Begin typing your search above and press return to search.

నాటో అంటే ఏమిటి? ఎందుకు ఏర్పడింది?

By:  Tupaki Desk   |   27 Feb 2022 9:33 AM GMT
నాటో అంటే ఏమిటి? ఎందుకు ఏర్పడింది?
X
ఉక్రెయిన్ పై రష్యా భీకర యుద్ధం వేళ నాటో అప్రమత్తమైంది. ఆ సరిహద్దుల్లో నాటో బలగాలను మోహరించింది. అయితే నాటో కూటమి ఉక్రెయిన్ కు సహాయం చేయబోదని పాశ్చాత్య కూటమి దేశాలు చెబుతున్నాయి. ఈ యుద్ధంలో తాము జోక్యం చేసుకుంటే సమస్య మరింత ఉద్ధృతం గా మారే అవకాశం ఉందని విశ్లేషకులు అంటున్నారు.

అయితే ఈ నాటో అంటే ఏమిటి? ఇది ఎందుకు ఏర్పడింది? రష్యా దాడులపై ఎందుకు మౌనంగా ఉంటుందో తెలుసుకుందామా?

రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్(నాటో) ఏర్పడింది. అమెరికా, ఫ్రాన్స్, కెనడా, బ్రిటన్ దేశాలతో పాటు మరో 12 ఇందులో చేరాయి. ఈ దేశాలన్నీ కలిసి ఓ కూటమిగా ఏర్పడ్డాయి. ఇందులో ఏ దేశంపై నైనా సాయుధ దాడి జరిగితే... మిత్ర దేశాలు సాయం చేయలనేది దీని ఉద్దేశం. సెకండ్ వరల్డ్ వార్ తర్వాత సోవియట్ విస్తరణకు చెక్ పెట్టేందుకే దీనిని ఏర్పాటు చేశారు.

ఇందులో ఇప్పుడు 30 సభ్య దేశాలు ఉన్నాయి. అయితే దీనికి పోటీగా సోవియట్ యూనియన్ కూడా ఓ కూటమిగా ఏర్పడింది. తూర్పు కమ్యూనిస్ట్ దేశాలతో కలిసి 1955లో సైనిక కూటమిగా ఏర్పడింది. దీని పేరు వార్సా ఒప్పందం. సోవియట్ యూనియన్ 1991 తర్వాత క్రమంగా పతనం అవుతూ వస్తోంది. ఆ సమయంలో చాలా దేశాలు వార్సా ఒప్పందం నుంచి తొలగిపోయాయి.

ఉక్రెయిన్ నాటోలో చేరేందుకు ఎప్పటినుంచో ప్రయత్నిస్తోంది. అందుకు రష్యా ససేమిరా అంటోంది. రష్యాలో ఉక్రెయిన్ భాగమని... అది నాటో కూటమిలో చేరడాన్ని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ వ్యతిరేకిస్తూ వస్తున్నారు. ఎప్పటికీ పాశ్చాత్య కూటమిలో ఉక్రెయిన్ చేరకూడదంటూ నొక్కి చెప్పింది. అయితే ఇప్పుడు ఉక్రెయిన్ యుద్ధంలో నాటో ఎందుకు సాయం చేయడం లేదనేది హాట్ టాపిక్ గా మారింది.

ఆ దేశం పాశ్చాత్య కూటమిలో భాగం కాదు. కాబట్టి ఈ యుద్ధంలో సాయం చేయాల్సిన కచ్చితమైన నిబంధన ఏమీ లేదు. అంతే కాకుండా నాటో దళాలు ఈ యుద్ధంలో చోటు చేసుకుంటే పరిస్థితులు మరింత భయంకరంగా మారే అవకాశం ఉంది.

ఉక్రెయిన్ విషయంలో పాశ్చాత్య కూటమి జోక్యం చేసుకుంటే... అందుకు తగిన రియాక్షన్ ఉంటుందని రష్యా అధ్యక్షుడు పుతిన్ ఇప్పటికే హెచ్చరించారు. సమస్య జటిలమైతే అణ్వాయుధాల దాకా వెళ్తుందని అన్నారు. చరిత్రలో ఎన్నడూ చూడని విధంగా భీకర పరిస్థితులు నెలకొంటాయని బెదిరించారు. కాబట్టి నాటో కాస్త సైలెంట్ గా ఉంటోంది. అయితే ఈ యుద్ధంపై నాటో సెక్రటరీ జనరల్ స్పందించారు. ఇది క్రూరమైన యుద్ధ చర్య అంటూ జెన్స్ స్టోలెన్ బర్గ్ అభివర్ణించారు.

అయితే యుద్ధం వేళ తూర్పు యూరప్ దేశాలు ఆందోళన చెందుతున్న వేళ నాటో అప్రమత్తమైంది. ఇప్పటికే వందలాది మంది బలగాలు మోహరించారు. ఉత్తరాన బాల్టిక్ రిపబ్లిక్ నుంచి దక్షిణాన రొమేనియా వరకు బలగాలు విస్తరించి ఉన్నాయి.

అంతేకాకుండా ఎప్పటికప్పుడు పెట్రోలింగ్ చేసేందుకు నౌకా దళాలు, ఎయిర్ పోలీసింగ్ వ్యవస్థ రంగంలోకి దిగింది. పరిస్థితి విషమిస్తే మరో 40 వేల మంది అదనపు బలగాలను మోహరించే అవకాశం కూడా ఉందని నాటో తెలిపింది.

మరోవైపు నాటో తూర్పు సరిహద్దులను పటిష్టం చేయడానికి అమెరికా కూడా అప్రమత్తమైంది. సుమారు మూడు వేల మందిని మోహరించింది. మరో 8,500 సైనికులను అలర్ట్ చేసింది. అంతేకాకుండా యాంటీ ట్యాంక్ క్షిపణులు, స్టింగర్ యాంటీ ఎయిర్ క్రాఫ్ట్ క్షిపణులతో ఆయుధాలను సిద్ధం చేసింది.

రూ.200 మిలియన్ డాలర్ల ఆయుధాలను పంపింది. దక్షిణ యూరఫ్ కు అదనపు ఆర్ఏఎఫ్ జెట్ లను పంపింది. అంతేకాకుండా సంక్షోభం తీవ్రమైతే రంగంలోకి దిగేందుకు బలగాలను సిద్ధం చేసింది. అయితే ఇదంతా కూడా నాటో భూభాగాన్ని రక్షించుకోవడానికి మాత్రమేనని అమెరికా స్పష్టం చేసింది. ఉక్రెయిన్ యుద్ధంలో పాల్గొనడానికి కాదని క్లారిటీ ఇచ్చింది.