Begin typing your search above and press return to search.

ఏమిటీ నిపా వైర‌స్..దాని హిస్ట‌రీ ఏంటి?

By:  Tupaki Desk   |   22 May 2018 4:20 AM GMT
ఏమిటీ నిపా వైర‌స్..దాని హిస్ట‌రీ ఏంటి?
X
కొత్త వైర‌స్ మాట ఇప్పుడు ద‌క్షిణాదిని వ‌ణికిస్తోంది. అంతుచిక్క‌ని రీతిలో ఈ వైర‌స్ బారిన ప‌డి కేర‌ళ‌లో ప‌ది మంది ఇప్ప‌టికే మృత్యువాత ప‌డ్డారు. మ‌రో 12 మంది ప‌రిస్థితి విష‌మంగా మారింది. మృతుల్లో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఉండ‌గా.. ఇదే కుటుంబానికి చెందిన మ‌రో న‌లుగురి ప‌రిస్థితి విషమంగా ఉండి.. ఐసీయులో చికిత్స పొందుతున్నారు.

అంతుచిక్క‌ని వైర‌స్ గా పేరున్న నిపా చ‌రిత్ర ఏమిటి? దీని బారిన ప‌డినోళ్లు ఎలాంటి ప‌రిస్థితుల్ని ఎదుర్కొంటార‌న్న విష‌యాల్ని చూస్తే.. ఈ వైర‌స్ ను తొలిసారి 1998లో గుర్తించారు. మ‌లేషియాలో క‌నుగొన్న ఈ వైర‌స్ అప్ప‌ట్లో 105 మంది మృతి చెందారు. అనంత‌రం ఈ వైర‌స్ సింగ‌పూర్ లో బ‌య‌ట‌ప‌డింది. పందుల్ని పెంచే ప‌శు పోష‌కులు ఈ వైర‌స్ బారిన ప‌డి చ‌నిపోయారు. మ‌లేషియాలోని నిపా ప్రాంతానికి చెందిన వారు దీని బారిన తొలిసారి ప‌డ‌టంతో దీనికి నిపా వైర‌స్ అన్న పేరు వ‌చ్చింది.

2004లో బంగ్లాదేశ్ లో ఈ వైర‌స్ ప్ర‌బ‌లింది. అక్క‌డ కూడా కొన్ని మ‌ర‌ణాలు చోటు చేసుకున్నాయి. మ‌న దేశంలో తొలిసారి ఈ వైర‌స్ ను ప‌శ్చిమ‌బెంగాల్ లో గుర్తించారు. ఈ వైర‌స్ బారిన ప‌డిన వ్య‌క్తులు 5 నుంచి 14 రోజుల్లో వ్యాధి ల‌క్ష‌ణాలు బ‌య‌ట‌ప‌డ‌తాయి. జ్వ‌రం.. త‌ల‌నొప్పి.. మ‌గ‌త‌.. మానసిక సంతులిత త‌గ్గ‌టం.. శ్వాస‌కోశ ఇబ్బందులు.. ఎన్ సెఫ‌లైటిస్ లాంటి ల‌క్ష‌ణాలు క‌నిపిస్తాయి. తీవ్ర‌త ఎక్కువైతే 24 నుంచి 48 గంట‌ల్లో కోమాలోకి వెళ్లి మ‌ర‌ణించే అవ‌కాశం ఉంది.

ఈ వైర‌స్ కు వ్యాక్సిన్ లేదు. గ‌బ్బిలం.. పందులు.. కోతి.. పిల్లి లాంటి వాటి నుంచి ఈ వైర‌స్ సంక్ర‌మించే ప్ర‌మాదం ఉంది. తాజాగా ఈ వైర‌స్ ల‌క్ష‌ణాలు కేర‌ళ‌లో గుర్తించారు. కొద్దిరోజులుగా ఆ రాష్ట్రానికి చెందిన కొంద‌రికి జ్వ‌రం.. త‌ల‌నొప్పి.. శ్వాస సంబంధ‌మైన స‌మ‌స్య‌ల‌తో ఆసుప‌త్రుల‌కు వ‌చ్చారు.

వారి నుంచి సేక‌రించిన బ్ల‌డ్ శాంపిల్స్ ను పుణేలోని ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాల‌జీకి పంపారు. అక్క‌డ జ‌రిపిన ప‌రీక్ష‌ల్లో వైపా వైర‌స్ బారిన ప‌డిన‌ట్లు గుర్తించారు. ఈ ప్రాణాంత‌క వైర‌స్ కు త‌గిన మందులు లేవు. ఈ వైర‌స్ కున్న మ‌రో ల‌క్ష‌ణం.. ఇది మెరుపు వేగంతో వ్యాప్తి చెందే ల‌క్ష‌ణం ఉంది. దీంతో.. కేర‌ళ‌కు ఒక ప్ర‌త్యేక బృందాన్ని పంపనున్న‌ట్లు కేంద్ర ఆరోగ్య శాఖామంత్రి జేపీ న‌డ్డా వెల్ల‌డించారు. కేర‌ళ‌లో వెలుగు చూసిన వైపా వైర‌స్ తో ద‌క్షిణాది రాష్ట్రాలు అలెర్ట్ అయ్యాయి. కేర‌ళ‌కు చుట్టుప‌క్క‌ల ఉన్న క‌ర్ణాట‌క‌.. కేర‌ళ‌.. తెలంగాణ‌.. ఆంధ్ర‌ప్ర‌దేశ్ ల్ని అలెర్ట్ చేశారు.