Begin typing your search above and press return to search.

ఎన్ ఆర్ సీ.. ఎన్ పీ ఆర్ మధ్య తేడా ఏంటి?

By:  Tupaki Desk   |   25 Dec 2019 4:47 AM GMT
ఎన్ ఆర్ సీ.. ఎన్ పీ ఆర్ మధ్య తేడా ఏంటి?
X
పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) మీద లొల్లి జరుగుతున్న వేళలోనే ఎన్ ఆర్ సీ పేరు పెద్ద ఎత్తున వినిపించటమే కాదు.. దీనిపై నిరసనలు తీవ్రంగా సాగుతున్నాయి. చాలామంది దీన్ని వ్యతిరేకిస్తున్నారు. ఇంతకూ ఎన్ ఆర్ సీ అంటే ఏమిటి? అన్నది ఒక క్వశ్చన్ గా మారింది పలువురి లో. ఇదిలా ఉండగానే తాజాగా ఎన్ పీఆర్ తెర మీదకు వచ్చింది.

తాజాగా ముగిసిన కేంద్ర కాబినెట్ సమావేశంలో ఎన్ పీఆర్ కోసం భారీగా నిధులు కేటాయించటమే కాదు.. 2020లో ఈ కార్యక్రమాన్ని చేపట్టాల్సింది గా నిర్ణయం తీసుకున్నారు. ఇంతకీ ఎన్ ఆర్ సీ ఏమిటి? ఎన్ పీఆర్ అంటే ఏమిటి? ఈ రెండింటిని ఎలా చేస్తారు? ఈ రెండు అంశాల మీద ఉన్న అపొహల్లో నిజం ఎంత? అన్న వివరాల్లోకి వెళితే..

ఇటీవల కాలంలో రచ్చ రచ్చ గా మారిన ఎన్ ఆర్ సీ గురించి మొదట మాట్లాడుకుంటే.. చట్టబద్ధమైన దేశ ప్రజల జాబితాగా చెప్పాలి. దీన్ని 1955 నాటి పౌరసత్వ చట్టం ఆధారంగా రూపొందించారు. ఈ చట్టం ప్రకారం దేశ ప్రజలు అన్న పదానికి నిర్వచనం ఏమిటంటే 1950 జనవరి 26 తర్వాత 1987 జులై 1కి ముందు దేశంలో జన్మించిన వారు అన్నది ఒకటైతే.. 1987 జులై 1 నుంచి 2003 పౌరసత్వ సవరణ నిబంధనల కు ముందు పుట్టిన వారిగా చెప్పాలి.

ఇందులో పుట్టిన పిల్లల తల్లిదండ్రుల్లో ఒకరు తప్పని సరిగా భారతీయులు అయి ఉండాలి. రెండో వారు చట్టవిరుద్ధంగా వలస వచ్చిన వారై ఉండకూడదు. ఎన్ ఆర్ సీలో ప్రభుత్వాలు జారీ చేసిన పత్రాల్ని చూపించటమే కాదు.. దేశంలోకి అక్రమంగా రాలేదని నిరూపించుకోవాల్సి ఉంటుంది. దీన్లో అంత రచ్చ ఏముంది? అనిపించొచ్చు. భారత్ లాంటి విశాలమైన దేశంలో చదువుకున్న వారికి ఎలాంటి ఇబ్బంది లేదు.

చదువు లేని వారు.. గ్రామీణ ప్రాంతాల కు చెందిన వారు.. మరి ముఖ్యంగా సరిహద్దు ప్రాంతాల్లో ఉన్న వారికి అసలు ఇబ్బందంతా. ఎందుకంటే.. ఈ దేశంలో ఏళ్లకు ఏళ్లుగా ఉండి.. ఇవాల్టి రోజున మేం భారతీయులం.. అక్రమంగా వలస వచ్చిన వాళ్లం కాదని చెప్పుకోవటం.. నిరూపించు కోవటం కష్ట సాధ్యమైన పని. అన్నింటికి మించి అనుమానం గా చూస్తున్న వారి సందేహాల్ని తీర్చటం కష్టమైనదన్నది మరో వాదన.

ఇలా సేకరించిన సమాచారానికి సంబంధించి ముసాయిదా ను తయారు చేస్తారు. వారి అభ్యంతరాల్ని ప్రచురిస్తారు. సందేహాస్పద పౌరసత్వం గురించిన వ్యాఖ్యలను రిజిస్ట్రార్ రాసి విడిగా ఒక జాబితా చేస్తారు. అభ్యంతరాల్ని స్థానిక రిజిస్ట్రార్ లు ఆలకించి.. తుది జాబితాల ను జిల్లా రిజిస్టార్ కు సమర్పిస్తారు. జిల్లా రిజిస్ట్రార్ లు తమ జాబితాలను రాష్ట్ర స్థాయి కి పంపితే వాటితో ఎన్ పీఆర్ రూపకల్పన చేస్తారు.

ఇంతకీ ఎన్ పీఆర్ ఏమిటి? అన్న సందేహం కలుగుతుంది. సింపుల్ గా చెప్పాలంటే..జాతీయ జనాభా పట్టిక. ప్రతి పదేళ్లకు ఒకసారి జనాభా లెక్కల్ని తయారు చేస్తారు కదా? దాన్నే ఎన్ పీఆర్ గా చెప్పాలి. 1955 నాటి పౌరసత్వ చట్టం ఆధారంగా దీన్ని చేపడతారు. స్థానికం గా నివసించే వారి డేటా బేస్ తయారు చేయటం దీని లక్ష్యం. ఒక ఊరిలో ఆర్నెల్లు గా కానీ అంతకు మించి కానీ ఉంటున్న వారి వ్యక్తుల డేటాను సేకరిస్తారు.

ఈ డేటాలో భాగంగా పేరు.. తల్లిదండ్రుల పేర్లు.. పుట్టిన తేదీ.. అందరి వయసులతో పాటు.. జాతీయత.. స్త్రీ.. పురుష వివరాల తో పాటు విద్యా.. ఉద్యోగ సంబంధ వివరాలు.. చిరునామాలు తదితర సాధారణ వివరాలు తీసుకుంటారు. ఇవన్నీ ట్యాబ్ లలో నమోదు చేస్తారు. రెండు దశల్లో జరిగే ఈ కార్యక్రమంలో మొదటిది ఇంటింటి సర్వే దీన్ని వచ్చే ఏడాది ఏప్రిల్ - సెప్టెంబరు మధ్యలో ఉంటుంది. 30 లక్షల మంది దీని కోసం పని చేస్తారు. ఇంటింటి కి తిరిగి జనాభా పట్టికను తయారు చేస్తారు. రెండో దశలో సేకరించిన వివరాల్ని ఒక చోట కూరుస్తారు. దీన్ని 2021 ఫిబ్రవరి 9 నుంచి 28 వరకూ చేపడతారు.