Begin typing your search above and press return to search.

మీరిద్దరూ మెగుడు పెళ్లాలని ఎలా చెబుతారు? తెలంగాణలో 'రౌడీ పోలీసింగ్'

By:  Tupaki Desk   |   3 May 2022 4:28 AM GMT
మీరిద్దరూ మెగుడు పెళ్లాలని ఎలా చెబుతారు? తెలంగాణలో రౌడీ పోలీసింగ్
X
ఇలాంటి సీన్లను సినిమాల్లో చూస్తుంటాం. నీతికి నిజాయితీకి నిలువెత్తు రూపంగా.. విధి నిర్వాహణను పక్కాగా నిర్వహించే పోలీసులు పలువురు ఉంటారు. డ్యూటీని డ్యూటీలా పూర్తి చేసి.. చూసి చూడనట్లుగా ఉండేటోళ్లు కనిపిస్తారు. వీటికి భిన్నంగా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ.. పోలీసులకు చెడ్డపేరు తెచ్చేలా వ్యవహరించే బ్యాడ్ పోలీసులకు కొదవ లేదు.

సినిమాల్లో కనిపించే ఈ తరహా బ్యాడ్ పోలీసులకు సంబంధించిన షాకింగ్ నిజం తాజాగా ట్వీట్ రూపంలో బయటకు వచ్చి సంచలనంగా మారింది. ఖమ్మం జిల్లా ముదిగొండ మండటానికి చెందిన దుర్గారావు.. అతని సతీమణి భవాని.. సోదరుడు వెంకటేశ్ లు హైదరాబాద్ నుంచి టూవీలర్ మీద కమలాపురానికి బయలుదేరారు.

అర్థరాత్రి 12.30 గంటల సమయంలో నేలకొండపల్లి వద్ద పెట్రోలింగ్ పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. టూవీలర్ మీద వెళుతున్న ఈ ముగ్గురిని పోలీసులు ఆపారు. వారి పట్ల అభ్యంతరకరంగా వ్యవహరించారు. మీరిద్దరు భార్యభర్తలేనని గ్యారెంటీ ఏమిటంటూ నోటికి వచ్చినట్లు మాట్లాడారు. ఇదంతా కూడా వారి దగ్గర ఉన్న ఆధార్ కార్డుల్ని చూసిన తర్వాతే జరగటం గమనార్హం.

అయితే.. పోలీసుల చేష్టల్ని వీడియో తీసే ప్రయత్నం చేయగా.. తమ నుంచి సెల్ ఫోన్ ను లాగేసుకున్నారంటూ బాధితులు ట్వీట్ రూపంలో తమకు ఎదురైన చేదు అనుభవాన్ని డీజీపీ మహేందర్ రెడ్డికి.. సీఎంతో కార్యాలయానికి.. మంత్రి కేటీఆర్ కు.. మానవ హక్కుల కమిషన్ కు ఫిర్యాదు చేశారు.

ఖమ్మం సీపీ విష్ణు ఎస్ వారియర్ కు లిఖిత పూర్వకంగా కంప్లైంట్ ఇచచారు. దీంతో స్పందించిన సీపీ.. ఖమ్మం అడిషనల్ డీసీపీ గౌస్ ఆలంకు ఈ కంప్లైంట్ వివరాలు ఇచ్చి.. విచారణ చేయాలని ఆదేశించారు.

మరి.. ఈ ఉదంతంపై పోలీసుల విచారణలో ఏం తేలుతుందో చూడాలి. ఫ్రెండ్లీ పోలీసింగ్ పేరుతో పెద్ద ఎత్తున సంస్కరణలు తెస్తున్నా.. కొందరు పోలీసు అధికారుల తీరుతో పోలీస్ శాఖకు చెడ్డపేరు వస్తోందని చెప్పాలి. ఈ తరహా తప్పులు చేసే వారిని కఠినంగా శిక్షించాలన్న మాట పలువురి నోట వినిపిస్తోంది.