Begin typing your search above and press return to search.

ఏపీ లో విద్యుత్ సమస్య తీర్చేందుకు ప్రభుత్వం ఏం చేస్తోందంటే..?

By:  Tupaki Desk   |   5 May 2022 6:29 AM GMT
ఏపీ లో విద్యుత్ సమస్య తీర్చేందుకు ప్రభుత్వం ఏం చేస్తోందంటే..?
X
గుడ్డి దీపం చదువులు.. అర్ధరాత్రి పంట పొలాల వద్ద కాపులు కాయడం.. పరిశ్రమలు మూతపడడం.. ఇలాంటి రోజులు మళ్లీ వస్తాయా..? అంటే ఏమో రావోచ్చు..? అనే సమాధానం ఇస్తున్నారు కొందరు నిపుణులు. వేసవికాలం వచ్చిందంటే చాలు.. ఒకటి తాగునీటి కొరత.. మరొకటి విద్యుత్ సమస్య.. ఇవి ప్రధానంగా ఉంటున్నాయి. విద్యుత్ కొరత ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ఉంది. అత్యవసరంగా విద్యుత్ ను అందించేందుకు బొగ్గును నిరాటంకంగా సరఫరా చేస్తున్నాయి.

అందుకోసం పలు రైళ్లను కూడా రద్దు చేస్తున్నారు. ఈ క్రమంలో ఏపీలో విద్యుత్ సమస్య మరింత తీవ్రంగా మారింది. ఇప్పటికే కరెంట్ కట్ సమస్యలతో ప్రజలు రోడ్లమీదకు వస్తున్నారు. భారీగా కోతలు పెట్టి తమను ఇబ్బందలు పెట్టొద్దని కోరుతున్నారు. అయితే ఈ సమయంలో ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటోంది..? విద్యుత్ కొరతను అధిగమించడానికి ఏం చేయబోతుంది..?

మే నెల వచ్చిందంటే ఏపీ ప్రజలకు కరెంట్ కష్టాలు మొదలవుతాయి. గతంలోనూ ఈ రాష్ట్ర ప్రజలు విద్యుత్ సమస్యను ఎదుర్కొన్నారు. అయితే అప్పులు చేసి మరి విద్యుత్ ను కొనుగోలు చేశారు. బహిరంగ మార్కెట్లో విద్యుత్ రేటు ఎంతుంటే అంత పెట్టి కొనుగోలు చేశారు. ఇప్పుడు కూడా అదే చేయాలని సీఎం జగన్ ఆదేశాలిచ్చారు. దీంతో అధికారులు అప్రమత్తయ్యారు. మరోవైపు విద్యుత్ ప్రాజెక్టులను త్వరగా పూర్తి చేయాలని ఆదేశిస్తున్నారు. ఎన్ని ఆటంకాలు ఏర్పడినా విద్యుత్ ప్రాజెక్టులు పూర్తయితే కొంత వరకు సమస్యను అధిగమించవచ్చు. లేకుంటే చీకట్లో మగ్గాల్సి వస్తోంది.

వేసవికాలంలో తాగునీటి అవసరాలు తీర్చడంతో పాటు ప్రజలకు విద్యుత్ సమస్య నుంచి వారిని గట్టెక్కించాల్సిన అవసరం ఉందని అంటున్నారు. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో విద్యుత్ అవసరం ఎక్కువగా ఉంది. ముఖ్యంగా పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్న విద్యార్థులను ఇబ్బందులు పెట్టొద్దని కోరుతున్నారు.

ఎందుకంటే గతంలో లాగా గుడ్డిదీపం కింద చదువుకునే పరిస్థితి లేదు. విద్యార్థులతో పాటు రైతులకు విద్యుత్ అవసరం బాగానే ఉంది. పంట పొలాలను రక్షించుకునేందుకు ఒకప్పుడు రాత్రిళ్లు పొలాల వద్ద కాపు కాసేవారు. కానీ ఇప్పుడు విద్యుత్ మోటార్లకు ఆటోమేటిక్ మిషన్ల ద్వారా నీరు పంపింగ్ చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో విద్యుత్ సరఫరా సక్రమంగా లేకపోతే పంటపొలాలు ఎండిపోయే ప్రమాదం ఉంది.

విద్యుత్ సమస్య ఏపీ రాష్ట్రానిది మాత్రమే కాదు. దేశం మొత్తం ఉంది. కానీ రాష్ట్ర ప్రజల అవసరాలు తీర్చాల్సిన బాధ్యత ముఖ్యమంత్రిపై ఉంది. బహరింగ మార్కెట్లో విద్యుత్ ను కొనుగోలు చేసైనా సరే.. ప్రజలకు విద్యుత్ సరఫరా చేయాలి. అందుకు ఎంత రేటు ఉన్న సరే కొనుగోలు చేయాలంటున్నారు. లేదంటే ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చే ప్రమాదం ఉంది. కరెంట్ చార్జీలు పెంచితే పెద్దగా పట్టించుకోరు కావచ్చు.. కానీ కరెంట్ లేకపోతే మాత్రం తీవ్ర ఇబ్బందులు పడుతారు. సామాన్య ప్రజలే కాకుండా పరిశ్రమల నిర్వాహకులు సైతం విద్యుత్ కొరతతో ఇబ్బందులు పడకుండా చూడాలని నిపుణులు పేర్కొంటున్నారు.