Begin typing your search above and press return to search.

మోడీషాలది చాణుక్యమా? దరిద్రపుగొట్టు రాజకీయమా?

By:  Tupaki Desk   |   23 Nov 2019 12:23 PM GMT
మోడీషాలది చాణుక్యమా? దరిద్రపుగొట్టు రాజకీయమా?
X
దేశాన్ని ఉద్దరించటానికి.. కుళ్లిపోయిన రాజకీయాల్ని యాసిడ్ తో కడిగేయటానికి.. అవినీతి.. అక్రమాల్ని మొదలుకంటా తుంచేయటానికి పుట్టుకొచ్చిన కారణజన్ముడిగా ప్రధాని మోడీని అభివర్ణించేవారికి ఈ దేశంలో తక్కువ లేదు. అలా అని మోడీని ఉత్తపుణ్యానికి వ్యతిరేకించటం మా లక్ష్యం కూడా కాదు. తప్పును తప్పుగా.. ఒప్పును ఒప్పుగా చెప్పే మీడియా సంస్థలు తగ్గిపోతున్న వేళ.. అందుకు భిన్నంగా వాస్తవాల ఆధారంగా మాట్లాడటం.. తీసుకునే నిర్ణయాల్ని సమీక్షించే బాధ్యతతో ఈ కథనం రాస్తున్నామన్న విషయాన్ని గుర్తించాలి.

రాజకీయాల్లో కొత్త తీరును ప్రవేశ పెట్టేందుకే మోడీషాలు ఉన్నారని చెప్పే వారు.. తాజాగా మహారాష్ట్రలో చోటు చేసుకున్న మహా ట్విస్టు గురించి ఏమంటారు? తమకు బలం లేదని గవర్నర్ కు లేఖ రాసిన కమలనాథులు.. రెండు వారాలు తిరిగేసరికి.. రాత్రికి రాత్రి మెజార్టీ వచ్చేయటం.. తెల్లారేసరికి ప్రమాణస్వీకారం చేసేయటం లాంటివి చూస్తే.. ప్రజాస్వామ్య భారతంలో పవర్ చేతిలో ఉండాలే కానీ.. ఏమైనా చేయొచ్చన్న మాట మరోసారి నిజమనిపించక మానదు.

పార్లమెంటు తలుపులు మూసి రాష్ట్ర విభజన చేయటం.. పార్లమెంటులో ప్రధానమంత్రి స్వయంగా ఇచ్చిన హామీని ఆ తర్వాత ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన పెద్ద మనిషి లైట్ తీసుకోవటం.. కర్ణాటకలో బలం లేకున్నా.. చీలికతో పవర్ లోకి రావటం.. ఇలా చెప్పుకుంటూ పోతే పవర్ కోసం దేనికైనా రెఢీ అన్నట్లుగా వ్యవహరించే మోడీషాలను అపర చాణుక్యులుగా కీర్తిద్దామా?

ఇప్పుడు జరిగిన సీన్ కు కొన్ని మార్పులు చేద్దాం. కేంద్రం బీజేపీయేతర ప్రభుత్వం ఉంది. అలాంటివేళ.. మోడీషాలు ఇలా చేయగలరా? అలా చేస్తానంటే రాష్ట్ర గవర్నర్ ఒప్పుకుంటారా? అంటే.. ఇక్కడ ఎత్తుల కంటే కూడా అధికారం కోసం చేతిలో ఉన్న పవర్ ను ప్రయోగించటమే తప్పించి.. విలువలు.. మట్టి.. మశానం లాంటివేమీ లేవన్న మర్చిపోకూడదు.

ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే మద్దతు ఇచ్చే ఎమ్మెల్యేల లేఖలు ఉండాలి. పరేడ్ లాంటివి పక్కన పెట్టినా.. బహిరంగంగా చెప్పి చేయాల్సింది పోయి.. అర్థరాత్రి వేళ అనుకోవటం.. పొద్దున్నే ముఖ్యమంత్రి పదవిని ఒకరు.. డిప్యూటీ సీఎం పదవిని మరొకరు పంచేసుకున్నట్లుగా గవర్నర్ ఎదుట ప్రమాణస్వీకారం చేసేస్తే సరిపోతుందా? అలా ప్రమాణస్వీకారం అయ్యిందో లేదో.. ఇలా ప్రధాని స్థానంలో ఉన్న మోడీ మాష్టారు అభినందనలు తెలుపుతూ ట్వీట్లు చేశారు. ఇదంతా చూసినప్పుడు.. ఈ పరిణామాల్ని దిగజారుడు రాజకీయాల్లో మరో దారుణ పరిణామంగా అభివర్ణించాలే తప్పించి.. అపర చాణుక్యమంటూ పొగిడేయటమా?