Begin typing your search above and press return to search.

కెప్టెన్సీపై కోహ్లికి అలా.. రోహిత్ ఇలా.. బీసీసీఐ ఇదేం న్యాయం?

By:  Tupaki Desk   |   2 Jan 2023 6:27 AM GMT
కెప్టెన్సీపై కోహ్లికి అలా.. రోహిత్ ఇలా.. బీసీసీఐ ఇదేం న్యాయం?
X
సరిగ్గా ఏడాది కిందట దక్షిణాఫ్రికా పర్యటనకు ముందు టీమిండియా కెప్టెన్సీపై ముసలం.. బీసీసీఐ వర్సెస్ నాటి కెప్టెన్ విరాట్ కోహ్లి.. ఎవరూ తగ్గలే. పరిమిత ఓవర్ల ఫార్మాట్ లో టి20ల సారథ్యం వదిలేస్తానని.. వన్డే సారథిగా మాత్రం కొనసాగుతానని కోహ్లి పేర్కొనడం వివాదానికి దారితీసింది. అసలే అప్పట్లో బీసీసీఐ చైర్మన్ సౌరభ్ గంగూలీ. మొండి ఘటం. దీంతో కోహ్లి పరిమిత ఓవర్లలో రెండు ఫార్మాట్లకూ పగ్గాలు వదిలేశాడు. చివరకు దక్షిణాఫ్రికా సిరీస్ తో టెస్టు కెప్టెన్సీకీ గుడ్ బై చెప్పాడు. అంటే.. ఇక్కడ బీసీసీఐ ఉద్దేశంలో వన్డే, టి20 ఫార్మాట్లకు కెప్టెన్ గా ఒక్కరే ఉండాలి. కానీ, ఇప్పుడు దానికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నది. కోహ్లి, రోహిత్ అభిమానులు అనే కాక.. క్రికెట్ ప్రేమికులకూ ఇది రుచించడం లేదు. వైఫల్యాలున్నా రోహిత్ ను కొనసాగిస్తారా? నిరుటితో పోలిస్తే రోహిత్ శర్మ బ్యాటింగ్ లో దమ్ము లేదు. అతడి ఫిట్ నెస్ పైనా అనుమానాలున్నాయి. రోహిత్ క్రీజులో కదిలే తీరుతోనే ఇది స్పష్టమైపోతోంది. కెప్టెన్ గా నియమితుడైన ఏడాది కాలంలోనే టి20ల్లో అతడి బ్యాటింగ్ సామర్థ్యం పడిపోవడం గమనార్హం. అసలు 35 ఏళ్ల రోహిత్ టి20లకు పనికొస్తాడా? అనే సందేహం
కలుగుతోంది.

ఈ నేపథ్యంలో మంగళవారం నుంచి శ్రీలంకతో జరుగనున్న టి20 సిరీస్ కు ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యాను కెప్టెన్ చేశారు. వేలి గాయంతో రోహిత్, విశ్రాంతి కారణంగా కోహ్లి, కేఎల్ రాహుల్ వ్యక్తిగత కారణాలతో దూరమైనప్పటికీ అసలు ఈ ముగ్గురూ టి20లకు అనవసరం అనే వాదన మొదలైంది. ఈ నేపథ్యంలో జట్టు సభ్యుడిగానే అర్హత లేదని భావిస్తున్న రోహిత్‌ కెప్టెన్సీపై ఇటీవల కాలంలో బాగా చర్చ జరుగుతున్నది. అయితే బీసీసీఐ తాజా నిర్ణయం మాత్రం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. రోహిత్‌ టెస్టు, వన్డే కెప్టెన్సీకి ఇప్పుడొచ్చిన ముప్పేమీ లేదని బీసీసీఐ వర్గాల నుంచి అందిన సమాచారం. కార్యదర్శి జై షా ఆధ్వర్యంలో ఆదివారం జరిగిన బీసీసీఐ సమావేశానికి కెప్టెన్‌ రోహిత్‌, కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ హాజరయ్యారు. ఇప్పుడు దృష్టంతా ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌, 2023 ప్రపంచకప్‌పైనే ఉన్న నేపథ్యంలో కొత్త టీ20 కెప్టెన్‌ హార్దిక్‌.. సమావేశానికి హాజరు కాలేదు. లంకతో సిరీస్‌ కోసం అతడు ముంబయిలో ఉన్నాడు. "రోహిత్‌ శర్మ టెస్టులు, వన్డేల్లో భారత జట్టుకు సారథ్యం వహిస్తున్నాడు. ఈ రెండు ఫార్మాట్లలో కెప్టెన్‌గా అతడి భవిష్యత్తు గురించి సమావేశంలో ఎలాంటి చర్చ జరగలేదు. టెస్టులు, వన్డేల్లో అతడు నాయకత్వం ఎంత బాగుందో చూడండి" అని ఓ బీసీసీఐ అధికారి అన్నాడు.

