Begin typing your search above and press return to search.

సీఎస్, డీజీపీకి 5 గంటల వరకు టైం ఇచ్చిన నిమ్మగడ్డ!?

By:  Tupaki Desk   |   23 Jan 2021 11:10 AM GMT
సీఎస్, డీజీపీకి 5 గంటల వరకు టైం ఇచ్చిన నిమ్మగడ్డ!?
X
ఏపీలోని జగన్ సర్కార్ తో కయ్యానికి కాలుదువ్వుతున్న ఏపీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ఏకంగా ప్రభుత్వం వద్దంటున్నా ఏపీలో పంచాయితీ ఎన్నికలకు నోటిఫికేషన్ జారీ చేసేశారు. జగన్ సర్కార్ దీనిపై సుప్రీంకోర్టుకు వెళ్లినా కూడా ఆగకుండా ప్రకటించేశారు. ఈ క్రమంలోనే ఏపీలో నిమ్మగడ్డకు గట్టి షాక్ తగిలింది.ఎన్నికల నిర్వహణలో ప్రధాన పాత్రధారులైన ఏపీలోని అధికారులు సహాయ నిరాకరణ చేసి ఎస్ఈసీ నిమ్మగడ్డకు గట్టి షాక్ ఇచ్చారు. వైసీపీ సర్కార్ కు మద్దతుగా నిమ్మగడ్డ పిలిచినా వెళ్లకుండా తిరుగుబావుటా ఎగురవేశారు.

ఈ ఉదయం పంచాయితీ ఎన్నికల తొలి విడత నోటిఫికేషన్ విడుదల చేసిన తర్వాత మధ్యాహ్నం ఏర్పాట్లపై చర్చించేందుకు రావాలని సీఎస్, డీజీపీ , పంచాయితీరాజ్ అధికారులకు నిమ్మగడ్డ సమాచారం పంపారు. అయితే ఈ వీడియో కాన్ఫరెన్స్ కు వారు హాజరు కాలేదు. ఈ కాన్ఫరెన్స్ ను వాయిదా వేయాలని సీఎస్ ఆదిత్యనాథ్ దాస్ అంతకుముందు నిమ్మగడ్డను కోరారు. అయితే దీన్ని నిమ్మగడ్డ తిరస్కరించారు. తప్పనిసరిగా వీడియో కాన్ఫరెన్స్ కు రావాలని కోరారు.

అయితే కాన్ఫరెన్స్ వాయిదా వేయాలని కోరినా నిమ్మగడ్డ పట్టించుకోకుండా రావాలని కోరడంతో సీఎస్ ఆదిత్యనాథ్ దాస్, డీజీపీ గౌతం సవాంగ్, పంచాయితీరాజ్ అధికారులు ఈ సమావేశానికి గైర్హాజరయ్యారు.దీంతో సాయంత్రం 5 గంటల వరకు సీఎస్, డీజీపీకి ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ టైం ఇచ్చారు. అప్పటివరకు సమీక్షకు హాజరుకాకపోతే గవర్నర్ ను కలుస్తామని.. అవసరమైతే కోర్టుకు వెళ్లడానికి రెడీ అయినట్టు తెలిసింది.

అయితే సోమవారం సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వ పిటీషన్ విచారణకు వస్తున్నందున అప్పటివరకు ఎన్నికలకు సహకరించరాదని.. జగన్ సర్కార్ కు మద్దతుగా నిలవాలని అధికారులు నిర్ణయించుకున్నట్లు సమాచారం. దీంతో ఈరోజు రేపు ఎస్ఈసీ నిమ్మగడ్డ ఆదేశాలను అధికారులు అమలు చేసే అవకాశాలు కనిపించడం లేదని తెలుస్తోంది.