Begin typing your search above and press return to search.

కేసీఆర్ హామీ ఏమైంది? ఐదు నెలల బిల్లు ఒకేసారి బాదేశారా?

By:  Tupaki Desk   |   26 May 2021 10:30 AM GMT
కేసీఆర్ హామీ ఏమైంది? ఐదు నెలల బిల్లు ఒకేసారి బాదేశారా?
X
గ్రేటర్ ఎన్నికల నేపథ్యంలో హైదరాబాద్ మహానగరంలో ఉచిత తాగునీరు ఇస్తామని.. నెలకు పదివేల లీటర్లు ఒక్కో ఇంటికి ఫ్రీగా ఇవ్వనున్నట్లుగా చెప్పటమే కాదు.. తమ హామీకి తగ్గట్లే హైదరాబాద్ మహానగరంలో ఈ ఉచిత పథకాన్ని అమలు చేస్తూ కేసీఆర్ సర్కారు నిర్ణయం తీసుకుంది. కట్ చేస్తే.. ఈ ఉచితాన్ని అమలు చేయటం కోసం.. అపార్ట్ మెంటు వాసులు.. తమ కనెక్షన్ ను ఆధార్ తో లింకు చేసుకోవాలని కోరటం తెలిసిందే. గడిచిన కొద్ది నెలలుగా బిల్లు వేయని జలమండలి అధికారులు.. తాజాగా ఐదు నెలల బిల్లును ఒకేసారి పంపిన వైనం వెలుగు చూసింది. ఇదిప్పుడు చర్చనీయాంశంగా మారింది.

నిబంధన ప్రకారం ఆధార్ తో అనుసంధానమైన ప్లాట్లకు మినహాయింపు లభించాలి. కానీ.. అందుకు భిన్నంగా అలాంటిదేమీ లేకుండా ఉండటం విమర్శలకు తావిస్తోంది. ఇలా జరిగితే.. ప్రభుత్వం ఇచ్చిన ఉచిత నీటి పథకం అమలు కానట్లే కదా? అని ప్రశ్నిస్తున్నారు. ఒక అంచనా ప్రకారం హైదరాబాద్ మహానగరంలో మొత్తం పాతిక వేలకు పైనే అపార్ట్ మెంట్లు ఉన్నాయని చెబుతున్నారు. ఇప్పటివరకు వాటర్ కనెక్షన్ తీసుకునే వేళలో.. అసోసియేషన్ అధ్యక్షుడు.. కార్యదర్శితో పాటు మరికొందరి ఆధార్ కార్డులను అప్లికేషన్ కు జత చేసి కనెక్షన్ తీసుకునే వారు.

ఉచిత నీటి పథకం అమల్లోకి వచ్చిన నేపథ్యంలో.. పలువురు అపార్ట్ మెంట్ వాసులు.. తమ ఆధార్ కార్డులతో లింకు చేసుకున్నారు. అయినప్పటికీ.. బిల్లు మాత్రం.. ఆధార్ తో లింకు చేసుకున్న వారికి కూడా రావటంపై అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇలా అయితే.. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన ఉచిత నీటి పథకం అమలుకానట్లే కదా? అని ప్రశ్నిస్తున్నారు. మరి.. దీనికి హైదరాబాద్ మహానగర జలమండలి ఏం సమాదానం చెబుతుందో చూడాలి.