కోహ్లికి లేని మినహాయింపు రోహిత్ కు ఎందుకు? టీమిండియాలో నంబర్ వన్ బ్యాట్స్ మన్ విరాట్ కోహ్లి. రోహిత్ కంటే అన్ని రకాలుగా మెరుగైన ఆటగాడు. అలాంటివాడు టి20 పగ్గాలు వదిలేసి వన్డే కెప్టెన్ గా కొనసాగుతానని కోరితే వద్దన్న బీసీసీఐ.. రోహిత్ శర్మకు మాత్రం అడగకుండానే మినహాయింపు ఇచ్చినట్లు కనిపిస్తోంది. ఇది న్యాయమేనా? అనే ప్రశ్న వస్తోంది. ఇక నిరుడు ఆటగాళ్ల రొటేషన్ విషయంలోనూ కోహ్లి మాట చెల్లలేదు. కెప్టెన్ గా అతడు చాలా చాలా కీలక నిర్ణయాలు తీసుకున్నాడు. బీసీసీఐకి కూడా కొన్ని సూచనలు చేశాడు. వీటిలో భాగంగానే వన్డే వరల్డ్ కప్ ఆడే ఆటగాళ్లు, ముఖ్యంగా పేసర్లు ఐపీఎల్‌లో గాయాలపాలు అవ్వకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అడిగాడు. వాళ్ల వర్క్‌లోడ్ మేనేజ్ చేయాలని, దీనిపై బీసీసీఐ కొంత ఫోకస్ పెట్టాలని సూచించాడు. అయితే అప్పట్లో ఉన్న సౌరవ్ గంగూలీ అండ్ కో ఈ మాటలను పెద్దగా పట్టించుకోలేదు. కోట్లు పెట్టి
కొనుగోలు చేసిన ఆటగాళ్లకు విశ్రాంతి ఇవ్వాలని ఫ్రాంచైజీలకు ఎలా చెప్తాం? అన్నట్లు కోహ్లీపై సీరియస్ అయ్యారు.

కానీ ఇప్పుడు బీసీసీఐ అదే నిర్ణయం తీసుకుంది. వరల్డ్ కప్ ఆడే ఆటగాళ్ల విషయంలో కొన్ని జాగ్రత్తలు తప్పవని తేల్చి చెప్పింది. వీవీఎస్ లక్ష్మణ్ నేతృత్వంలోని ఎన్సీయే బృందం ఈ ఆటగాళ్లను మానిటర్ చేయాలని, ఐపీఎల్‌లో కూడా సదరు ఆటగాళ్లు గాయాలపాలు అవకుండా వర్క్‌లోడ్ మేనేజ్ చేసేలా ఫ్రాంచైజీలతో మాట్లాడాలని తేల్చిచెప్పింది. వన్డే వరల్డ్ కప్ కోసం మొత్తం 20 మంది ఆటగాళ్లను ఎంపిక చేశామని, వాళ్లంతా ఐపీఎల్‌లో మరీ ఎక్కువ స్ట్రెస్ అవకుండా చూసుకోవాలని నిర్ణయించింది. ఇది విన్న అభిమానులు కోహ్లీ డిమాండ్‌ను గుర్తు చేస్తూ నెట్టింట రకరకాల కామెంట్లు చేస్తున్నారు. కోహ్లీ అడిగినప్పుడు ఛీ ఫో అన్న బీసీసీఐ.. ఇప్పుడు అదే పని చేస్తోందంటూ విమర్శిస్తున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.