Begin typing your search above and press return to search.

కేటీఆర్ శంకుస్థాపన చేసిన గూగుల్ ఆఫీసులో స్పెషల్ ఏమంటే?

By:  Tupaki Desk   |   29 April 2022 5:06 AM GMT
కేటీఆర్ శంకుస్థాపన చేసిన గూగుల్ ఆఫీసులో స్పెషల్ ఏమంటే?
X
ఆ రంగం.. ఈ రంగం అన్న తేడా లేకుండా అవకాశం ఉన్న ప్రతి రంగంలోనూ హైదరాబాద్ మహానగరం దూసుకెళుతోంది. ఇప్పటికే దేశ ఐటీ ఇండస్ట్రీలో భాగ్యనగరికి ఉన్న ప్రత్యేక గుర్తింపు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

స్థిరమైన రాజకీయ వాతావరణంతో పాటు.. ఇతర సానుకూల అంశాలు హైదరాబాద్ కు కలిసి వచ్చేలా చేస్తున్నాయి. ఏపీలో ఐటీ ఇండస్ట్రీని డెవలప్ చేయటం కోసం ప్రయత్నాలు మొదలైనా.. మధ్యలోనే ఆగిపోవటం.. భౌగోళికంగా ఉన్న ప్లస్ పాయింట్లు హైదరాబాద్ కు వరంగా మారాయి.

ఉన్న అవకాశాన్ని తమకు అనుకూలంగా మార్చుకోవటంలో ముందుండే కేసీఆర్ ప్రభుత్వం.. హైదరాబాద్ మరింత విస్తరించే ఏర్పాట్లను వడివడిగా చేస్తున్నారు. దీనికి తగ్గట్లే పలు కంపెనీలు స్పందిస్తున్నాయి. హైదరాబాద్ లో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తిని ప్రదర్శిస్తున్నారు. తాజాగా దిగ్గజ సెర్చింజన్ గూగుల్ సంస్థ.. ప్రపంచంలో అతి పెద్ద రెండో ఆఫీసును హైదరాబాద్ లో ఏర్పాటు చేసేందుకు కీలక అడుగు ముందుకు వేసింది.

గచ్చిబౌలిలో గూగుల్ సంస్థ 7.3 ఎకరాల విస్తీర్ణంలో ప్రపంచంలోనే రెండో అతి పెద్ద కార్యాలయాన్ని ఏర్పాటు చేసేందుకు వీలుగా శంకుస్థాపన కార్యక్రమాన్ని మొదలుపెట్టింది. మొత్తం 30.3 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించే ఈ ఆఫీసు ప్రాంగణ నిర్మాణాన్ని కేవలం ఏడాది వ్యవధిలోనే పూర్తి చేస్తారని చెబుతున్నారు. దీనికి సంబంధించిన భవన నమూనాను విడుదల చేశారు.

చూసినంతనే వావ్ అనే డిజైన్ లో ఉన్న ఈ కార్యాలయం హైదరాబాద్ మహానగర మణిహారంలో ఒక హారంగా మారుతుందని చెప్పక తప్పదు. ఈ కార్యాలయంలో డిజిటల్ ఆర్థిక వ్యవస్థతో సహా పలు అంశాల్లో శిక్షణ ఇచ్చేందుకు.. వారిని ఉద్యోగాలకు సిద్ధం చేసేందుకు వీలుగా తెలంగాణ ప్రభుత్వంతో గూగుల్ ఒప్పందాన్ని కుదుర్చుకుంది.

ఈ భవన నిర్మాణం పూర్తి అయిన తర్వాత ప్రపంచంలో అత్యధిక ఉద్యోగులు పని చేసే కేంద్రాల్లో హైదరాబాద్ కేంద్రం ఒకటిగా మారుతుందని చెబుతున్నారు. అమెరికాలోని మౌంటెన్ వ్యూ తర్వాత గూగుల్ నిర్మిస్తున్న అతి పెద్ద ఆఫీసు స్పేస్ ఇదేనని చెబుతున్నారు.