your search above and press return to search.

బుధవారం జాతిని ఉద్దేశించి మోడీ ఏం మాట్లాడనున్నారు?

By:  Tupaki Desk   |   5 Aug 2019 11:23 AM GMT
బుధవారం జాతిని ఉద్దేశించి మోడీ ఏం మాట్లాడనున్నారు?
X
రాజు తలుచుకుంటే నిర్ణయాలకు కొదవా? సంకల్పం ఉండాలే కానీ.. ఏదీ అసాధ్యం కాదన్న విషయాన్ని మోడీ సర్కారు తేల్చేసింది. అప్పుడెప్పుడో 70 ఏళ్ల క్రితం జరిగిన తప్పును సరిచేసేందుకు వీలుగా సాహసోపేతమైన నిర్ణయాన్ని తీసుకుంది మోడీ సర్కార్. ఒక్క నిర్ణయంతో ఇప్పటివరకూ జమ్ముకశ్మీర్ కు ఉన్న రూపురేఖల్ని మొత్తంగా మార్చేసిన ఆయన.. ఇప్పుడు మరో కీలక నిర్ణయాన్ని తీసుకోనున్నారా? అంటే అవునన్న మాట వినిపిస్తోంది.

ఆర్టికల్ 370.. 35ఏ తో పాటు.. జమ్ముకశ్మీర్ ను మూడు ముక్కలు చేయటం ద్వారా.. రాజకీయంగా.. పాలనాపరంగా.. నిర్ణయాల పరంగా మరింత ఈజీగా ఉండేలా నిర్ణయం తీసుకున్న మోడీ సర్కారు.. రానున్న రోజుల్లో మరో కీలక నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం ఉందంటున్నారు. రాజ్యసభలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఈ ఉదయం కశ్మీర్ పై చేసిన ప్రకటన నేపథ్యంలో మరో రెండు రోజుల్లో (బుధవారం) ప్రధాని మోడీ.. ఈ వ్యవహారంపై జాతిని ఉద్దేశించి కీలక ప్రకటన చేయనున్నట్లు చెబుతున్నారు.

కశ్మీర్ విషయంలో తాను తీసుకున్న నిర్ణయం వెనుక కారణాలతో పాటు.. రాజకీయ ప్రయోజనాల కంటే కూడా దేశం కోసమే తానీ నిర్ణయం తీసుకున్న ఫీలింగ్ కలిగేలా ఆయన ప్రసంగం ఉంటుందని చెబుతున్నారు. అదే సమయంలో తాజాగా తాము తీసుకున్న నిర్ణయం కారణంగా కశ్మీర్ లో ఎలాంటి శాంతిభద్రతల సమస్య తలెత్తకుండా ఉండేలా చర్యలు తీసుకోనున్నారు.

విశ్వసనీయ సమాచారం ప్రకారం జమ్ముకశ్మీర్ కు ప్రధాని భారీ ప్యాకేజీ ప్రకటించనున్నారని చెబుతున్నారు. బుధవారం జాతిని ఉద్దేశించి చేసే ప్రసంగం సందర్భంగా కశ్మీర్ కు ప్రదాని ప్రకటించే ప్యాకేజీతో ఆయన తీసుకున్న నిర్ణయం రాజకీయం కంటే కూడా కశ్మీర్ అభివృద్ది కోసమే అన్న భావన కలిగేలా ఆయన నిర్ణయం ఉండనున్నట్లుగా చెబుతున్నారు.

ఇప్పటివరకూ కశ్మీర్ లో బయటవారెవరూ పెట్టుబడులు పెట్టే వీల్లేదు. మోడీ సర్కారు తీసుకున్న ఆర్టికల్ 370 రద్దు నేపథ్యంలో జమ్ముకశ్మీర్ భౌగోళిక రూపురేఖలు మొత్తం మారిపోనున్నాయి. అంతేకాదు.. రానున్న రెండు రోజుల్లో జమ్ముకశ్మీర్ మీద తమ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బిల్లుపైన రెండు సభల్లో పూర్తిస్థాయి వివరణ ఇచ్చిన తర్వాత.. జాతిని ఉద్దేశించి ప్రసంగించటం ద్వారా.. తాను తీసుకున్న నిర్ణయం దేశహితాన్ని కాంక్షించే తప్పించి.. మరే ఉద్దేశం లేదన్నట్లుగా ఆయన మాటలు ఉండనున్నాయని చెబుతున్నారు.

ఇక్కడ మరో విషయాన్ని ప్రస్తావించాలి. కీలక నిర్ణయాలు ప్రకటించిన ప్రతిసారీ ప్రధాని మోడీ జాతిని ఉద్దేశించి ప్రసంగించటం తెలిసిన విషయమే. పెద్దనోట్ల రద్దు సమయంలో.. తానే స్వయంగా నిర్ణయాన్ని వెల్లడించటం తెలిసిందే. కశ్మీర్ విషయంలో మాత్రం రెండు రోజుల తర్వాత జాతిని ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఈ లోపు పార్లమెంటు ఉభయ సభల్లో చర్చతో పాటు.. అఖిలపక్షం సమావేశాన్ని నిర్వహించి.. తాము ఏం చేయనున్న విషయాన్ని వివరిస్తారని చెబుతున్నారు. ఏమైనా.. తాను తీసుకోవాల్సిన నిర్ణయాన్ని తీసేసుకొని.. తర్వాత అందరిని ఒప్పించే ప్రయత్నం చేయటం మోడీ మార్క్ రాజకీయంగా చెప్పక తప్పదు. మరోసారి తన మార్క్ ను మోడీ ప్రదర్శించారని చెప్పాలి.