Begin typing your search above and press return to search.

వ్యాక్సిన్ తర్వాత.. ఏమిటీ బూస్టర్ డోస్?

By:  Tupaki Desk   |   4 April 2021 3:30 AM GMT
వ్యాక్సిన్ తర్వాత.. ఏమిటీ బూస్టర్ డోస్?
X
దేశంలో కరోనా కేసులు అంతకంతకూ పెరిగిపోతున్న వేళ.. వ్యాక్సిన్ వేయించుకునే వారిలో ఎక్కువ మంది టీకాలు వేయించుకోవాలన్న ఆలోచనలో ఉన్నారు. అయితే.. అనుకున్నంతగా వ్యాక్సిన్ పై స్పందన రాని పరిస్థితి. ప్రస్తుతం దేశంలో కోవాగ్జిన్.. కోవీషీల్డ్ రెండు టీకాలు అందుబాటులో ఉన్నాయి. ఈ రెండు వ్యాక్సిన్లు.. రెండు డోసుల్లో వేస్తారు. నెల వ్యవధిలో మొదటి డోస్ తర్వాత.. రెండో డోస్ నువేస్తారు.

ఇదిలా ఉంటే.. తాజాగా.. కోవాగ్జిన్ వ్యాక్సిన్ వేసుకన్న వారు.. ఆర్నెల్ల తర్వాత బూస్టర్ వ్యాక్సిన్ వేసుకునేందుకు వీలుగా భారత్ బయోటెక్ ప్రయోగాల్ని చేపట్టింది. దీనికి భారత ఔషధ నియంత్రణ మండలి అనుమతి ఇచ్చింది. దీని ప్రకారం కోవాగ్జిన్ పై నిర్వహించిన క్లినికల్ టెస్టుల్లో పాల్గొని.. రెండో డోస్ తీసుకున్న వలంటీర్లకు.. బూస్టర్ డోసులు ఇచ్చి.. పరీక్షలు జురుపుతారు. వాటి ఫలితాల్ని విశ్లేషిస్తారు.

తాజాగా అనుకుంటున్న మూడోడోసు (బూస్టర్ డోస్) వల్ల మేలు జరుగుతుందని.. కరోనా నుంచి ఎంత రక్షణ ఉంటుందనే విషయాన్ని మదింపు చేస్తారు. కోవాగ్జిన్ టీకా రక్షణ ఎంతకాలం ఉంటుందన్న సందేహాలు వ్యక్తమవుతున్న వేళ.. తాజాగా ఈ బూస్టర్ డోస్ మీద ప్రయోగాల్ని షురూ చేశారు. దీనికి కారణం లేకపోలేదు. కరోనా వైరస్.. రోజురోజుకు మార్పులు చేర్పులకు లోను కావటం.. తీవ్రంగా మారుతున్న నేపథ్యంలో.. దానికి చెక్ పెట్టేందుకు వీలుగా తాజా బూస్టర్ డోసులు ఇచ్చే అంశం మీద ఫోకస్ పెట్టనున్నట్లు చెబుతున్నారు. దీనికి సంబంధించిన ఫలితాలు ఆర్నెల్లలో వస్తాయని చెబుతున్నారు. మరేం జరుగుతుందో చూడాలి.