Begin typing your search above and press return to search.

క్వారంటైన్ అంటే ఏమిటి? దాన‌ర్థమేమిటి?

By:  Tupaki Desk   |   10 April 2020 2:30 AM GMT
క్వారంటైన్ అంటే ఏమిటి? దాన‌ర్థమేమిటి?
X
ప్ర‌స్తుతం క‌రోనా వైర‌స్ వ్యాప్తి నేప‌థ్యంలో కొత్త కొత్త ప‌దాలు.. కొత్త వైద్య సేవ‌లు, ప‌రిక‌రాలు అందుబాటులోకి వ‌స్తున్నాయి. ఈ క్ర‌మంలో త‌ర‌చుగా వినిపిస్తున్న మాట క్వారంటైన్‌. అంటే క‌రోనా సోకిన వారితో పాటు ఆ వైర‌స్ ల‌క్ష‌ణాలు ఉన్న‌వారిని ప్ర‌త్యేక గ‌దిలో ఉంచుతారు. ఆ వ్య‌క్తి బ‌య‌ట‌కు రాకుండా చ‌ర్య‌లు తీసుకుంటారు. ఇత‌రులతో క‌ల‌వ‌కుండా.. బ‌య‌ట తిర‌గ‌కుండా నిర్బంధించి ఉండ‌డాన్ని క్వారంటైన్ అంటారు. కరోనా వైరస్‌ బారిన పడకుండా ప్రజలను రక్షించడానికి నేడు పాటిస్తున్న విధానం ‘క్వారంటైన్‌’. అయితే ఈ పదం అర్థం ఏమిటి? ఎవ‌రు క‌నిపెట్టారు? ఎప్ప‌టి నుంచి పాటిస్తున్నారు అనే ఆస‌క్తి ఏర్ప‌డింది.

అయితే క్వారంటైన్ అనే ప‌దం ఇటాలియన్‌ పదం క్వారంటీనా జియోర్ని నుంచి వచ్చింది. ఆ ప‌దం అర్థం 40 రోజులు అని. 40 రోజులపాటు ఇంట్లోనే నిర్బంధంగా ఉండ‌డ‌మ‌ని అర్థం. వైర‌స్ లేదా వ్యాధి సోకిన వారిని ఇంటికే పరిమితం చేస్తే అంటు ఇత‌రులు వాటి బారిన పడకుండా రక్షించ వచ్చని అర్థం.

యూరప్, ఆసియా దేశాలను 14వ శ‌తాబ్దంలో ప్లేగు వ్యాధి కుదిపేసిన సంద‌ర్భంలో క్వారంటైన్‌ అనే పదం వినిపించింది. అప్పట్లో 40 రోజుల్లో ఏ రోగమైనా తగ్గుతుందనే భావ‌న ప్ర‌జ‌ల‌కు ఉండేది. ఇళ్లు కదలకుండా 40 రోజుల పాటు స్వీయ నిర్బంధంలో ఉంటే రోగం బారిన పడకుండా తప్పించుకోవచ్చనే అభిప్రాయం వచ్చింది. అయితే ఆ 40 రోజులు నిర్బంధం ఎలా వ‌చ్చింద‌నే విష‌యంలో కూడా ఓ క‌థ‌నం ఉంది.

జుడాయియన్‌ ఎడారిలో దెయ్యానికి వ్యతిరేకంగా జీసస్‌ 40 రోజుల పాటు యుద్ధం చేశారు. దెయ్యం లాంటి అంటు రోగాలు మటుమాయం కావాలంటే 40 రోజులు అవసరమని భావించి ఉండవచ్చు. గ్రీకు తత్వవేత్త పైథాగరస్‌ కు నాలుగు అంకే ఇష్టం కావ‌డంతో నాలుగు నుంచి 40 రోజుల పదం వ‌చ్చింద‌ని క‌థ‌నాలు ఉన్నాయి. ఎందుకంటే చలికాలం 40 రోజుల పాటు ఉండేది. అప్పుడే సముద్ర తీరాల్లో అంటురోగాలు విస్తరిస్తాయనే భావ‌న‌తో 40 రోజుల పాటు ఇంటి ప‌ట్టునే ఉండాల‌నే నిబంధ‌న‌లు విధించుకునే వారు. ఆ క్ర‌మంలోనే ఈ 40 రోజులు స్వీయ నిర్బంధంలో ఉండ‌డం అమ‌ల్లోకి వ‌చ్చింది. ఈ 40 రోజులు నిర్బంధం ఉన్న దాన్నే క్వారంటైన్ అని అన‌డం మొద‌లుపెట్టారు.